ఇమ్యూనిటీ రివర్స్​ అయితే తెలుసుకునేందుకు కొత్త డివైజ్

  • వాచ్ సైజు డివైజ్‌‌ను తయారు చేసిన సైంటిస్టులు

కరోనా లేదా మరే ఇతర వైరస్‌‌లైనా శరీరంలో ప్రవేశించినప్పుడు అరుదుగా ఎదురయ్యే తీవ్రమైన సమస్యల్లో ఒకటి సైటోకైన్ స్టార్మ్​. ఈ కండిషన్ వల్ల కీలకమైన అవయవాలు దెబ్బతిని, చివరికి ప్రాణానికే ప్రమాదం వస్తుంది. ఈ సమస్యను ముందుగా గుర్తించి, ట్రీట్‌‌మెంట్ చేస్తే ఆ వ్యక్తిని కాపాడవచ్చు. ఈ కండిషన్‌‌ను మొదట్లోనే కనిపెట్టడం ఎలా అన్నదే అసలు సమస్య. దీనిపై పరిశోధనలు చేసిన అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ సైంటిస్టులు.. మన చెమటను అనలైజ్ చేసి సైటోకైన్ స్టార్మ్ ను పసిగట్టే వాచ్ సైజు డివైజ్‌‌ను తయారు చేశారు.
కరోనాలో సడన్ డెత్స్‌‌.. 
శరీరంలోకి ఏవైనా వైరస్‌‌లు ప్రవేశిస్తే వెంటనే మన ఇమ్యూనిటీ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఆ వైరస్‌‌లను ఎదుర్కొనేందుకు యాంటీబాడీస్‌‌ను జనరేట్ చేస్తుంది. అయితే ప్రాసెస్ వెనుక ఉండే ఒక ప్రొటీనే సైటోకైన్. రక్తంలో ఉండే ఈ ప్రొటీన్ ఇమ్యూనిటీ సెల్స్‌‌ ఏ స్థాయిలో విడుదల కావాలనే దానిపై మీడియేట్ చేస్తూ సిగ్నల్స్ పంపుతూ ఉంటుంది. ఈ మానిటరీ సిస్టమ్ కంట్రోల్ తప్పి, రక్తంలో సైటోకైన్స్ లెవల్స్ ఒక తుఫాన్‌‌లా పెరిగిపోవడాన్నే సైటోకైన్ స్టార్మ్ అంటారు. సైటోకైన్ రిలీజ్ భారీగా పెరిగిపోవడం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్‌‌లో ఒక డిస్ట్రక్టివ్ చైన్ రియాక్షన్ మొదలై శరీరంలో వైరస్ ఎఫెక్ట్ పడని, ఆరోగ్యకరమైన భాగాల్లో వాపు, నొప్పి లాంటివి వస్తాయి. దీంతో కీలక ఆర్గాన్స్​ దెబ్బతిని, మనిషి ప్రాణం పోతుంది. కరోనా వచ్చిన వారిలో సడన్‌‌ డెత్స్‌‌కు ఇదీ ఒక కారణమని సైంటిస్టుల పరిశోధనలో గుర్తించారు. అయితే ఈ కండిషన్‌‌ను ఎదుర్కొంటున్న పేషెంట్ ఆస్పత్రిలో ఉంటే, సైటోకైన్ స్టార్మ్‌‌ను డాక్టర్లు కనిపెట్టి డెక్టామొథాసోన్ లాంటి స్టెరాయిడ్స్ ఇచ్చి ఆ వ్యక్తిని కాపాడగలుగుతారు. కానీ కొంత మంది లక్షణాలు లేకపోవడంతో హోమ్ ఐసోలేషన్‌‌లో ఉన్న టైమ్‌‌లో సడన్‌‌గా సైటోకైన్ స్టార్మ్ పెరిగిపోయి, దానిని గుర్తించడం ఆలస్యమైన సందర్భంలో ఉన్నట్టుండి ప్రాణాలు పోతున్నాయి. అయితే ఇంట్లో ఉన్న వాళ్లు కూడా తమంతట తామే సైటోకైన్ స్టార్మ్‌‌ను గుర్తించగలిగి, వెంటనే ఆస్పత్రికి వెళ్తే బతికే చాన్స్ ఉంటుంది. ఇలా తెలుసుకునేందుకు యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ సైంటిస్టులు స్వెట్ సెన్సార్‌‌ డీఎక్స్‌‌ అనే వాచ్ లాంటి డివైజ్‌‌ను డెవలప్ చేశారు.
స్వెట్ సెన్సార్ ఎట్ల పనిచేస్తదంటే..
స్మార్ట్‌‌ వాచ్ లాంటి డివైజ్‌‌కు లింక్‌‌ చేసిన ‘స్వెట్ సెన్సార్ డీఎక్స్’ స్మార్ట్ ఫోన్‌‌ యాప్‌‌కు లింక్ అయి ఉంటుంది. స్వెట్ సెన్సార్ చెమటలో మార్పుల ఆధారంగా సైటోకైన్ స్టార్మ్‌‌ను వెంటనే పసిగడుతుంది. ఆ సెన్సార్‌‌‌‌లో రెండు ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. వీటికి ఇన్‌‌ఫ్లమేటరీ యాంటీ బాడీస్‌‌తో కోటింగ్ చేసి ఉంటుంది. దీంతో సైటోకైన్స్ పెరిగినప్పుడు చెమటలో రిలీజ్ అయ్యే ఇన్‌‌ఫ్లమేటరీ ప్రొటీన్ అవశేషాలను సెన్సార్‌‌‌‌లో ఉండే ఎలక్ట్రోడ్స్ గుర్తిస్తాయి. వెంటనే ఆ వాచ్‌‌లో ఉండే అలారమ్ మోగుతుంది. అలాగే ఆ ఎలక్ట్రిక్ మెంజర్‌‌మెంట్, సైటోకైన్స్ పెరుగుదల తీవ్రతకు సంబంధించిన డేటాను వెంటనే స్మార్ట్‌‌ ఫోన్‌‌ యాప్‌‌కు అలర్ట్ పంపుతుంది. ఎటువంటి సమస్య లేకపోతే కొన్ని సెకన్లలోనే చెమటను ఆ ఎలక్ట్రోడ్స్ రిలీజ్ చేసి, మళ్లీ వచ్చే చెమటను అబ్జర్వ్ చేసుకుని అనలైజ్ చేస్తాయని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ రీసెర్స్‌‌ని లీడ్ చేసి ఇండియన్ సైంటిస్ట్ షాలినీ ప్రసాద్ తెలిపారు. ఆ సెన్సార్ ఒకసారి ఫిట్ చేస్తే ఏడు రోజుల పాటు పని చేస్తుందని, ఆ తర్వాత సెన్సార్ ట్రీప్‌‌ను మాత్రమే మార్చుకుంటే సరిపోతుందని చెప్పారు.

సింప్టమ్స్‌‌ లేని వాళ్లను కాపాడటంలో..
సైటోకైన్ స్టార్మ్‌‌ను గుర్తించే ఇన్‌‌ఫ్లమేటరీ యాంటీ బాడీ సెన్సార్‌‌‌‌ను డెవలప్ చేసిన తర్వాత దానిని పలువురి చేతికి కట్టి సైంటిస్టులు పరిశీలించారు. నార్మల్ జ్వరం, జలుబు ఉన్న వారిపైనా ఈ స్టడీ చేశారు. అయితే మామూలు ఫ్లూ వచ్చిన కొద్ది మందిలోనూ సైటోకైన్ స్టార్మ్‌‌ను చెమట ఆధారంగా సెన్సర్ గుర్తించిందని, అయితే బ్లడ్ టెస్ట్ చేసి పరిశీలిస్తే నార్మల్ లెవల్ కంటే కొంచెం మాత్రమే సైటోకైన్స్ పెరిగినట్లు తేలిందని సైంటిస్ట్ షాలినీ ప్రసాద్ తెలిపారు. అయితే కరోనా వైరస్ శరీరంలోకి ఎంటరైతే ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా ర్యాపిడ్‌‌గా ఫైట్ చేయాల్సి వస్తుంది. సింప్టమ్స్ తీవ్రంగా ఉన్న వాళ్లు హాస్పిటల్‌‌లో అడ్మిట్ అయి ట్రీట్‌‌మెంట్ పొందుతుండడం వల్ల వాళ్ల శరీరంలోని అన్ని పెరామీటర్స్‌‌ మార్పునూ డాక్టర్లు అబ్జర్వ్ చేస్తుంటారని అన్నారు. అయితే సింప్టమ్స్‌‌ లేని వారిలో బయోమార్కర్స్ సడన్ చేంజ్‌‌ను గుర్తించడం కష్టమని, అటువంటి వారు ఉన్నట్టుండి చనిపోకుండా కాపాడడంతో తాము తయారు చేసిన సెన్సార్ ఉపయోగపడుతుందని ఆమె చెప్పారు. సెన్సార్ సైటోకైన్ స్టార్మ్‌‌ను ఇంట్లోనే గుర్తించడం ద్వారా వాళ్ల ఆర్గాన్స్ డ్యామేజ్ కాకముందే  స్టెరాయిడ్స్ లాంటివి ఇవ్వడం ద్వారా డాక్టర్లు కాపాడగలుగుతారని అన్నారు. ఒక చిన్న చెమట చుక్కలో పదో వంతు భాగం ద్వారా కూడా సెన్సర్ సైటోకైన్ స్టార్మ్‌‌ను గుర్తిస్తుందని షాలినీ చెప్పారు. ఎన్‌‌లిసెన్స్ అనే కంపెనీ పార్ట్‌‌నర్‌‌‌‌షిప్‌‌ ద్వారా మరికొద్ది నెలల్లోనే ఈ డివైజ్ మార్కెట్‌‌లోకి రాబోతున్నట్లు ఆమె తెలిపారు.