
- ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి పదవి రేసులో పలువురు ఆశావహులు
- పార్టీ కోసం పనిచేసిన వారికే అధిష్ఠానం పెద్దపీట!
ఆసిఫాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఖాళీ అయిన నామినేటెడ్ పోస్టులను నెల రోజుల్లో భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. గత పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పనిచేసిన వారికే ఈ పోస్టులు దక్కే అవకాశం ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిన ఆసిఫాబాద్ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు.
జనరల్ నియోజకవర్గమైన సిర్పూర్లో తనకు సన్నిహితుడైన రావి శ్రీనివాస్‌ను సీఎం రేవంత్ రెడ్డి బరిలో దించగా, ఏజెన్సీ నియోజకవర్గం ఆసిఫాబాద్‌లో శ్యామ్ నాయక్‌ను కాంగ్రెస్ బరిలో దించగా.. ఈ రెండు చోట్ల ఓడిపోయారు. ఆదివాసులు అధికంగా ఉన్న ఆసిఫాబాద్ నుంచి లంబడా సామాజికవర్గానికి చెందిన శ్యామ్ నాయక్‌ను అధిష్టానం పోటీలో దించడం కారణంగానే ఇక్కడ ఓడిపోయినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఆదివాసులు అధికంగా ఉన్న తిర్యాణి, సిర్పూర్ యూ, జైనూర్, లింగాపుర్, కెరమెరి మండలాల్లోని ఆదివాసీ ఓటర్లు తమ సామాజిక వర్గానికి చెందిన బీఆర్ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మి వైపు మొగ్గు చూపారు. దీంతో చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు కాంగ్రెస్ వచ్చే ఎంపీ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయాలని చూస్తోంది. ఈ రెండు నియోజకవర్గాల్లో బలమైన వ్యక్తికి నామినేటెడ్ పోస్టులను కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పార్టీ మారాలని ఒత్తిడి తీసుకొచ్చినా కాంగ్రెస్‌లోనే..
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియపై దృష్టి పెట్టింది. దీంతో ఉమ్మడి జిల్లాలో పదవులు ఎవరికి దక్కుతాయేననే చర్చ ఊపందుకుంది. ఆసిఫాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ కొక్కిరాల విశ్వప్రసాద్ రావుతోపాటు, సిర్పూర్‌కు చెందిన రావి శ్రీనివాస్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. విశ్వప్రసాద్ రావు రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. 2009, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కును గెలిపించడంలో విశ్వప్రసాద్ ముఖ్య భూమిక పోషించారు.
ప్రతికూల పరిస్థితుల్లోనూ పార్టీ వెంట ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ మారాలంటూ బీఆర్ఎస్ అగ్రనేతలు ఆయనపై ఒత్తిడి తీసుకోవచ్చినప్పటికీ ప్రలోభాలకు లొంగకుండా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. కొంతకాలంగా పార్టీకి సేవలందిస్తున్న తిర్యాణికి చెందిన సీనియర్ లీడర్ అనిల్ గౌడ్ పేరు సైతం వినిపిస్తోంది.
రేసులో మరికొందరు
అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన రావి.శ్రీనివాస్ సైతం నామినేటెడ్ పదవి ఆశిస్తున్నారు. ప్రస్తుతం సిర్పూర్ నియోజకవర్గ ఇన్ చార్జ్ గా కొనసాగుతున్న ఆయన.. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ వచ్చారు. టీడీపీ హయాం నుంచి రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా పేరున్న శ్రీనివాస్ పేరును కూడా ఈ పదవి కోసం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆదిలాబాద్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కంది శ్రీనివాస్ రెడ్డి సైతం నామినేటెడ్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
గతంలో డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సాజిద్ ఖాన్ సస్పెండ్ కావడంతో ఇప్పుడు ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. ఆయనతోపాటు మరో ఇద్దరు సీనియర్లు సుజాత, సంజీవరెడ్డి సైతం పార్టీని వీడటంతో డీసీసీ పదవి తనకు దక్కుతుందని కంది శ్రీనివాస్ గంపెడాశతో ఉన్నారు. నిర్మల్ డీసీసీ ప్రెసిడెంట్ శ్రీహరిరావుతోపాటు.. సీనియర్ లీడర్, ముథోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ కూడా నామినేటెడ్ పదవి కోరుకుంటున్నారు. పదేండ్లపాటు టీడీపీలో, ఆ తర్వాత ఎన్సీపీలో కొనసాగిన నారాయణరావు.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు. ఆయన సైతం నామినేటెడ్ పదవిని ఆశిస్తున్నారు.