స్టార్టప్​లకు మరిన్ని నిధులు.... రూ.10వేల కోట్లతో కొత్త ఫండ్ ఆఫ్ ఫండ్స్ స్కీమ్​

స్టార్టప్​లకు మరిన్ని నిధులు.... రూ.10వేల కోట్లతో కొత్త ఫండ్ ఆఫ్ ఫండ్స్ స్కీమ్​

 న్యూఢిల్లీ: మనదేశంలో స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి ప్రభుత్వం బడ్జెట్​లో రూ. 10వేల కోట్ల కార్పస్‌‌‌‌తో కొత్త ఫండ్ ఆఫ్ ఫండ్స్ స్కీమ్ (ఎఫ్​ఎఫ్​ఎస్)ను ప్రకటించింది. కేంద్రం 2016లో కూడా  రూ. 10వేల కోట్ల కార్పస్‌‌‌‌తో ఇలాంటి పథకాన్ని ప్రారంభించింది.14వ,15వ ఆర్థిక కమిషన్లు ఈ మొత్తాన్ని మరింత పెంచాయి. వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులను పెంచడానికి ఎఫ్​ఎఫ్​ఎస్​ను ఏర్పాటు చేశారు.  

దీనిని స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌‌‌‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బీ) నిర్వహిస్తుంది. ఇది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) -రిజిస్టర్డ్ ఏఐఎఫ్​లకు మూలధనాన్ని అందిస్తుంది. ఇవి స్టార్టప్‌‌‌‌లలో పెట్టుబడి పెడతాయి.  స్టార్టప్‌‌‌‌ల కోసం ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్​లు) రూ. 91వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వీటికి రూ. 10వేల కోట్ల కార్పస్​తో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫండ్ ఆఫ్ ఫండ్స్ మద్దతు ఇస్తున్నాయని ఆమె చెప్పారు.   

ఈ పథకం కింద మరిన్ని నిధులను అందించాలని డిపార్ట్‌‌‌‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ)తో జరిగిన సమావేశంలో ఏఐఎఫ్​లు డిమాండ్ చేశాయి. స్టార్టప్​లలో పెట్టుబడిపెట్టే  ప్రముఖ ఏఐఎఫ్​లు చిరాటే వెంచర్స్, ఇండియా కోషియంట్, బ్లూమ్ వెంచర్స్, ఐవీక్యాప్, వాటర్‌‌‌‌బ్రిడ్జ్, ఓమ్నివోర్, ఆవిష్కార్, జేఎం ఫైనాన్షియల్  ఫైర్‌‌‌‌సైడ్ వెంచర్స్​కు ఎఫ్​ఎఫ్​ఎస్ ​కింద సాయం అందింది.  ఏఐఎఫ్​లు ఎఫ్​ఎఫ్​ఎస్​ కింద కట్టుబడి ఉన్న మొత్తానికి కనీసం రెండు రెట్లు స్టార్టప్‌‌‌‌లలో పెట్టుబడి పెట్టాలి. 

ఇప్పటికే రూ.20 వేల కోట్ల విలువైన పెట్టుబడులు

గత అక్టోబర్ నాటికి, ఎఫ్​ఎఫ్​ఎస్ -మద్దతు ఉన్న ఏఐఎఫ్​లు స్టార్టప్‌‌‌‌లలో మొత్తం రూ. 20,572.14 కోట్లు పెట్టుబడి పెట్టాయి. దేశంలో ఇన్నోవేషన్లను పెంపొందించడం,  స్టార్టప్‌‌‌‌లను ప్రోత్సహించడం కోసం బలమైన ఎకోసిస్టమ్​ను నిర్మించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 2016లో స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది.  అక్టోబర్ 31, 2024 నాటికి 55 కంటే ఎక్కువ పరిశ్రమలకు చెందిన మొత్తం 1,52,139 సంస్థలను స్టార్టప్‌‌‌‌లుగా గుర్తించారు. 

ఈ యూనిట్లు స్టార్టప్ ఇండియా యాక్షన్​ప్లాన్​ కింద పన్ను,  పన్నుయేతర ప్రోత్సాహకాలను దక్కించుకుంటాయి. వీటిలో 46వేలకుపైగా సంస్థలు వివిధ టెక్నాలజీ,  అనుబంధ పరిశ్రమలలో స్టార్టప్‌‌‌‌లుగా గుర్తింపుపొందాయి. వీటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), బయోటెక్నాలజీ, నానోటెక్నాలజీ, రోబోటిక్స్, టెక్నాలజీ హార్డ్‌‌‌‌వేర్  ఆగ్మెంటెడ్ రియాలిటీ/వర్చువల్ రియాలిటీ వంటివి ఉన్నాయి. స్టార్టప్ ఇండియా చొరవ కింద ప్రభుత్వం, దాని ప్రధాన పథకాలైన ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్ (ఎఫ్​ఎఫ్​ఎస్), స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్  స్టార్టప్స్ కోసం క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ ద్వారా స్టార్టప్‌‌‌‌లకు ఆర్థిక సహాయం అందించింది. డీపీఐఐటీ పర్యవేక్షణ సంస్థ కాగా, సిడ్బీ ఎఫ్​ఎఫ్​ఎస్​కు ఆపరేటింగ్ ఏజెన్సీగా పనిచేస్తుంది.