
దేశవ్యాప్తంగా బొగ్గు గనుల్లో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు ఆఫీసర్లకు ఇక నుంచి ఒకే రకమైన డ్రెస్‌కోడ్ అమలు కానుంది. మనమందరం ఒక్కటేననే భావనను తీసుకురావడంతో పాటు సామాజిక తేడాలను దూరం చేసేందుకు ఈ యూనిఫామ్ గుర్తుగా నిలుస్తుందని భావిస్తున్నారు.
కార్మికుడి నుంచి చైర్మన్వరకు ఒకే తీరు దుస్తులు వేసుకునేలా చర్యలు చేపట్టాలని ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో కోలిండియా యాజమాన్యం నిర్ణయించింది. కోలిండియా, సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులు ఒకే రకమైన వేతనాలు, ప్రయోజనాలు పొందుతున్నారు. అదే విధంగా యూనిఫాం డ్రెస్ కోడ్ కూడా ఒకే రకంగా ఉండాలని కోలిండియా స్థాయి ప్రత్యేక కమిటీ భావించింది.
దుస్తులు కొనుగోలు చేసుకునే చాన్స్ ఉద్యోగులకే..
కోలిండియా యాజమాన్యం ప్రత్యేక కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఉద్యోగులే స్వయంగా యూనిఫాంకు బట్టలు కొనాల్సి ఉంటుందని పేర్కొంది. పురుషులకు నేవీ బ్లూ ప్యాంట్, స్కైబ్లూ షర్ట్, మహిళా సిబ్బందికి మెరూన్ కలర్ కుర్తా, బ్లాక్ కలర్ సల్వార్, దుపట్టా లేదంటే మెరూన్ బ్యాక్‌గ్రౌండ్ శారీ, బ్లాక్కలర్బ్లౌజ్ధరించాలని నిర్ణయించారు. దీంతో పాటు కాంట్రాక్ట్ కార్మికులకు డ్రెస్ కోడ్ కూడా అమలు చేయనున్నారు. యాజమాన్యం కొనుగోలు చేస్తే క్వాలిటీ ప్రమాణాల్లో తేడా ఉంటుందని, ప్రత్యేక కమిటీ సూచించిన రంగులో దుస్తులను కొనుగోలు చేసుకునే చాన్స్ ఉద్యోగులకు కల్పించింది.
ఫ్యాబ్రిక్ నాణ్యతను దృష్టిలో ఉంచుకుని రేమండ్, రామ్‌రాజ్‌కాటన్, అరవింద్లిమిటెడ్, లూయిస్ ఫిలిప్, వర్ధమాన్ టెక్స్టైల్, బ్లాక్‌బెర్రీ, విస్పాన్ఇండియా, ట్రైడెంట్‌గ్రూప్ వంటి కంపెనీలు తీసుకోవాలంటూ పేర్కొంటోంది. ఈ యూనిఫాం కోసం ప్రతి ఉద్యోగికి సంవత్సరానికి ఒకసారి రూ.10,500 చెల్లించాలని, నెలకు రూ.185 వాషింగ్అలవెన్సు కింద ఇవ్వనునట్లు కోలిండియా తెలిపింది. సింగరేణి కంపెనీ ఉద్యోగులు ఇప్పటికే నేవీ బ్లూ యూనిఫాం ధరిస్తున్నప్పటికి అందరు వాడటంలేదు.
కోలిండియాలో కాంట్రాక్ట్ కార్మికులతో కలిపి మొత్తంగా 3,69,000 ఉద్యోగులు, ఆఫీసర్లు పనిచేస్తుండగా సింగరేణిలో సుమారు 44వేల మంది ఉద్యోగులు, ఆఫీసర్లు, మరో 25వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా త్వరలో కొత్త డ్రెస్‌కోడ్‌ను అనుసరించనున్నారు.