వచ్చే ఎన్నికల్లో కొత్త చరిత్ర రాస్తం

  • తెలంగాణలో వేల బలిదానాలు ఒక్క ఫ్యామిలీ కోసం కాదు: ప్రధాని నరేంద్ర మోడీ
  • రాష్ట్రంలో అడ్డగోలు అవినీతి.. 
  • లూటీ చేయడం.. కుటుంబ ఖజానా పెంచుకోవడమే ఇక్కడి పాలకుల పని
  • మేం టెక్నాలజీ నమ్ముకుంటే.. వీళ్లు మూఢ విశ్వాసాలు నమ్ముకున్నరు
  • ఇలాంటి వ్యక్తులతో అభివృద్ధి జరగదు
  • తెలంగాణలో మార్పు ఖాయం 
  • వచ్చే ఎన్నికల్లో కొత్త చరిత్ర రాస్తం..  బీజేపీ జెండా ఎగరేస్తం

అమరుల ఆశయాలు తెలంగాణలో నెరవేరటం లేదు. కేవలం ఒక్క కుటుంబం కోసమే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరగలేదు. ఇక్కడి ఫ్యామిలీ పాలనంతా అవినీతిమయమే. తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే మా లక్ష్యం. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతటి పోరాటానికైనా బీజేపీ సిద్ధం. మేం పారిపోయే వాళ్లం కాదు.. పోరాడే వాళ్లం. మా కార్యకర్తలు తగ్గేవాళ్లు కాదు.. నెగ్గేవాళ్లు. 2024లో కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలుగుతుందనే నమ్మకం నాకుంది. ‑ ప్రధాని నరేంద్ర మోడీ

హైదరాబాద్, వెలుగు: కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయిందని ప్రధాని నరేంద్ర మోడీ ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధిని ఒక ఫ్యామిలీ అణచివేయాలని చూస్తున్నదని ఫైర్ అయ్యారు. ‘‘తెలంగాణ ఉద్యమంలో వేల మంది అమరులయ్యారు. ఒక్క ఆశయం కోసం ఎందరో ప్రాణత్యాగాలు చేశారు. కానీ నిరంకుశ పాలనలో ఎవరి ఆకాంక్షలు కూడా నెరవేరడం లేదు. తెలంగాణకు విముక్తి కావాలి. కుటుంబ పాలనను, కుటుంబ పార్టీలను తరిమేస్తేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుంది’’ అని ఆయన అన్నారు. గురువారం హైదరాబాద్‌‌లోని బేగంపేట్ ఎయిర్‌‌‌‌పోర్టులో రాష్ట్ర బీజేపీ ఏర్పాటు చేసిన స్వాగత సభలో మోడీ మాట్లాడారు. భారత్ మాతాకీ జై అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణ ప్రజలకు నమస్కారాలు అంటూ తెలుగులో చెప్పారు. ఎక్కడా నేరుగా కేసీఆర్, టీఆర్ఎస్ పేర్లు ప్రస్తావించకుండానే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కుటుంబ పార్టీలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, ఇవి యువతకు పెద్ద శత్రువులని విమర్శించారు.
రాజకీయ కక్షతో జులుం చేస్తున్నరు
పట్టుదలకు, పౌరుషానికి తెలంగాణ ప్రజలు మారుపేరని ప్రధాని అన్నారు. దృఢ సంకల్పం ఇక్కడి ప్రజల సొంతమన్నారు. ‘‘తెలంగాణ ప్రజల ప్రేమే నాకు పెద్ద బలం. నేను తెలంగాణకు ఎప్పుడొచ్చినా నామీద అంతులేని ప్రేమను చూపిస్తున్నారు. ఇందుకు ధన్యవాదాలు. నేను మీకు రుణపడ్డాను’’ అని చెప్పారు. బీజేపీ కార్యకర్తలపై రాజకీయ కక్షతో జులుం చేస్తున్నారని తనకు తెలుసని, తెలంగాణ వికాసం కోసం తమ పార్టీ కార్యకర్తలు బలిదానాలు చేస్తున్నారని అన్నారు. 
భారత ఏక్తా తమ అందరి సంకల్పమని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ‘‘దేశాన్ని విచ్ఛిన్నం చేయలనుకునేవాళ్లు స్వాతంత్ర్యం తర్వాత కూడా ఉన్నారు. కాని అది ఎప్పుడూ నిజం కాలేదు. కాదు కూడా’’ అని తెలిపారు. సొంత ఖజానాను పెంచుకునేందుకు ఒక కుటుంబం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. వీరికి పేదల కష్టాల గురించి బాధలేదని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని లూటీ చేయడమే వారి పని అని నిప్పులు చెరిగారు. కుటుంబ పాలన పోవడానికి తెలంగాణలో అందరూ పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవిష్యత్ కోసం, ఆత్మగౌరవం కోసం ఇక్కడ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. బీజేపీ పోరాటాలు ఫలితాలనిస్తున్నాయని, చాలా ఎన్నికల్లో తాము గెలిచామని గుర్తు చేశారు. ప్రజలు తమ వైపు చూస్తున్నారని, తెలంగాణలో రాజకీయ మార్పు ఖాయమన్నారు. ఇక్కడ అధికారంలోకి వచ్చి తీరుతామని విశ్వాసం వ్యక్తం చేశారు.
అంధ విశ్వాసాలు నమ్మేటోళ్లతో చాలా నష్టం
‘‘కేంద్ర పథకాల పేర్లను తెలంగాణలో మార్చి ‘మా పథకాలు’ అంటూ చెప్పుకుంటున్నారు. కాని జనం మనసుల్లో నుంచి మా పేరును తొలగించలేరు. మేం పేదల కోసమే జీవిస్తాం. వారి కోసమే అంకితమవుతాం” అని మోడీ స్పష్టం చేశారు. ఈ కాలంలోను కొందరు అంధ విశ్వాసాలు నమ్మేవాళ్లున్నారని, వాళ్ల వల్ల చాలా నష్టం జరుగుతుందని, ఇలాంటి వాళ్లు తెలంగాణకు ఎలాంటి న్యాయం చేయలేరని చెప్పారు. మూఢ విశ్వాసాలను నమ్మిన ముఖ్యమంత్రులు ఎక్కువకాలం ఉండరన్నారు. ‘‘నేను సీఎంగా ఉన్నప్పుడు గుజరాత్‌‌‌‌లో కొన్ని ప్రాంతాలకు పోతే నా పదవి పోతుందని చెప్పారు. అయినా నేను వాటిని నమ్మకుండా వెళ్లాను. నేను విజ్ఞానాన్ని, టెక్నాలజీని మాత్రమే నమ్ముతా. యూపీ సీఎం యోగి కూడా సన్యాసి పరంపర నుంచి వచ్చినా మూఢవిశ్వాసాలను నమ్మరు. విజ్ఞానాన్నే నమ్ముతానని చెబుతూ ఉంటారు. తెలంగాణలో మూఢనమ్మకాలను నమ్మిన సీఎం.. ఈ ప్రాంత అభివృద్ధికి ఏమీ చేయలేడు. ఇలాంటి వాళ్ల నుంచి తెలంగాణను కాపాడుకోవాలి’’ అని ప్రధాని పిలుపునిచ్చారు. ‘‘అప్పట్లో నేను పెద్దగా ఎవరికీ తెలియని రోజుల్లోనే హైదరాబాద్‌‌‌‌లో నా స్పీచ్ వినడానికి టికెట్ పెట్టుకొని వచ్చారు. అదే నా జీవితంలో టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత నాకు దేశానికి సేవ చేసే అవకాశం దొరికింది. ఇదే హైదరాబాద్‌‌‌‌లో, ఇదే తెలంగాణలో మేం కొత్త చరిత్ర రాస్తూ.. కాషాయ జెండా ఎగరేస్తం” అని మోడీ చెప్పారు.
నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: సంజయ్
కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో బుధవారం తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. బేగంపేట ఎయిర్ పోర్టు ఆవరణలో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘కాశీలోని మసీదులో శివలింగం బయటపడలేదా? బాబ్రీ మసీదులో కూడా రామశిలలు బయటపడ్డాయి. అందుకే నేను మాట్లాడిన మాటల్లో ఎలాంటి తప్పులేదు” అని అన్నారు. మోడీ సభకు కార్యకర్తలు, జనం రాకుండా పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. ‘‘సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు ఏం పని ఉందని బెంగుళూర్ వెళ్లారు. సమస్యలు ఉంటే మోడీని నేరుగా సీఎం కలిసి చెప్పుకోవచ్చు కదా” అని ప్రశ్నించారు.
జనం రాకుండా పోలీసులు అడ్డుకున్నరు: రాజాసింగ్, ప్రభాకర్
సీఎం కేసీఆర్ డైరెక్షన్‌‌‌‌లో రాష్ట్ర పోలీసులు బేగంపేట సభకు కార్యకర్తలు, జనం రాకుండా అడ్డుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌‌‌‌ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. సిటీలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయిందంటూ సభకు వచ్చే వారిని అడ్డుకొని వెనక్కి పంపారన్నారు. అయినా టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్, పోలీసుల కుట్రలను ఛేదించుకొని తమ కార్యకర్తలు వచ్చారని చెప్పారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, ప్రజలు తిరగబడే రోజు వస్తుందని హెచ్చరించారు.
ఘన స్వాగతం
బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న మోడీకి.. గవర్నర్​ తమిళిసై, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. తర్వాత బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, వివేక్ వెంకటస్వామి, లక్ష్మణ్, రఘునందన్ రావు, రాజా సింగ్, ఈటల రాజేందర్, సోయం బాపూరావు, గరికపాటి, విజయశాంతి, మురళీధర్ రావు, డీకే అరుణ ఇతర సీనియర్ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడే ప్రధానికి రాష్ట్ర  బీజేపీ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టు ఆవరణలో బీజేపీ ఏర్పాటు చేసిన సభా వేదికపైకి మోడీ రాగానే పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు చప్పట్లతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సభకు అధ్యక్షత వహించిన సంజయ్.. మోడీని మాట్లాడాల్సిందిగా కోరడంతోనే ప్రధాని తన స్పీచ్ ను ప్రారంభించారు. ఇతర నేతలు ఎవరూ వేదికపై మాట్లాడలేదు. మధ్యాహ్నం ఒంటి గంటకు వేదికపైకి వచ్చిన మోడీ, 1.07 గంటలకు ప్రసంగాన్ని ప్రారంభించి 1.32కి ముగించారు. 25 నిమిషాలపాటు మాట్లాడారు.
ఒకే నెలలో ముగ్గురు అగ్ర నేతలు.. 
ఒకే నెలలో తెలంగాణకు ముగ్గురు అగ్ర నేతలు రావడంతో రాష్ట్ర బీజేపీ క్యాడర్‌‌‌‌‌‌‌‌లో ఫుల్ జోష్ వచ్చింది. ఈ నెల 5న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మహబూబ్‌‌‌‌నగర్ సభలో, ఈ నెల 14న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తుక్కుగూడ బహిరంగ సభలో, ఇప్పుడు ప్రధాని మోడీ బేగంపేట్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టులో స్వాగత సభలో మాట్లాడారు. నిజానికి బేగంపేట సభలో మోడీ కేవలం అభివాదం మాత్రమే చేస్తారని, స్పీచ్ ఉండదని పార్టీ నేతలు చెప్పారు. కానీ చివరి నిమిషంలో మోడీ ప్రసంగిస్తారని చెప్పడం, ఆయన 25 నిమిషాలపాటు మాట్లాడడం పార్టీ కార్యకర్తల్లో మంచి ఊపునిచ్చింది. ఓ వైపు కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను టార్గెట్ చేస్తూ, ఇంకో వైపు తెలంగాణలో పార్టీ కోసం కార్యకర్తలు పోరాడుతున్న తీరును ప్రస్తావించడంతో కాషాయదళంలో కొత్త కళ కనిపించింది.