త్వరలో రాష్ట్రానికి కొత్త గవర్నర్

త్వరలో రాష్ట్రానికి కొత్త గవర్నర్
  • మూడు రాష్ట్రాలకు ఇన్​చార్జ్​గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ 
  • రాజ్యసభకు తమిళిసై.. ఆపై కేబినెట్​లోకి తీసుకునే చాన్స్

హైదరాబాద్, వెలుగు: కేంద్రంలో ఏర్పాటు కాబోయే సంకీర్ణ ప్రభుత్వం తెలంగాణకు త్వరలో పూర్తిస్థాయి గవర్నర్ ను నియమించనుంది. ప్రస్తుత ఇన్ చార్జ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్.. పుదుచ్చేరి, జార్ఖండ్ గవర్నర్​గా కొనసాగుతున్నారు. దీంతో మూడు రాష్ట్రాల మధ్య పర్యటించాల్సి వస్తోందని, ఇది కొంత ఇబ్బందిగా ఉందని రాధాకృష్ణన్ పలు కార్యక్రమాల్లో చెప్పారు. మార్చి 19న తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా నేపథ్యంలో జార్ఖండ్​ గవర్నర్ రాధాకృష్ణన్ కు అదనంగా తెలంగాణ, పుదుచ్చేరిల ఇన్​చార్జి బాధ్యతలను కేంద్రం అప్పగించింది.

ఎన్నికలు పూర్తికావటంతో త్వరలో ప్రధాని, కేంద్రమంత్రి మండలి, కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారం తరువాత పలు రాష్ట్రాలకు కేంద్రం గవర్నర్లను నియమించనుంది. అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారికి ఇన్ చార్జ్ బాధ్యతలు తొలగించి ఆ స్థానాల్లో కొత్త గవర్నర్లను నియమించనుంది. ఇటీవల ఎన్నికల్లో టికెట్ నిరాకరించిన సిట్టింగ్ ఎంపీలకు ప్రస్తుతం గవర్నర్లుగా అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
 
కేంద్ర మంత్రులుగా తమిళిసై, అన్నామలై

ఇటీవలి దాకా రాష్ట్ర గవర్నర్ గా వ్యవహరించిన తమిళిసైకు బీజేపీ హైకమాండ్​ కేంద్ర మంత్రిగా అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ పదవికి రాజీనామా చేసి చెన్నై సౌత్​నుంచి ఆమె పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే, డీఎంకే అభ్యర్థి చేతిలో తమిళిసై ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో తమిళిసైని రాజ్యసభకు పంపించి, ఆపై కేబినెట్ లోకి తీసుకోవాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన రాజ్యసభ సభ్యులు పలువురు రాజీనామా చేయనుండడంతో ఏదో ఒక స్థానం నుంచి తమిళిసైని నిలబెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. కాగా, పార్టీ తమిళనాడు చీఫ్​ అన్నామలైని కూడా కేంద్ర కేబినెట్ లోకి తీసుకునే అవకాశాన్ని బీజేపీ పెద్దలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.