- రసవత్తరంగా నల్గొండ, భువనగిరి ఎంపీ ఎన్నికలు
- మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఒక్కరే సీనియర్
- కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నుంచి ఐదుగురు కొత్తొళ్లే
- జిల్లా రాజకీయాల్లో కుందురూ బ్రదర్స్, కంచర్ల బ్రదర్స్ ట్రెండ్
నల్గొండ, వెలుగు : నల్గొండ, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉమ్మడి జిల్లా చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఈ ఎన్నికల్లో కొత్తతరం నాయకత్వం తెరపైకొచ్చింది. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మినహా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ కొత్త వారే కావడం విశేషం. ఇన్నాళ్లు కాంగ్రెస్, కమ్యూనిస్టు, టీడీపీ తరఫున అగ్రనేతలు ఈ జిల్లాలో రాజకీయ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఈ ఎన్నికల్లోనూ కుటుంబ రాజకీయ వాతావరణమే కనిపిస్తున్నప్పటికీ మునుపెన్నుడూ వార్వెవరికీ ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం లేకపోవడం గమనార్హం.
కుందూరు బ్రదర్స్ వర్సెస్ కంచర్ల బ్రదర్స్
కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి పెద్ద కొడుకు రఘువీర్ రెడ్డి నల్గొండ ఎంపీ టికెట్‌తో రాజకీయ అరంగ్రేటం చేశారు. ఆయన తమ్ముడు జైవీర్‌రెడ్డి ఇప్పటికే నాగార్జునసాగర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. యువనేతగా రాజకీయాల్లో ప్రవేశించిన రఘువీర్ యువజన కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషించారు. మిర్యాలగూడ, నాగార్జునసాగర్ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు దోహదపడ్డారు. ఇదే స్థానం నుంచి బీఆర్ఎస్ నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్న కంచర్ల కృష్ణారెడ్డి ఎంపీ బరిలో దిగారు.
ఫస్ట్ టైం ఎంపీకి పోటీ చేస్తున్న కృష్ణారెడ్డి జిల్లాలో జరిగిన మూడు ఉప ఎన్నికల్లో ఇన్ చార్జిగా పనిచేసిన అనుభవం ఉంది. బీఆర్ఎస్ హైకమాం డ్, జిల్లా మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డితో ఉన్న సన్నిహిత సంబంధాలు కృష్ణారెడ్డికి దోహదపడ్డాయి. బీజేపీ నుంచి హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పోటీ చేస్తున్నారు. ఉపఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన సైదిరెడ్డి హుజూర్ నగర్‌కే పరిమితమయ్యారు. ఎంపీగా ఫస్ట్ టైమ్ పోటీ చేస్తున్న జాబితాలో ఆయనకు కూడా చోటు దక్కింది.
భువనగిరిలో చామల కిరణ్ అరంగేట్రం..
పార్లమెంట్ యోజకవర్గాల పునర్విభజనకు ముందు నుంచీ ఈ ప్రాంతంలో టీడీపీ, కమ్యూనిస్టుల హవా నడిచింది. తర్వాత 2009, 2019 ఎన్నికల్లో కాం గ్రెస్ గెలుపొందగా, మధ్యలో 2014లో బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. తొలిసారిగా కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్‌రెడ్డి అవకాశం లభించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు పార్టీ ఇన్ చార్జిగా పనిచేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి రాహుల్‌గాంధీ నాయకత్వంలో పనిచేశారు.
సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడం మరింత కలిసొచ్చింది. పైగా కోమటిరెడ్డి బ్రదర్స్ సపోర్ట్ కూడా ఉండటంతో హైకమాండ్ కిరణ్ అభ్యర్థిత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లోనూ కోమటిరెడ్డి ఫ్యామిలీకే ఎంపీ టికెట్ వస్తదని ప్రచారం జరిగింది. ఈ మేరకు పార్టీ జరిపిన సర్వేలో కూడా కోమటిరెడ్డి లక్ష్మి తర్వాత కిరణ్ పేరే వినిపించింది. కానీ, ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి లేదని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేయడంతో హైకమాండ్ బ్రదర్స్ తో సంప్రదింపులు జరిపాకే కిరణ్ పేరును ప్రకటించింది.
అటు బూర.. ఇటు మల్లేశ్..
బీజేపీ అభ్యర్థి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ 2014లో బీఆర్ఎస్ నుంచి తొలిసారిగా ఎంపీగా గెలుపొందారు. 2019లో రెండోసారి ఓటమిపాలైన ఆయనకు బీజేపీ మూడోసారి అవకాశం ఇచ్చింది. ఇక బీఆర్ఎస్ కొత్తగా క్యామ మల్లేశ్ కు టికెట్ ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన మల్లేశ్ సామాజిక వర్గం కురుమ. భువనగిరి ఎంపీ సెగ్మెంట్లో గౌడ, కురమ ఓటర్లు సుమారు ఐదు లక్షల మంది ఉంటారని ఒక అంచనా.
ఈ నేపథ్యంలో బీసీ ఓటర్లను చీల్చేందుకే బీఆర్ఎస్ బీసీ క్యాండేట్ను రంగంలోకి దింపారనే వాదన వినిపిస్తోంది. కాంగ్రెస్ లో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మల్లేశ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. రెండు పార్టీలు బీసీలకు టికెట్ఇ వ్వడం, కాంగ్రెస్ రెడ్డి వర్గానికి టికెట్ ఇవ్వడంతో నల్గొండతో పోలిస్తే భువనగిరి ఎంపీ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారనున్నాయి.