గత నెల 23న వెలుగు దినపత్రికలో బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బీఎస్ రాములు ‘‘జిల్లాల ఏకీకరణ అవసరమా?’’ అంటూ ఆర్టికల్ రాశారు. గత ప్రభుత్వం అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేసిందని, రెండు ఎమ్మెల్యే నియోజకవర్గాలు కూడా లేని ప్రాంతాన్ని జిల్లాగా చేశారని ఒకవైపు చెబుతూనే.. జరిగిన తప్పు అలాగే ఉండాలని కోరుకుంటున్నారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మీ జిల్లాలు రద్దు చేస్తారని ఆయా జిల్లాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో కేసీఆర్ చెప్పారు. దీంతో జిల్లాల విభజనపై రకరకాల వార్తలు వస్తున్నాయి.
రాజకీయ, కుటుంబ అవసరాల కోసం జిల్లాల ఏర్పాటు
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక పరిపాలన సౌలభ్యం కోసం కేసీఆర్ సర్కార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చట్టం-1974 ప్రకారం కొత్తగా 23 జిల్లాలను ఏర్పాటు చేసింది. దీంతో మొత్తం జిల్లాల సంఖ్య 33కు చేరింది. కొత్త జిల్లాల్లో నూతన కలెక్టరేట్ భవనాలను నిర్మించింది. జిల్లాలతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలను కూడా ఏర్పాటు చేసింది. జిల్లాల విభజన మంచిదే. అయితే అది అశాస్త్రీయంగా జరిగినట్టు కనిపిస్తోంది. కేవలం రియల్ ఎస్టేట్ భూమ్ పెంచుకోవడానికి జిల్లాలను ఇష్టమొచ్చినట్టు పెంచారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఒకవ్యక్తి కోసం జిల్లాను ఏర్పాటు చేశారన్న వాదనలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు రాజన్న సిరిసిల్ల.. మొదట్లో ఈ జిల్లా లేదు. కొన్ని జిల్లాల్లో ఒకే ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. వీటి వెనుక రాజకీయ కారణాలు, ఆర్థిక కారణాలు, కుటుంబ అవసరాల కోసం జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి.
33 కేసీఆర్ సెంటిమెంటా..ప్రజల అవసరమా?
కొత్త జిల్లాలు కావాలన్న డిమాండ్లు ఉన్నా 33 జిల్లాలు కావాలని ప్రతిపక్షాలు కానీ, మేధావులు కానీ కోరలేదు. ఎలాంటి నివేదికలు అందజేయలేదు. ఉదాహరణకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాను ఏడు ముక్కలు చేసి, నాలుగు జిల్లాలు ఏర్పాటు చేశారు. చరిత్ర ప్రసిద్ధి పొందిన వరంగల్ జిల్లాను 6 జిల్లాలు చేసి, గ్రేటర్ వరంగల్ పరిధిని రెండు ముక్కలు చేసి. హనుమకొండ జిల్లా, వరంగల్ జిల్లాలుగా విడగొట్టారు.
హనుమకొండ ప్రాంతం వరంగల్ నగరంలో కొత్తగా అభివృద్ధి చెందిన ప్రాంతం మాత్రమే. ఈ నగరాన్ని విడగొట్టకుండా ఒకే వరంగల్ జిల్లాగా ఉండాలని ప్రజలు భావిస్తున్నారు. సెంటిమెంట్ కోసం అప్పటి సీఎం కేసీఆర్ జిల్లాల సంఖ్యకు 33కు పెంచారన్న ఆరోపణలు ఉన్నాయి.
జిల్లాల విభజనతో కొత్త సమస్యలు
కొత్త జిల్లాలతో కొత్త సమస్యలు మొదలయ్యాయి. ఉదాహరణకు మహబూబ్‌నగర్ జిల్లాను మహబూబ్‌నగర్, నారాయణ పేట, వనపర్తి, నాగర్ కర్నూలు, జోగులాంబ గద్వాల జిల్లాలుగా ఏర్పాటు చేయడంతో పాటు కొన్ని మండలాలను తీసుకొచ్చి వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కలిపారు. ఇలా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఏడు జిల్లాల పరిధిలోకి వెళ్లింది. మహబూబ్ నగర్ ఎంపీ ఏదైనా సమస్యను పరిష్కరించాలంటే 5,6 జిల్లాల అధికారులతో మాట్లాడాల్సి వస్తుందని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. జిల్లాల విభజనలో శాస్త్రీయత కొరవడిందని ఏ కొత్త జిల్లాను చూసినా అర్థమవుతుంది.
సిబ్బంది కొరత
కొత్త జిల్లాల ఏర్పాటుతో విపరీతంగా సిబ్బంది కొరత ఏర్పడింది. కలెక్టర్లు, ఎస్పీలుగా ఐఏఎస్, ఐపీఎస్ లు కావాల్సి వచ్చింది. దీంతో యువ ఐఏఎస్, ఐపీఎస్ లను తగినంత అనుభవం లేకున్నా కలెక్టర్లు, ఎస్పీలుగా నియమించింది కేసీఆర్ సర్కార్. కొత్త జిల్లాల్లో కలెక్టరేట్లు కట్టినా సిబ్బంది కేటాయించలేదు. అవసరాన్నిబట్టి, శాస్త్రీయంగా అధ్యయనం చేసి 18 నుంచి 20 జిల్లాలు ఏర్పాటు చేస్తే మంచిది.
- కూర సంతోష్, సీనియర్ జర్నలిస్ట్