- స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల కంట్రోల్‌కు కొత్త చట్టం
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదం - సర్కార్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం
- రాష్ట్ర కేబినెట్ నిర్ణయం.. 9 గంటలు సాగిన భేటీ
- గవర్నమెంట్ బడుల బలోపేతానికి రూ. 7,289 కోట్లు
- రాష్ట్రంలో కొత్తగా ఫారెస్ట్ వర్సిటీ, మహిళా వర్సిటీ
- అన్ని ప్రాజెక్టులకు లోన్ లింకేజీ.. మంజీరా కార్పొరేషన్ ఏర్పాటు
- చనకా కోరాటా బ్యారేజీ
- అంచనా వ్యయం రూ.795.94 కోట్లకు పెంపు
- ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్
- ఇన్స్టిట్యూట్ లో చదివితే ఫారెస్ట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్
హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు కొత్త చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ చట్టాన్ని ఆమోదించనున్నారు. అదేవిధంగా సర్కారు స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని, ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యాశాఖను కేబినెట్ ఆదేశించింది. గవర్నమెంట్ స్కూళ్ల బలోపేతం, నాణ్యమైన విద్యాబోధన, మెరుగైన మౌలిక వసతుల కోసం ‘మన ఊరు–మన బడి’ కార్యక్రమం కింద రూ. 7,289 కోట్లు కేటాయించేందుకు ఓకే చెప్పింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి మరిన్ని అప్పులు చేసేందుకు మంజీరా కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రగతి భవన్లో సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. రాత్రి 11.10 గంటల వరకు సాగిన ఈ భేటీలో పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను హెల్త్ మినిస్టర్ హరీశ్‌రావు కేబినెట్‌కు వివరించారు. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రజలు గుంపులుగా గుమిగూడొద్దని, స్వీయ నియంత్రణతోనే కరోనాను కట్టడి చేయవచ్చని ఆయన అన్నారు.
11 మంది మంత్రులతో సబ్‌కమిటీ
ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల నియంత్రణపై పూర్తిస్థాయి స్టడీ చేసి విధివిధానాలను రూపొందించేందుకు 11 మందితో కేబినెట్ సబ్ కమిటీని మంత్రి మండలి ఏర్పాటు చేసింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన ఈ కమిటీ పనిచేయనుంది. రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీ ఏర్పాటు కోసం మంత్రి సబితాఇంద్రారెడ్డి చేసిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాబోయే కేబినెట్ సమావేశానికి పూర్తిస్థాయిలో ప్రపోజల్స్ రెడీ చేసుకుని రావాలని సీఎస్‌ను ఆదేశించింది. ఫారెస్ట్ యూనివర్సిటీ ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అటవీశాఖ అధికారులు ఈ దిశగా ప్రాథమిక సమాచారంతో కూడిన నివేదికను అందించగా.. వచ్చే కేబినెట్ భేటీ నాటికి పూర్తిస్థాయి రిపోర్ట్‌ను సిద్ధం చేసుకొని రావాలని అటవీశాఖ అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో నిర్మించే అన్ని ప్రాజెక్టులకు లోన్ లింకేజీ తప్పనిసరి అని కేబినెట్ తేల్చిచెప్పింది. సంగారెడ్డి జిల్లాలోని సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు నిధుల సేకరణ కోసం ‘మంజీరా లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్ లిమిటెడ్’ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి ఇరిగేషన్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్‌గా ఉంటారు. ఈఎన్సీ(జనరల్), ఈఎన్సీ(గజ్వేల్), ఆర్థిక శాఖ, ఇరిగేషన్ శాఖ జాయింట్ సెక్రటరీలు, సంగారెడ్డి చీఫ్ ఇంజనీర్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తారు. సిద్దిపేట జిల్లాలో మల్లన్నసాగర్ నుంచి తపాస్ పల్లి జలాశయానికి లింక్ కాలువ తవ్వకానికి రూ.388.20 కోట్లు, వనపర్తి జిల్లా బుద్దారం గ్రామంలో ఉన్న పెద్దచెరువుకు రూ.44.71 కోట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పింది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించ తలపెట్టిన ఘన్పూర్ బ్రాంచి కాలువ పనుల కోసం రూ.144.43 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది.
చనకా కోరాటా బ్యారేజీ అంచనా వ్యయం పెంపు
ఆదిలాబాద్ జిల్లాలో పెన్ గంగా నదిపై నిర్మిస్తున్న చనాకా కోరాటా బ్యారేజీ అంచనా వ్యయం రూ.795.94 కోట్లకు పెంచేందుకు మంత్రివర్గం ఆమోదించింది. ఇప్పటికే బ్యారేజీ నిర్మాణం పూర్తవగా.. పంప్‌హౌస్ నిర్మాణం కొనసాగుతున్నది. మెదక్ జిల్లాలో నిజాం కాలంలో నిర్మించిన ఘన్ పూర్ ఆనకట్ట కాలువల వ్యవస్థను గతంలో ఆధునీకరించారు. అందులో మిగిలిపోయిన మరికొన్ని పనులు చేపట్టేందుకు గాను రూ. 50.32 కోట్లకు కేబినెట్ పరిపాలనా అనుమతి ఇచ్చింది. అదేవిధంగా వనపర్తి, గద్వాల జిల్లాల్లో 11 చెక్ డ్యాంల నిర్మాణానికి గాను రూ. 27.36 కోట్లకు పరిపాలనా అనుమతి ఇచ్చింది. వనపర్తి జిల్లాలో పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలోని గోపాల సముద్రం చెరువు పనుల కోసం రూ.10.01 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. గద్వాల జిల్లాలో ప్రతిపాదించిన నలసోమనాద్రి గట్టు ఎత్తిపోతల పథకానికి సవరించిన అంచనా వ్యయం రూ. 669 కోట్లకు అనుమతి ఇచ్చింది. అదేవిధంగా ఆ ప్రాజెక్టు పనులకు టెండర్లు పిలిచేందుకు ఓకే చెప్పింది. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని వెల్లటూరు గ్రామం వద్ద ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ నుంచి నిర్మించనున్న ఎత్తిపోతల పథకానికి, పాల్కేడ్ మండలం గుండెబోయిన గూడెం వద్ద జాన్ పహాడ్ బ్రాంచ్ కెనాల్ నుంచి నిర్మించనున్న ఎత్తిపోతల పథకానికి రూ.16.23 కోట్లు కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. దేవాదుల పథకంలో భాగంగా ఎత్తయిన ప్రాంతాలకు సాగు నీరు అందించడానికి గండి రామారం చెరువు నుంచి కన్నారం చెరువు వరకు పంప్ హౌజ్, కాలువ పనులకు.. గుండ్ల సాగర్ నుంచి లౌక్య తండా వరకు పైప్ లైన్ పనులకు.. నశ్కల్ జలాశయం వద్ద పంప్ హౌస్ నిర్మాణానికి మొత్తంగా రూ. 104.92 కోట్ల ఇచ్చేందుకు ఓకే చెప్పింది.
ఎఫ్సీఆర్ఐలో చదివితే జాబ్స్‌లో రిజర్వేషన్
సిద్దిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఎఫ్సీఆర్ఐ)లో చదివిన వారికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాల భర్తీలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద రిజర్వేషన్లు కల్పించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ కాలేజీలో బీఎస్సీ ఫారెస్ట్రీ (హానర్స్) నాలుగేండ్ల డిగ్రీ కోర్సును అందిస్తున్నారు. అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (ఏసీఎఫ్) విభాగంలోని ఉద్యోగాల్లో 25 % రిజర్వేషన్లు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్వో) విభాగానికి చెందిన ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్లు, ఫారెస్టర్స్ విభాగానికి చెందిన ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ సర్వీస్ రూల్స్ (1997), తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ (2000)లో సవరణలు చేపట్టాలని నిర్ణయించింది.
వ్యాక్సినేషన్ కంప్లీట్ చేయాలి
కరోనా పరిస్థితులపై కేబినెట్ చర్చించింది. రాష్ట్రంలో ఇప్పటికే 5 కోట్ల వాక్సిన్ డోసులు ఇచ్చామని, అర్హులైన అందరికీ వాక్సిన్ ఇస్తామని హెల్త్ మినిస్టర్ హరీశ్‌రావు చెప్పారు. మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారుల సాయం తీసుకొని వాక్సినేషన్‌ను పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ఇందుకు అన్నిజిల్లాల మంత్రులు, కలెక్టర్లు సమీక్షా సమావేశాలు నిర్వహించుకోవాలని ఆయన సూచించారు.
సీఎం వరంగల్ టూర్ రద్దు
సీఎం కేసీఆర్ మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తారని, అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారని సోమవారం సాయంత్రం కేబినెట్ ప్రకటించినప్పటికీ.. టూర్‌ను రద్దు చేసుకున్నట్లు అర్ధరాత్రి సీఎంవో తెలిపింది. వ్యవసాయ శాఖ మంత్రి, సీఎస్ సహా ఇతర ఉన్నతాధికారులు మాత్రం వెళ్తారని పేర్కొంది. కాగా, వానాకాలం వడ్ల కొనుగోళ్ల పరిస్థితులపైనా కేబినెట్ చర్చించింది. అకాల వర్షాల వల్ల కొన్ని జిల్లాల్లో వడ్లు ఇంకా కొనుగోలు సెంటర్లకు వస్తున్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని ధాన్యం కొనుగోళ్లు మొత్తం అయ్యేవరకు కేంద్రాలను కొనసాగించాలని ఆఫీసర్లను సీఎం కేసీఆర్ ఆదేశించారు.