బీఆర్ఎస్ పరిపాలన నిధులు లేక, నియామకాలు చేపట్టక తెలంగాణ విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమయింది. కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అంటూ ఇచ్చిన హామీలు హామీలుగానే మిగిలిపోయాయి తప్ప అమలుకు నోచుకోలేదు. వచ్చే కొత్త ప్రభుత్వమైనా విద్యపై పదేండ్లుగా జరిగిన నిర్లక్ష్యాన్ని పారదోలి, విద్యకు ప్రాధాన్యమివ్వగలదా? అని తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ లోకం ఎదురుచూడటం సహజం. పదేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం, ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసింది. కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీకి కొమ్ముకాస్తూ వచ్చింది. డబ్బులు ఉన్నవారికే చదువు అనే పరిస్థితికి దిగజార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రెక్కాడితే కానీ డొక్కాడని పేదల బిడ్డలు చదువుకుందాం అంటే ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం మౌలిక వసతులు లేవు.
సరిపడా ఉపాధ్యాయులు లేరు. ప్రాథమిక విద్య పాతాళానికి నెట్టి వేయబడింది. రాష్ట్రంలో రేషనలైజేషన్ పేరుతో 8,624 పాఠశాలలు మూసివేసిండ్రు. 6,800 పాఠశాలల్లో ఒక్కరే టీచర్ ఉన్న పరిస్థితి. 596 మండలాల్లో 578 మండలాలకు మాత్రమే ఎమ్ఈఓలు ఉన్నా పట్టించుకునే నాథుడే లేడు. ఇక గురుకులాల పరిస్థితి చూస్తే నరకకూపాలుగా దర్శనమిస్తున్నాయి. పాడుబడ్డ భవనాలలో పురుగుల అన్నం, నీళ్ల చారుతో విద్యార్థులు నరకయాతనను అనుభవిస్తున్నారు. కొత్త ప్రభుత్వంతో ప్రభుత్వ విద్యను వెంటాడుతున్న సమస్యలకు సత్వర పరిష్కారాన్ని విద్యార్థులు, నిరుద్యోగులు ఆశిస్తున్నారు.
హామీలు నెరవేరుస్తారా?
ఏ రాజకీయ పార్టీ అయినా ఎలక్షన్స్‌లో హామీలు ఇవ్వడం సర్వసాధారణం. కానీ, ఇచ్చిన హామీలను ఎంతవరకు అమలు పరుస్తారు అనేది ప్రశ్నార్థకం. రాష్ట్రంలో రెండు పర్యాయాలు గెలిచిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో మెరుగైన విద్య, ఉద్యోగం, ఉపాధి కల్పనకు నోచుకోలేదు. డిగ్రీలు, పీజీలు, పీహెచ్‌డీలు చేసి ఉపాధి హామీ పథకంలో కూలీలుగా మారినవారున్నారు. మరికొందరు నిరుద్యోగులు మిల్లులలో కూలీలుగా పనిచేస్తున్న పరిస్థితి.
ఇంకొందరు క్యాబ్ డ్రైవర్లుగా , స్విగ్గి , జొమాటోలో పనిచేస్తున్న దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ నిరుద్యోగ యువతది. ఇలా లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలను ప్రశ్నార్థకంగా మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. వచ్చే ప్రభుత్వమైనా తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగుల ఆశయాలు నెరవేరుస్తుందా? ఏళ్ల తరబడి బతుకు భారంగా మోస్తున్న తెలంగాణ ప్రజలు ఆ భారం నుంచి బయటపడే రోజులు వస్తాయా? ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ తోపాటు, ప్రతిపక్ష పార్టీలు ఇస్తున్న ముఖ్యమైన హామీ ఉద్యోగ నియామకాలు. ప్రతి పార్టీ హామీలు ప్రజల్లో ఊరటని కల్పిస్తున్నాయి.
కానీ, ఈ హామీలు నిజంగా ప్రజల బాగు కోసమా లేక ఓటు బ్యాంకు కోసమా? అనేది చూడాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రజలు క్షమించలేదని చెప్పడానికి నిన్నటి పోలింగ్‌లో భారీ స్థాయిలో పాల్గొన్న నిరుద్యోగులే సాక్ష్యం . ఆత్మగౌరవమనే నినాదంతో నినదించి సాధించిన తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పాలనలో దగాపడ్డ యువత తిరగబడ్డది. పరీక్ష పేపర్ లీకులతో, నిరుద్యోగుల ఆత్మహత్యలతో, రైతన్న ఆత్మహత్యలతో, కుటుంబ పాలనలో అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల పెరిగిన వ్యతిరేకత డిసెంబర్ 3న బయట పడబోతున్నది.
బంగారు తెలంగాణ అయితది అనుకుంటే బాధితుల తెలంగాణగా మిగిలింది. ఉద్యోగాలు రాక, ఉపాధి లేక వలసలతో విలవిలలాడుతున్న పరిస్థితి తెలంగాణది. వచ్చే ప్రభుత్వమైనా ప్రజలను బాధల నుండి విముక్తి కలిగిస్తుందా? విద్యారంగానికి సరిపడ నిధులు కేటాయిస్తుందా? ఉద్యోగాల ఖాళీలను నింపుతుందా? వచ్చే కొత్త పాలకులు విద్య, ఉద్యోగ కల్పనపై దృష్టి సారిస్తే యువత హర్షిస్తుందని గుర్తించాలి.
నోటిఫికేషన్ల మాటలు నీటిమూటలు
ఉద్యోగ నియామకాల విషయానికొస్తే పేపర్ లీకేజీలు, పరీక్ష రద్దులతో కోర్టుమెట్ల చుట్టూ తిప్పడం తప్ప ఏ నియామకం కూడా సక్రమంగా జరగలేదు. 2014 అసెంబ్లీ సమావేశాల్లో 13 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా.. వారి నివేదిక ప్రకారం కూడా నోటిఫికేషన్ వెయ్యలేదు. ఇప్పటివరకు 20 వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 6,612 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న డీఎస్సీ అభ్యర్థుల ఆశలపైకేసీఆర్ ప్రభుత్వం నీళ్లు చల్లింది . వచ్చే ప్రభుత్వమైనా పోస్టులు భర్తీ చేస్తుందా?
-చింతకాయల ఝాన్సీ, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి.