- కేబినెట్ సబ్ కమిటీ రిపోర్టు సిఫార్సుల ప్రకారం రిలీజ్చేసిన సర్కారు
- తొలిదశలో మెడికల్, స్పౌజ్, మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్స్‌కు చాన్స్
- ఖాళీలకు తగ్గట్టుగా కేడర్‌లో మార్పు, బదిలీలకు అవకాశం
- 2 వేల మందికి ప్రయోజనం.. స్థానికత ఇష్యూ కూడా క్లియర్చేయాలని జేఏసీ వినతి
హైదరాబాద్, వెలుగు: 317జీవో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముందడుగు పడింది. స్థానిక కేడర్ పరస్పర అవగాహనతో బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒకే సబ్జెక్టు బోధించే ఇద్దరు ఉద్యోగులు ఒకరి స్థానంలోకి మరొకరు పరస్పర అవగాహనతో బదిలీ అయ్యేందుకు అవకాశం కల్పించింది. కేబినెట్ సబ్ కమిటీ రిపోర్టు సిఫార్సుల ప్రకారం 317 జీవో ఉద్యోగుల్లో స్పౌజ్, మ్యూచువల్, మెడికల్ ప్రాతిపదికన అప్లికేషన్లను పరిష్కరించాలని కొత్త గైడ్‌లైన్స్ జారీ చేసింది. ఈ 3 కేటగిరీలకు సీఎస్శాంతికుమారి వేర్వేరుగా 243, 244, 245 జీవోలను శనివారం జారీ చేశారు. ఖాళీలకు లోబడి లోకల్ కేడర్ లో మార్పు, బదిలీలు చేపట్టాలని ఆయా శాఖలను ఆదేశించారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి 31 వరకు మ్యూచువల్ బదిలీల కోసం ఆన్లైన్లో అప్లైకి అవకాశం కల్పించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సుమారు 2 వేల మందికి ప్రయోజనం కలగనున్నది.
పలుసార్లు కేబినెట్ సబ్ కమిటీ
317 జీవోతో నష్టపోయిన ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పేర్కొన్నది. ఇందుకు తగ్గట్టుగా ఈ ఏడాది ఫిబ్రవరిలో మంత్రి దామోదర రాజనర్సింహ చైర్మన్ గా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ మెంబర్లుగా ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ని ఏర్పాటుచేసింది. అప్పటి నుంచి అన్ని ఉద్యోగ సంఘాలతో మీటింగ్ నిర్వహించి, వారి నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. మొత్తం 50 వేల అప్లికేషన్లు వచ్చినట్టు సమాచారం. అన్ని శాఖల ఉన్నతాధికారులతో 10 సార్లు మీటింగ్ లు నిర్వహించి, శాఖల్లో ఖాళీల వివరాలు, 317 జీవో తో జరిగిన ఉద్యోగుల బదిలీల వివరాలు తీసుకున్నారు. నెల కింద సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి దామోదర రాజనర్సింహ తుది నివేదిక ను అందజేశారు.
అసెంబ్లీ సమావేశాల్లో స్థానికత అంశం
317జీవో లో కీలకంగా మారిన స్థానికత ప్రకారం సొంత జిల్లాల్లో పోస్టింగ్ ఇచ్చే అంశాన్ని అసెంబ్లీ చర్చించి, నిర్ణయం తీసుకుంటామని ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. జీవోతో నష్టపోయిన ఉద్యోగులు సుమారు 18 వేల మంది ఉండగా.. స్థానికత బాధితులు 16 వేల మంది ఉంటారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశం పై నిర్ణయం తీసుకోవాలంటే కొన్ని లీగల్ ఇబ్బందులు ఉన్నాయని, రాష్ట్రపతి ఉత్తర్వులకు తగ్గట్టుగా జోనల్ సిస్టమ్, 317 జీవో తీసుకొచ్చిన నేపథ్యంలో అడ్వకేట్ జనరల్ ఒపీనియన్‌ను ప్రభుత్వం కోరింది. ఈనెల 9 నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో లీగల్ ఒపీనియన్ తీసుకొని, అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తున్నది. కాగా, స్పౌజ్, మెడికల్, మ్యూచువల్ జీవో లు ఇచ్చినందుకు 317 జీవో జేఏసీ నేతలు మధుసూదన్ రెడ్డి, విజయ్ కుమార్, నాగేశ్వరావు, సందీప్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో స్థానికతపై నిర్ణయం తీసుకొని, న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
317జీవో బాధితులకు న్యాయం చేయాలి: టీపీటీఎఫ్
స్టేట్ కేబినేట్ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్టు మేరకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను స్వాగతిస్తున్నామని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. స్థానికత పేరుతో 317 జీవో ద్వారా అన్యాయం జరిగిన టీచర్లు, ఎంప్లాయీస్ అందరికీ తగిన న్యాయం చేయాలని కోరారు. స్పౌజ్ కేటగిరీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను కూడా చేర్చాలని విజ్ఞప్తి చేశారు. జీవో317లోని నిబంధనలకు అనుగుణంగా ఉన్న భార్యభర్తలు, ప్రాధాన్యత కేటగిరీల్లో మ్యూచ్ వల్ బదిలీలు చేయాలని ప్రభుత్వం ఇచ్చిన జీవోల పట్ల యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జంగయ్య, చావ రవి అసంతృప్తి వ్యక్తం చేశారు. కేబినేట్ సబ్ కమిటీ కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుందని, జీవో 317ను సవరించి న్యాయం చేయాలని కోరారు. స్పౌజ్, మ్యూచ్ వల్ బదిలీలకు జారీచేసిన జీవో తేదీ వరకూ అందిన అప్లికేషన్లను ఆమోదించాలని, అప్పుడే జీవో 317 బాధితులకు న్యాయం జరుగుతుందని టీఎస్పీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు షౌకత్ అలీ తెలిపారు.