ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ విజయ దుందుభి మోగించగా.. తెలంగాణలో కాంగ్రెస్.. మిజోరాంలో జెడ్పీఎం విజయం సాధించాయి. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డిని ఇప్పటికే ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. మిజోరాం మినహా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే ఇప్పుడు అందరి దృష్టి ఆ మూడు రాష్ట్రాల సీఎం అభ్యర్థులపైనే..సిట్టింగ్ లకు, సీనియర్లకు సీఎం పదవిని కట్టబెడతారా.. లేఖ కొత్త వారికి అవకాశం ఇస్తారా.. ఆ మూడు రాష్ట్రాల్లో సీఎం ఎంపికపై బీజేపీ ఏం ప్లాన్ చేస్తోంది అని దానిపై ఇప్పుడు చర్చ సాగుతోంది.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్ లలో సీఎం పీఠాన్ని పాతవారికి కట్టబెడుతుందా.. కొత్తవారిని సీఎం సీటులో కూర్చోబెడుతుందా?
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లలో ముఖ్యమంత్రులుగా కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త సీఎం ల ఎంపిక బీజేపీలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. సీనియర్ బీజేపీ నేతలు, మాజీ సీఎంలు అయిన వసుంధర రాజే,శివరాజ్ సింగ్ చౌహాన్, రమణసింగ్ లకు ఈ వార్త నచ్చకపోవచ్చు. ప్రధానిమోదీ, అమిత్ షా జోడీ సర్ ఫ్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమతున్నాట్లు తెలుస్తోంది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించినా.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇదే జోరు కొనసాగించాలని బీజేపీ భావిస్తోంది. అందుకే నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం ఈ సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తోంది. 2014 నుంచి తన వ్యూహాత్వకంగా వ్యవహరిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్య నాథ్ ను సీఎం చేయడం అయినా..ఉత్తరాఖండ్ సీఎంను మార్చడం వంటి నిర్ణయం అయినా అందరిని ఆశ్చర్యపర్చేవే. ఈసారి కూడా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల పేర్లపై చర్చ మొదలైంది. మంగళవారంరాత్రి (డిసెంబర్05) ప్రధాని మోదీ నివాసంలో సుమారు 5 గంటల పాటు జరిగిన సమావేశంలో సీన్ అంతా మారిపోయింది.
ప్రధాని మోదీ నివాసంలో జరిగిన సమావేశానికి బీజేపీ చీఫ్ నడ్డా కూడా హాజరయ్యారు. అంతకుముందు అమిత్ షా, నడ్డా.. మూడు రాష్ట్రాల ఇన్ ఛార్జ్ లతో గంటల తరబడి చర్చించారు. ఈక్రమంలో త్వరలో రాజస్థాన్, ఎంపీ, ఛత్తీస్ గఢ్, పరిశీలకుల పేర్లను బీజేపీ ప్రకటించనుంది. పరిశీలకులు రాష్ట్రాలకు వెళ్లి కొత్త ఎమ్మెల్యేలను కలుసుకొని వారి అభిప్రాయాలు అంచనావేసి తర్వాత శాసనసభా పక్ష నేతను ఎన్నుకోనున్నారు.
కాబోయే సీఎంల కోసం బీజేపీ ఎలా ఎంపిక చేస్తుంది
2024 సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ విజయానికి ఎలాంటి అడ్డంకి కలిగించని నాయకులనే మూడు రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రులుగా చేసేందుకు బీజేపీ యత్నిస్తోంది. మచ్చలేని, వివాదాలకు దూరంగా ఉంటే ముఖాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటోంది. బీజేపీ తదుపరి లక్ష్యం 2024 సార్వత్రిక ఎన్నికలే. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం పదవికి ఎంపిక కానున్న ప్రముఖులకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ ప్లాన్. బీజేపీ కూడా సీఎం ముఖం యొక్క యూటిలిటీ ఫ్యాక్టర్ ను పరిశీలిస్తోంది.
మూడు రాష్ట్రాల్లో రాజకీయ, సామాజిక సందేశాన్ని అందించే సీఎంలు కావాలని బీజేపీ కోరుకుంటోంది. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని పార్టీకి ప్రాధాన్యత ఇచ్చే నాయకులకు సీఎం కుర్చీ కట్టబెట్టాలని నిర్ణయించింది. పార్టీ గ్లామర్ కాకుండా పనిపై దృష్టి పెట్టే ముఖం కోసం బీజేపీ సెర్చింగ్ ప్రారంభించింది. ఇందుకోసం నాలుగు పాయింట్ల ఫార్ములా సిద్ధం చేసింది బీజేపీ.
మూడు రాష్ట్రాల్లోనూ స్థానికంగా ఫ్యాక్షనిజం కనిపిస్తోంది. దీన్ని అరికట్టడంతోపాటు పార్టీని బలోపేతం చేసే నాయకుడిని సీఎం గా ఎన్నికోవాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.
సీఎం రేసులో ఉన్న కొత్త ముఖాలు
మధ్యప్రదేశ్ లో సిట్టింగ్ సీఎం శివరాజ్ సింగ్ .. మళ్లీ అతనే సీఎం కావాలని వాదన బలంగా ఉన్నా.. మారిన పార్టీ వ్యూహం ప్రకారం శివరాజ్ సింగ్ చౌహాన్ ను పక్కకు పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం రేసులో కొత్త ముఖాలుగా కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ పటేల్,జ్యోతిరాదిత్య సింధియా, నరేంద్ర తోమర్ లతో పాటు కైలాష్ విజయ వర్గీయ పేరు కూడా వినిపిస్తోంది.
మరోవైపు రాజస్థాన్ లో సీఎం పదవికోసం బీజేపీలో పలువురు నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. సీఎం క్యాండిడేట్ గా మాజీ సీఎం వసుంధర రాజే పేరు బలంగా వినిపిస్తున్నా.. కొత్త ముఖాలుగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ రామ్ మేఘ్వాల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషి, బీజేపీ నేతలు దియా కుమారి, మహంత్ బాలక్ నాథ్ ల పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.
ఛత్తీస్ గఢ్ లో మాజీ సీఎం రమణసింగ్.. సీఎం రేసులో ఉన్న మొదటి వ్యక్తి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అరుణ్ కుమార్ సావో, ప్రతిపక్ష నేత ధర్మలాల్ కౌశిక్, మాజీ ఐపీఎస్ ఓపీ చౌదరి పేర్లు కూడా సీఎం రేసులో పోటీదారులుగా ఉన్నారు.
2024 సార్వత్రిక ఎన్నికలు, పార్టీ బలోపేతం పై దృష్టి సారించిన బీజేపీ అధిష్టానం ఈ మూడు రాష్ట్రాలకు ఎవరిని సీఎం గా ఎంపిక చేస్తుంది..ఎవరిని సీఎం పీఠం వరిస్తుందో అధిష్టానం నిర్ణయంపై ఆధారపడి ఉంది.
Aslo Read :-మన గుండెకు వాలంటీర్ల రక్ష : 10 లక్షల మందికి సీపీఆర్ ట్రైనింగ్