![నర్సాపూర్ అర్బన్ పార్క్ కు కొత్త హంగులు](https://static.v6velugu.com/uploads/2025/02/new-features-for-narsapur-urban-park_x8DmX6jG3o.jpg)
- టూరిస్టుల కోసం కాటేజీలు, రిసార్ట్‌ల నిర్మాణం
- రూ.3 కోట్లతో పనులు ప్రారంభం
మెదక్, నర్సాపూర్, వెలుగు : ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటున్న నర్సాపూర్ అర్బన్ పార్క్ సందర్శకులను మరింత ఆకర్షించేలా రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే సందర్శనకు అవకాశం ఉండగా కొత్తగా కాటేజీలు నిర్మిస్తుండడంతో పాటు, రిసార్ట్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటివల్ల టూరిస్టులు రాత్రి అర్బన్ పార్క్ లో బస చేయడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు దగ్గరలో బాలనగర్- మెదక్ నేషనల్ హైవేను ఆనుకుని ఉన్న నర్సాపూర్ అడవిలో ఫారెస్ట్ 2. వో స్కీంలో భాగంగా రూ.20 కోట్లతో 2,765 హెక్టార్ల విస్తీర్ణంలో అర్బన్ పార్క్ ఏర్పాటు చేశారు.
ఆకట్టుకునేలా..
అడవి చుట్టూరా ఏడు కిలోమీటర్ల మేర ఫెన్సింగ్, సందర్శకులు లోపలికి వెళ్లేందుకు వీలుగా రెండు మెయిన్ గేట్లను ఏర్పాటు చేశారు. అడవి అందాలను తిలకించేందుకు వీలుగా ఎత్తైన వాచ్ టవర్ నిర్మించారు. సందర్శకులు కూర్చునేందుకు కుర్చీలు సిద్ధం చేశారు. అడవిలో నీరు పారే ప్రాంతాల్లో చిన్న పాటి వంతెనలు నిర్మించారు. వాకింగ్, సైక్లింగ్ కు అనువైన ఏర్పాట్లు చేశారు. అర్బన్ పార్క్ అభివృద్ధి చేశాక ఇక్కడికి వచ్చే సందర్శకుల సంఖ్య బాగా పెరిగింది. ముఖ్యంగా ఆదివారాలు, ఇతర సెలవు రోజులు, సమ్మర్ హాలిడేస్ లో సందర్శకులు ఎక్కువగా వస్తున్నారు.
ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో..
నేచర్ ను ఇష్టపడే వారు ఎక్కువగా అర్బన్ పార్క్ లో రాత్రి బస చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 10 కాటేజీలు నిర్మించారు. ఇవి కాకుండా పీపీపీ (ప్రభుత్వ, ప్రైవేట్భాగస్వామ్యం) విధానంలో రూ.3 కోట్ల వ్యయంతో ఆధునిక హంగులతో 22 కాటేజీలతో పాటు, రిసార్ట్, గెస్ట్ హౌస్ లు, కిచెన్, డైనింగ్ హాల్, ఫంక్షన్ హాల్, ఓపెన్ హోటల్, స్విమ్మింగ్ ఫూల్ నిర్మిస్తున్నారు.
ఏప్రిల్ లో అందుబాటులోకి
నర్సాపూర్ అర్బన్ పార్క్ లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిర్మించిన 10 కాటేజీలు రెడీగా ఉన్నాయి. ఓ ప్రైవేట్ సంస్థ నిర్మిస్తున్న కాటేజీలు, రీసార్ట్, స్విమ్మింగ్ ఫూల్, ఫంక్షన్ హాల్ పనులు 60 శాతం వరకు పూర్తయ్యాయి. ఏప్రిల్ వరకు అందుబాటులోకి వస్తాయి. దీంతో సందర్శకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. నర్సాపూర్ అర్బన్ పార్క్, ఏడుపాయల, మెదక్ చర్చి, ఖిల్లా, పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీలను కలిపి టూరిస్ట్ సర్క్యూట్ ఏర్పాటుచేసే ఆలోచన కూడాఉంది.
- జోజి, డీఎఫ్ వో, మెదక్