- పాత సంఘాలతోనే ఎన్నికలకు సిద్ధమైన అధికారులు
- కొత్త సోసైటీలకు సమాచారం ఇవ్వకుండానే ఓటరు జాబితా
- అడ్‌హక్ కమిటీ ఏర్పాటు చేసినా నిరుపయోగం
- కమిటీ తీరు, మత్స్య శాఖ అధికారులపై విమర్శలు
సూర్యాపేట, వెలుగు: జిల్లాలోని మత్య్స సహకార కొత్త సొసైటీలను ఆ శాఖ అధికారులు లైట్ తీసుకుంటున్నారు. పాత సొసైటీలతోనే జిల్లా సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. కొత్తగా ఏర్పడ్డ సంఘాలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పాత సభ్యులతో ఓటరు జాబితా రూపొందించడంపై విమర్శలు వస్తున్నాయి. ఎనిమిది నెలల కిందనే పాత సంఘాల పదవీ కాలం ముగియగా.. అడ్‌హక్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో కొత్త సభ్యులను చేర్చుకోవాల్సి ఉన్నా పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి.
గత జూన్‌లో ముగిసిన పదవీ కాలం
ఉమ్మడి జిల్లాలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల పదవీకాలం 2023 జూన్‌లో ముగిసింది. అధికారులు వీటిని రద్దు చేసి 2023 సెప్టెంబర్‌లో తాత్కలికంగా అడ్‌హక్ కమిటీని ఏర్పాటు చేశారు. అనంతరం కొత్త జిల్లాల వారీగా ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలతో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా సొసైటీల ఏర్పాటుకు తీర్మానం చేసి కొత్త జిల్లాల పేరుతో సొసైటీలను రిజిస్ట్రేషన్ చేశారు. అడ్‌హక్ కమిటీ ఏర్పాటు చేసిన ఆరు నెలల్లోగా జిల్లా సొసైటీల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.
జిల్లాలో 160 సంఘాలు
స్టేట్ కో–ఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీ ఆధ్వర్యంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఎన్నికలు నిర్వహిస్తారు. సూర్యాపేట జిల్లాలో 475 పంచాయతీలు, 5 మున్సిపాలిటీల పరిధిలో 850 చెరువులు ఉన్నాయి. ఇందులో 650 సొసైటీ చెరువులు, 200 గ్రామ పంచాయతీ చెరువులు ఉన్నాయి. కాగా, సొసైటీ చెరువుల పరిధిలో 160 ప్రాథమిక మత్య్స సహకార సంఘాలు, 1800 మంది సభ్యులు ఉన్నారు. కాగా, అడహక్ కమిటీ ఏర్పాటు నాటికి జిల్లా మత్య్స సహకార సంఘంలో 102 మంది సభ్యత్వం కలిగి ఉన్నారు. అయితే ఈ కమిటీ ఏర్పాటు తర్వాత జిల్లాలో మరో 18 సంఘాలు ఏర్పడ్డాయి. కానీ, అధికారులు ఈ సంఘాల సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పాత సభ్యులతోనే ఓటరు జాబితా సిద్ధం చేశారు.
అడ్‌హక్ కమిటీ నిరుపయోగం
కొత్త జిల్లాల వారీగా మత్య్స సహకార సంఘాలను ఏర్పాటు చేసేందుకు ఎన్నుకున్న అడ్‌హక్ కమిటీ నిరుపయోగంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. ఈ కమిటీ సభ్యులు గ్రామల్లో మత్య్స కారులకు అవగహన కల్పించి వారితో ప్రాథమిక సొసైటీలను ఏర్పాటు చేయించాలి. ఈ సొసైటీల అధ్యక్షులను జిల్లా కమిటీలో చేర్పించాలి. కానీ, అడ్‌హక్ కమిటీ ఏర్పాటుకు ముందు జిల్లా కమిటీలో 102 మంది సభ్యులు ఉండగా. ఇప్పుడు అంతే మంది ఉన్నారు. ఒక్కరిని కూడా కొత్త వారిని చేర్చలేదని, ఈ కమిటీ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని కొత్త సొసైటీ సభ్యులు మండిపడుతున్నారు.
ఎలాంటి సమాచారం ఇవ్వలేదు
జిల్లాలో నూతనంగా ఏర్పడ్డ సంఘాలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఓటరు జాబితా సిద్ధం చేశారు. ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేసే నాటికే జిల్లాలో మరో 18 కొత్త సంఘాలు ఏర్పడ్డాయి. ఈ సంఘాలకు సమాచారం ఇచ్చి సభ్యత్వం కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కలెక్టర్ స్పందింది కొత్త సంఘాలను జిల్లా కమిటీలో చేర్చాలి.
- పిట్టల శంకర్,
ఉయ్యాలవాడ సొసైటీ అధ్యక్షుడు