కాంగ్రెస్‌లోకి వరుస చేరికలు దేనికి సంకేతం? అభ్యర్థుల జాబితాను ప్రకటించడంలో ఎందుకు ఆలస్యం? స్క్రీనింగ్ కమిటీ రెండు దఫాలుగా భేటీ అయినా కనీసం ఒక విడత లిస్టుని కూడా ఎందుకు బయటపెట్టలేదు? ఇటు వరుస చేరికలు, అటు అభ్యర్థులను ప్రకటించకపోవడం వెనకాల ఉన్న కాంగ్రెస్ వ్యూహం ఏంటి? దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలనే ఖరారు చేస్తూ ఇప్పటికే బీఆర్ఎస్ తమ అభ్యర్థుల్ని ప్రకటించింది, కానీ కాంగ్రెస్ మాత్రం క్యాండిడేట్లను అనౌన్స్ చేయకుండా తాము అధికారంలోకొస్తే తీసుకొచ్చే స్కీముల్ని ప్రకటిస్తోంది.
రెండు పార్టీలకున్న తేడా ఇక్కడే స్పష్టమవుతోంది. కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల సెలక్షన్ చేస్తోందని ఆ పార్టీ చేరికలను బట్టి అర్థమవుతుంది. గత ఏడాది నుంచి సర్వేల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని పదే పదే పార్టీ చెప్పుకుంటూ వస్తోంది కూడా. గతంలో బీఆర్ఎస్, బీజేపీ నుంచి ఎవరెప్పుడు కాంగ్రెస్‌లోకి వచ్చి వాలుతారా అని ఎదురు చూడాల్సివచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బీజేపీ, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌కు జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవనే మాటకి ఈ పరిణామం తాజా ఉదాహరణ.
బీఆర్ఎస్ ఎత్తులకు భిన్నంగా.. అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ రూటు మార్చింది. అభ్యర్థుల ఎంపిక విషయంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నది. తెలంగాణలో వచ్చిన రెండు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఏ నియోజకవర్గంలో ఎవరికి టికెట్లు ఇస్తున్నారో కేసీఆర్ ముందే ఊహించి ఎత్తులు వేసేవాడు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అనుసరిస్తున్న వ్యూహాలు మాత్రం అధికార పార్టీకి అంత సులభంగా అంతుచిక్కడం లేదు.
ఇంకా చెప్పాలంటే తన పార్టీలో ఉన్న నేతలనే కాపాడుకోలేని పరిస్థితి బీఆర్ఎస్లో ఏర్పడింది. గతంలో ఎన్నికల సమయంలో కేసీఆర్ అవతలి పార్టీలను వీక్ చేసి బలం లేని అభ్యర్థులను నిలబెట్టేలా చేసేలా వ్యూహం పన్నేవాడన్న చర్చ కూడా జరిగేది. కానీ ఇప్పుడు దానికి బ్రేక్ పడినట్టే అనిపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించే సరికి ఎంతమంది కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారో కూడా తెలీదు. గత ఎన్నికల కాలంలో టీఆర్ఎస్ వేసినఎత్తుగడలను హై కమాండ్ స్టడీ చేసింది. అందుకు తగ్గ జాగ్రత్తలపైనే దృష్టి పెట్టి పనిచేస్తున్నది.
రీసర్వేలనే నమ్ముతున్న హైకమాండ్!
మరోవైపు కేసీఆర్‌కు విరుద్ధంగా అభ్యర్థులని కాకుండా స్కీమ్స్ ని ప్రకటించడం ద్వారా గెలిస్తే ఏం చేస్తామో అని పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. టికెట్ల విషయంలో హై కమాండ్ దగ్గర గెలవని అభ్యర్థుల పేరు స్క్రీనింగ్ కమిటీలో ఎవరు సూచించినా వాళ్లు హై కమాండ్ దగ్గర అభాసుపాలు కావల్సిందే అనేలా ఇవాళ సునీల్ కనుగోలు గానీ, ప్రియాంక, రాహుల్ గాంధీగానీ చేస్తున్న కసరత్తు అంతా ఇంతా కాదు. టికెట్ ఫలాన వ్యక్తికి ఇవ్వాల్సిందే అని పట్టు పట్టినా అవసరమైతే అతనిపై మళ్లీ రీసర్వే జరిపిస్తున్నారు.
ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ నాటికి కూడా పది సీట్లను కొత్తగా పార్టీలోకి వచ్చేవారి కోసం దాచిపెట్టేప్లాన్లో కూడా ఉన్నారట. పీసీసీ ప్రెసిడెంట్‌గా, సీఎల్పీ నేతలుగా సొంత మనుషులకు టికెటిప్పించాలని చూసినా అవి రివర్సయి తప్పుపడుతూ ఎవరి మాటలనూనమ్మే పరిస్థితిలో లేకుండా తిప్పి పంపిస్తోంది హై కమాండ్. మరీ వ్యూహాలు, విపరీత మార్పులు అన్నీ కలిసొచ్చి కాంగ్రెస్అధికారాన్ని చేజిక్కించుకుంటుందా అనేది వేచిచూడాలి మరి.
గెలుపే లక్ష్యంగా..
నిజంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా ఎందుకు ఆలస్యమవుతోందంటే మాత్రం గెలుపే లక్ష్యంగా ముందుకు సాగేలా సునీల్ కనుగోలు ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు అర్థమవుతుంది. రాష్ట్రం నుంచి స్క్రీనింగ్ కమిటీలో ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డి, సీల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధు యాష్కీ, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో పాటు అధిష్టానం టీమ్ మరో ముగ్గురు ఉన్నారు. వీరందరూ కలిసినా అన్ని స్థానాల క్యాండిడేట్లను సూచించినా ఎందుకు ఆలస్యం అవుతుంది? అనే ప్రశ్నకు కూడా అనేక సమాధానాలు వినిపిస్తున్నాయి. ఈ కమిటీ కేవలం అభ్యర్థులను నిలబెట్టే సలహాలను మాత్రమే తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.
ఇందులో రేవంత్ వర్గమనో, భట్టి వర్గమనో, మరే ఇతర నేతల వర్గమనో హై కమాండ్ స్వీకరించేటట్టు లేనట్టుగా తెలుస్తోంది. వీరిచ్చిన రెండు మూడు పేర్లలో కూడా సరియైన అభ్యర్థులను సూచించారా లేదా అని సర్వేల రిపోర్ట్స్ చూడడం, దాని ఆధారంగానే హై కమాండ్ అభ్యర్థుల్ని నిర్ణయించడం, గెలవలేని స్థానాలు ఉంటే అవతల పార్టీల్లో నుంచి ఎవరైనా వస్తే గెలవగలుగుతామా అని కూడా పార్టీ లోతుగా పరిశీలిస్తున్నది. అందులో భాగంగానే వరుస చేరికలను పార్టీ ప్రోత్సహిస్తోంది.
అన్ని జాగ్రత్తల్లో అధిష్టానం
తాజాగా వేముల వీరేశం, మైనంపల్లి హన్మంతరావులను చేర్చుకోవడంతో పాటు కుంభం అనిల్ కుమార్ రెడ్డి లాంటి నేతల్ని మళ్లీ పార్టీలో తీసుకోవడం, ఖమ్మంలో బలంగా ఉన్న తుమ్మల లాంటి నేతలని పార్టీలోకి ఆహ్వానించడం, ఇద్దరు ఎమ్మెల్సీలైన దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి లాంటి నేతలను తీసుకుని వారికి పార్టీ టికెట్లు ఇవ్వడం చూస్తుంటే ఏ స్థాయిలో లోతుగా పార్టీ పరిశీలిస్తున్నదో అర్థమవుతుంది. గతంలో రాహుల్ గాంధీ లాంటి నేతలు ఎమ్మెల్యే స్థాయి నేతలను ఎవరినీ పెద్దగా కలిసేవాళ్లు కాదు. కానీ ఇప్పుడు గెలుపే లక్ష్యంగా నందికంటి శ్రీధర్ లాంటి నేతల్ని కూడా పిలిచి మాట్లాడి ఆ టికెట్‌ను కొత్తగా వచ్చినవారికి ఇవ్వడమంటే పార్టీ గతంలోలాగా పనిచేయడం లేదని అవగతమవుతోంది.
మరోవైపు సీడబ్లూసీ మెంబర్ వంశీచంద్ రెడ్డి లాంటి లీడర్ స్థానంలో కొత్తవారిని తీసుకోవడం అంటే గెలపు కోసం త్యాగం చేయాల్సిందేనని సూచించినట్టు తెలుస్తోంది. ఈ వరుస చేరికలతో రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుస్తుందన్న పర్సెప్షన్ కూడా క్రియేట్ చేయగల్గుతున్నారు. ఇది గతంలో జరిగిన ఎన్నికల కాలం కాదని స్పష్టంగా కనిపిస్తుంది. గుడ్డెద్దు చేనులో పడ్డ చందంగా ఎంపికలు జరగవని అర్థమవుతుంది. సిఫార్సులకు కాలం చెల్లిందనే సంకేతం కనిపిస్తుంది. గెలుపు తప్ప మరొక విషయానికి ఎంపికల్లో అసలు స్థానం లేదనే ధోరణి హై కమాండ్‌లో స్పష్టంగా కనిపిస్తున్నది.
- బోదనపల్లివేణు గోపాల్ రెడ్డి, తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అద్యక్షుడు