నెక్ ఇంప్లాంట్.. పక్షవాతం వచ్చిన చేతుల్ని సెట్ చేస్తది

నరాల్లో బ్లాకేజ్ వల్ల మెదడుకు రక్తం సరఫరాలో ఇబ్బందులు తలెత్తినప్పుడు సడన్‌‌గా బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల పక్షవాతం వస్తుంది. స్ట్రోక్ తీవ్రతను బట్టి కాళ్లు, చేతులు, నోరు కూడా చచ్చుబడిపోతాయి. దీని వల్ల కనీసం తమ రోజువారీ పనులు చేసుకోలేక ఇబ్బందులు పడుతుంటారు. కొంత మంది పూర్తిగా మంచానికే పరిమితమైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇలా స్ట్రోక్ బారినపడి నరాలు చచ్చుబడిపోయిన వారిలో మళ్లీ కదలిక తీసుకువచ్చేందుకు జరుగుతున్న పరిశోధనల్లో అమెరికాకు చెందిన మైక్రోట్రాన్స్‌‌పాండర్ అనే బయోటెక్ కంపెనీ సక్సెస్ అయింది. చేతులను మళ్లీ సెట్ చేసే నెక్ ఇంప్లాంట్‌‌ను ఆ సంస్థ డెవలప్ చేసింది.
చచ్చుబడిన నరాల్లోకి కరెంట్
బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా నరాలు చచ్చుబడిపోయి చేతులు కాళ్లు లాంటి భాగాలు పనిచేయకుండాపోతాయి. అయితే వీటిని మళ్లీ కరెంట్‌‌ ద్వారా స్టిములేట్ చేసి యాక్టివేట్ చేయగలిగే చాన్సెస్‌‌పై సైంటిస్టులు పరిశోధనలు జరిపారు. ఈ ప్రయోగాల్లో అమెరికాలోని టెక్సాస్‌‌కు చెందిన మైక్రోట్రాన్స్‌‌పాండర్ సంస్థ మంచి ఫలితాలను సాధించింది. ‘వివిటిజం’ అనే నెక్ ఇంప్లాంట్‌‌ను తయారు చేసింది. అగ్గిపెట్టె సైజులో ఉండే ఈ  డివైజ్‌‌ను మెడ భాగంలో పెట్టడం ద్వారా మెదడు నుంచి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ పంపడానికి వీలవుతుంది. దీని ద్వారా చాలా కాలం నుంచి చచ్చుబడిన చేతుల్లో సైతం మళ్లీ కదలిక తెప్పించడం సాధ్యమవుతుందని తమ ప్రయోగాల్లో తేలినట్లు మైక్రో ట్రాన్స్‌‌పాండర్ కంపెనీ తెలిపింది.
వీగస్ నరం ద్వారా..
శరీరంలోని పెద్ద నరాల్లో ఒకటైన వీగస్ నరాన్ని స్టిముల్యేట్ చేయడం ద్వారా పక్షవాతం పేషెంట్లలో మళ్లీ కదలికలు తెప్పించడంపై సైంటిస్టులు ప్రయోగాలు చేశారు. ఈ నరం స్టిములేషన్ ద్వారా డిప్రెషన్, మూర్చ, స్ట్రోక్, గుండె జబ్బులు, ఒబెసిటీని నయం చేయడంపై ప్రయోగాలు జరిగాయని, తొలిసారి తాము పక్షవాతాన్ని తగ్గించడానికి ఈ విధానాన్ని ఎంచుకున్నామని లీడ్ సైంటిస్ట్ డాక్టర్ చార్లెస్ తెలిపారు. ‘వీగస్ నరం తల నుంచి మెడ మీదుగా పొట్ట వరకూ ఉంటుంది. ఈ నరానికి అనుసంధానిస్తూ వివిటిజం ఇంప్లాంట్‌‌ను మెడ భాగంలో పెట్టడం ద్వారా అతి స్వల్పమైన కరెంట్‌‌ను ఇది బ్రెయిన్‌‌కు పంపుతుంది. ఆ ఎలక్ట్రిక్ సిగ్నల్స్ న్యూక్లియస్ ట్రాక్టస్ సోలిటరియస్ ద్వారా బ్రెయిన్‌‌లోని రెండు వేర్వేరు రీజియన్లకు చేరుతాయి. ఈ సిగ్నల్స్ చేరగానే న్యూరోమాడ్యులేటర్స్ అనే బ్రెయిన్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. పక్షవాతం కారణంగా చచ్చుబడిన.. చేతుల కదలికలకు సంబంధించిన బ్రెయిన్‌‌లోని నరాలకు ఈ మాడ్యులేటర్ చేరడం ద్వారా చేతులకు ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించిన సిగ్నల్స్ వెళ్తాయి. దీని ద్వారా చేతి కండరాల కదలికలు జరగడం, అదే సమయంలో బ్రెయిన్‌‌లోని నరాలకు సంబంధించిన వ్యవస్థ బలం పెరగడంతో పెషెంట్ నెమ్మదిగా చేతులను మామూలు అవసరాలకు వాడుకోగలిగే స్థితికి చేరుతారు’ అని ఆయన చెప్పారు.
ఇంప్లాంట్ ప్లస్ ఫిజియో థెరపీతో బెటర్ రిజల్ట్
స్ట్రోక్ వచ్చిన తర్వాత 80% పేషెంట్లలో చేతులే పని చేకుండా పోయినట్లు ఒక స్టడీ అంచనా వేసింది. ఆరు నెలలు ట్రీట్‌‌మెంట్ అందించిన తర్వాత కూడా వారిలో 50 నుంచి 60 శాతం మందికి ఆ సమస్య పోవడం లేదు. ఫిజికల్ థెరపీ లాంటి వాటి వల్ల కూడా ప్రయోజనం లేని కేసుల్లో సైతం ‘వివిటిజం’ ఇంప్లాంట్ ద్వారా చేతులు మళ్లీ సెట్ చేయొచ్చని సైంటిస్టులు వివరించారు. అమెరికాలో 108 మందికి ఈ ఇంప్లాంట్ అమర్చి  132 రోజుల పాటు అబ్జర్వ్ చేశామన్నారు. ఇంప్లాంట్‌‌ అమర్చడంతో పాటు ఫిజియో థెరపీ కూడా చేయించడం ద్వారా మూడింత మెరుగైన ఫలితాలు వచ్చాయని, పూర్తిగా సొంత పనులు చేసుకునే స్థితికి వచ్చారని సైంటిస్టులు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను సైంటిస్టులు ‘ది లాన్సెట్‌‌’లో ప్రచురించారు.

ఇంప్లాంట్ ఎట్ల పెడతరు?
వీగస్ నరం స్టిములేషన్ కోసం పెట్టే వివిటిజం నెక్ ఇంప్లాంట్ పెట్టడం కూడా హార్ట్ పేషెంట్లకు గుండె భాగంలో పేస్‌‌మేకర్ అమర్చడం లాంటిదే. మెడ భాగంలో జనరల్ అనస్తీషియా ఇచ్చి సర్జరీ చేసి వివిటిజం డివైజ్‌‌ను పెట్టాల్సి ఉంటుంది. క్రికోయిడ్ కార్టిలేజ్ భాగంలో దీనిని పెడతారు. ఇంప్లాంట్ కరెంట్ రిలీజ్ చేసినప్పుడు మెడ, గొంతు భాగాల్లో జిళ్లుమన్న ఫీలింగ్ అనిపిస్తుంది. మన శరీరంలో కదలికలకు సంబంధించి మెదడులో కెమికల్ రియాక్షన్స్ జరిగే భాగాలకు వీగస్ నరం కనెక్ట్ అయి ఉంటుందని, అందుకే పక్షవాతం వచ్చిన వారికి కదలికలు రప్పించడం కోసం ఈ నరాన్ని స్టిములేట్ చేయాలన్న ఆలోచన చేశామని డాక్టర్ చార్లెస్ తెలిపారు. ఈ నెక్ ఇంప్లాంట్ ద్వారా వీగస్ నర్వ్ స్టిములేషన్‌‌పై క్లినికల్ ట్రయల్స్ కూడా చేశామని, దీనిని శరీరంలో అమర్చడం ద్వారా ఎటువంటి సమస్య రాదని ప్రయోగాల్లో తేలిందని చెప్పారు. స్ట్రోక్ వల్ల చాలా ఏండ్లుగా చేతులు చచ్చుబడిపోయిన వాళ్లలోనూ ఈ నెక్ ఇంప్లాంట్ ద్వారా మళ్లీ కదలికలు తెప్పించవచ్చని అన్నారు.