అధికారంలోకి వస్తే ఒకే సారి రైతుల అప్పులు అన్నీ మాఫీ చేస్తామని ప్రకటించామని.. అందుకు తగ్గట్టుగానే విధివిధానాలు ఖరారుపై కసరత్తు జరుగుతుందని.. త్వరలోనే వెల్లడిస్తామని స్పష్టం చేశారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి త్వరలోనే కార్యాచరణ చేపడతామని వెల్లడించారాయన. ఇచ్చిన మాటకు కట్టుబడి.. త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారాయన.
అదే విధంగా రైతు బంధు పథకం ముఖ్య ఉద్దేశం గత ప్రభుత్వంలో తప్పుదారి పట్టిందన్నారు. రైతు బంధు పథకం పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనిపెట్టుకున్న భూములకు కూడా రైతు బంధు డబ్బులు ఇవ్వటం జరిగిందన్నారు. రోడ్లు ఉన్న భూములకూ రైతు బంధు పథకం కింద డబ్బులు వేయటం జరిగింది. అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం కంటే.. భూస్వామ్య రైతులు, వ్యాపారులకు ఎక్కువ లబ్ధి జరిగిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను సరి చేస్తూ.. త్వరలోనే రైతు బంధు పథకంలో కొత్త నిబంధనలు, విధివిధానాలు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.
రైతు బంధు కొత్త నిబంధనలు వచ్చిన వెంటనే ఎకరాకు 15 వేల రూపాయలు వేస్తామని స్పష్టం చేశారాయన. కౌలు రైతులకు కూడా రైతు బంధు సాయం అందేలా విధివిధానాలను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు మంత్రి భట్టి విక్రమార్క. కౌలు రైతులకు రైతు బరోసా సాయం అందించటానికి మార్గదర్శకాలు తయారు అవుతున్నాయని.. త్వరలోనే విడుదల చేస్తామని వివరించారు మంత్రి భట్టి.
రైతులు, కౌలు రైతులకు పంట బీమాలో కొత్త విధివిధానాలు తీసుకొస్తామని.. ఇందు కోసం పశ్చిమ బెంగాల్ తరహా పథకాన్ని అద్యయనం చేస్తున్నట్లు వివరించారు.