భద్రాద్రికి ఆంధ్రా ఇసుక!

భద్రాద్రికి ఆంధ్రా ఇసుక!
  •     అధికారుల నిఘా కరవు
  •     నామమాత్రంగా టీఎస్​ఎండీసీ తనిఖీ కేంద్రం 
  •     ఆధిపత్య పోరులో తెరుచుకోని భద్రాచలం ఇసుక ర్యాంపు

భద్రాచలం, వెలుగు :  ఆంధ్రాలో ఇసుకపై కొత్త సర్కారు ఆంక్షలు ఎత్తివేసింది. అవసరమైన వారు ఉచితంగా ఇసుకను తీసుకెళ్లొచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. ఇది తెలంగాణలోని ఇసుకాసురులకు వరంగా మారింది. భద్రాచలం చుట్టూ ఉన్న ఆంధ్రా ఊళ్ల నుంచి భారీగా ఇసుక దొంగచాటుగా ఇక్కడకు వస్తోంది. తెలంగాణ అధికారులు నిఘా పెట్టకపోవడం, టీఎస్​ఎండీసీ తనిఖీ కేంద్రం ఉన్నా సిబ్బంది లేకపోవడంతో అక్రమార్కులు ఎలాంటి జంకూ లేకుండా భద్రాచలంలోకి ఇసుకను తీసుకొచ్చి అమ్ముతున్నారు. 

రోజుకు 100 ట్రాక్టర్ల ఇసుక.. 

భద్రాచలం బార్డర్​లోని ఎటపాక మండలం గుండాల, కన్నాయిగూడెం తదితర గ్రామాల నుంచి రేయింబవళ్లు ఇసుక తీసుకొచ్చి ట్రాక్టర్,​ ట్రక్కు రూ.5వేలకు అమ్ముకుని జేబులు నింపుకుంటున్నారు. టెంపుల్​ సిటీలో భారీగా బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రజావసరాలకు కూడా ఇసుక అవసరం చాలా ఉంది. కానీ భద్రాచలంలో ఇసుక దొరకడం లేదు. జిల్లాలో ఇసుక ర్యాంపుల నుంచి రావడం లేదు. ఫలితంగా అక్రమార్కుల పంట పండుతోంది. పగటిపూట ట్రాక్టర్​ యజమానులు బుకింగ్​ చేసుకుని, రాత్రి నుంచి తెల్లవారుఝాము వరకు నిరంతరాయంగా ఆంధ్రా నుంచి ఇసుకను తీసుకొచ్చి డంప్​ చేస్తున్నారు. రోజుకు 100 ట్రాక్టర్ల వరకు ఇసుక వస్తోంది.

ఇక్కడ ఇసుక ర్యాంపు ఉన్నా..  

చెంతనే ఇసుక ర్యాంపు ఉన్నా అది తెరుచుకోక పోవడంతో దొంగ ఇసుకను కొనుక్కోవాల్సి వస్తోంది. ఇసుక సమస్యతో ఇళ్ల నిర్మాణ యజమానులకు భారంగా మారింది. కూనవరం రోడ్డులో ఆంధ్రా బార్డర్​లో అధికారిక ఇసుక ర్యాంపు ఉంది. లక్ష క్యూబిక్​ మీటర్ల ఇసుకను తవ్వి అమ్మేందుకు ర్యాంపునకు అనుమతులు కూడా వచ్చాయి. 2023లోనే అప్పటి కలెక్టర్​ అనుదీప్​ పర్మిషన్​ ఇచ్చారు. వీటికి సంబంధించిన అనుమతులు వచ్చినా కలెక్టర్​ మారడంతో ఆగిపోయింది.

ఆ తర్వాత వచ్చిన కలెక్టర్​ అనుమతులు ఇచ్చినా కొత్త ప్రభుత్వం రావడంతో మళ్లీ నిరాశే ఎదురైంది. ఈలోపు ఇసుక సొసైటీల్లో ఆధిపత్య పోరు కాస్తా కోర్టు వరకు వెళ్లింది. ఈ వివాదం ఎటూ తేలక ర్యాంపు మూతపడింది. భద్రాద్రి వాసులకు ఇది శాపంగా మారింది. ఎన్నికల సమయంలో భద్రాద్రి వాసుల అవసరాలకు ఇసుకను ట్రక్కు రూ.600కే అందిస్తామని చెప్పిన  నాయకులంతా మౌనంగా ఉన్నారు. ఇసుక దొరకక పోవడం, పక్క రాష్ట్రాల నుంచి దొంగతనంగా కొనుక్కోవడం తదితర కారణాలతో నిర్మాణాల వ్యయం భారంగా మారి ఇబ్బందులు పడుతున్నారు. 

నిబంధనల ప్రకారం ఇసుక రీచ్​ను తెరవాలి

ప్రభుత్వం భద్రాచలం ప్రజల ఇసుక కష్టాలు తీర్చాలి. నిబంధనల ప్రకారం గ్రామసభలు పెట్టి పీసా చట్టం ఆమోదం పొంది గిరిజనులకే రీచ్​లు కేటాయించాలి. కొందరు దళారులు తయారై పక్క మండలాలు, ఆంధ్రా నుంచి తీసుకొచ్చి పీసా గ్రామసభలను దుర్మార్గంగా నిర్వహిస్తున్నారు. దొంగ ఇసుకను కొనుక్కునే కర్మ మాకు రాకూడదంటే భద్రాచలం ఇసుక ర్యాంపును తెరవాలి. అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలి.   
- అజీమ్, భద్రాచలం