
మంచిర్యాల, వెలుగు: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన విద్యా విధానం 2020తో అంగన్వాడీ సెంటర్లు రద్దయ్యే ప్రమాదముందని సీఐటీయూ అనుబంధ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు అన్నారు. నూతన విద్యా విధానాన్ని నిరసిస్తూ రాష్ర్టవ్యాప్త ఆందోళనలో భాగంగా సోమవారం మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట 48 గంటల ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మూడు నుంచి ఆరేండ్ల పిల్లలను విద్యాశాఖలో విలీనం చేసి అంగన్వాడీల వ్యవస్థను ధ్వంసం చేసే కుట్ర జరుగుతోందన్నారు. ఎన్ఈపీని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని, పీఎం శ్రీ, మొబైల్ అంగన్వాడీ సెంటర్లను రద్దు చేయాలని, వేతన బకాయిలను, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను వెంటనే చెల్లించాలని, అంగన్వాడీ సెంటర్లకూ సమ్మర్ హాలీడేస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ధర్నాకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం కలెక్టరేట్ ఎదుట వంటావార్పు చేశారు.
పీఎంశ్రీ, మొబైల్ అంగన్‌వాడీలను రద్దు చేయాలి
ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేసే పీఎం శ్రీ పథకం, మొబైల్ అంగన్వాడీ సెంటర్లను, ఎన్ఈపీని ప్రభుత్వం రద్దు చేయాలని అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కె.సునీత డిమాండ్ చేశారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ రాష్ర్ట కమిటీ పిలుపు మేరకు ఈ నెల17, 18 తేదీల్లో కలెక్టరేట్ ముందు 48 గంటల ధర్నా, వంటావార్పులో భాగంగా సోమవారం అంగన్వాడీలు కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. వారి ధర్నాకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాల ద్వారా ఐసీడీఎస్ ను నిర్వీర్యం చేయాలని చూస్తోందన్నారు. నూతన జాతీయ విద్యా విధానం చట్టాన్ని తీసుకువచ్చిందని పేర్కొన్నారు. ఐసీడీఎస్ వ్యతిరేక విధానాల అమలును రాష్ట్రంలో వెంటనే ఆపాలని, ఎన్ఈపీ ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు బొజ్జ ఆశన్న, అన్నమొల్ల కిరణ్ , జిల్లా ఉపాధ్యక్షులు లింగాల చిన్నన్న, అగ్గిమల్ల స్వామి, తదితరులు పాల్గొన్నారు.