ఐపీఎల్‌లో కొత్త ఫ్రాంచైజీ!

ఐపీఎల్‌లో కొత్త ఫ్రాంచైజీ!

అహ్మదాబాద్‌ బేస్‌‌గా న్యూటీమ్‌
బడా కార్పొరేట్ల ప్రయత్నాలు

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌లో మరో కొత్త ఫ్రాంచైజీని తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్‌‌ బేస్‌‌గా కొత్త టీమ్‌‌ను తయారు చేసేందుకు కొన్ని కార్పొరేట్‌‌ సంస్థలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ మేరకు బీసీసీఐ కూడా వారితో అనధికారికంగా చర్చలు మొదలుపెట్టినట్లు సమాచారం. వాస్తవానికి ఈ ఏడాది ఐపీఎల్‌‌ బాగా లేట్‌‌గా జరగడంతో.. ఆరు నెలల గ్యాప్‌‌తోనే  వచ్చే సీజన్‌‌ను మొదలుపెట్టాల్సి ఉంది. దీంతో మెగా వేలాన్ని మరో ఏడాది వాయిదా వేద్దామని బీసీసీఐ భావించింది. కానీ వచ్చే సీజన్‌‌లో కచ్చితంగా తమ ఫ్రాంచైజీ ఉండేలా  కార్పొరేట్‌‌ జెయింట్స్‌‌ పావులు కదపడంతో  ఇండియన్‌‌ బోర్డు దిగి రాక తప్పలేదు. దీంతో 2021 సీజన్‌‌కు ముందే పూర్తి స్థాయి వేలాన్ని నిర్వహించేందుకు బోర్డు ప్లాన్స్‌‌ సిద్ధం చేస్తోంది. జనవరి లేదా ఫిబ్రవరి మధ్యలో ఈ వేలం ఉండే చాన్స్‌‌ ఉంది. కొత్త ఫ్రాంచైజీని తీసుకోవడం వల్ల కరోనాతో ఏర్పడిన ఆర్థిక లోటును కూడా భర్తీ చేసుకోవచ్చని బీసీసీఐ భావిస్తోంది. అందుకే  తొమ్మిదో టీమ్‌‌ గురించి ఇప్పటికే మిగతా ఎనిమిది ఫ్రాంచైజీలకు సమాచారం కూడా అందించింది. అయితే ఈ విషయంలో ఐపీఎల్‌‌ గవర్నింగ్‌‌ కౌన్సిల్‌‌ మాత్రం ఇప్పటివరకు ఫ్రాంచైజీలతో అధికారికంగా ఎలాంటి చర్చలు జరపలేదు. కానీ వీలైనంత త్వరలోనే ఇది కార్యరూపం దాల్చుతుందని ఓ ఫ్రాంచైజీ అఫీషియల్‌‌ వెల్లడించారు. ‘ఆక్షన్‌‌తో పాటు కొత్త ఫ్రాంచైజీ గురించి అనధికారిక సమాచారమైతే ఉంది. మూడేళ్లకు ఓసారి మెగా ఆక్షన్‌‌ జరుగుతుంది. అది ఏవిధంగా ఉండబోతుందో స్పష్టత లేదు. ఇక ప్లేయర్‌‌ రిటెన్షన్‌‌పై కూడా క్లారిటీ లేదు. రైట్‌‌ టు మ్యాచ్‌‌ కార్డు ఉంటుందో లేదో కూడా తెలియదు. అయితే వీటన్నింటిని కొనసాగిస్తేనే బాగుంటుంది. ప్లేయర్లందర్ని వేలంలోకి తీసుకురావడం తెలివైన పని కాదు. స్టార్ల మీద కంపెనీ బ్రాండ్‌‌ వాల్యూ ఆధారపడి ఉంటుంది. వాళ్లు లేకపోతే బ్రాండ్‌‌ పడిపోతుంది. కాంప్రమైజ్‌‌ కాలేం’ అని సదరు అఫీషియల్‌‌ వ్యాఖ్యానించారు. ఐపీఎల్‌‌ ఫ్రాంచైజీని తీసుకోవాలనే ఉద్దేశంతోనే మొతేరా స్టేడియాన్ని లక్షా పదివేల కెపాసిటీతో అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్దారని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఐపీఎల్‌‌ను కచ్చితంగా ఇండియాలోనే నిర్వహిస్తామని బీసీసీఐ ప్రెసిడెంట్‌‌ స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో ఫ్రాంచైజీ పనుల్లో కూడా వేగం పుంజుకున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి.

For More News..

మా నేతల ఫోన్లు ట్యాపింగ్​ చేస్తున్నరు

నెల అయినా బురదల్నే.. వరద నుంచి బయటపడని సిటీ కాలనీలు

డిసెంబర్‌ మొదటి వారంలో జీహెచ్ఎంసీ ఎలక్షన్స్