ప్రభుత్వాల ఆదరణ ఉంటే.. నూతన ఆవిష్కరణలు

ప్రభుత్వాల ఆదరణ ఉంటే.. నూతన ఆవిష్కరణలు

మనిషి  మనుగడలో  ఉపాధి పాత్ర  వివిధ రూపాలలో ఒక్కో వృత్తిలో ఒక్కో కోణంలో ఆవిష్కృతం అవుతుంది. నాటి నుంచి నేటివరకు ఉపాధి వేటలో మనిషి తన అనుకూల, ప్రభావిత  పరిస్థితుల నేపథ్యంలో అడుగులు వేస్తున్నాడు. ముఖ్యంగా ఉపాధి కల్పనలో వ్యవసాయం, చేనేత  ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి.  సృజనాత్మకత,  కళాకృతుల మేళవింపుతో   చేనేతకారులు ఎటువంటి  ఏమరపాటుకు తావు ఇవ్వకుండా మగ్గాలపై,  మర మగ్గాలపై  కృషి చేస్తేనే ఒక ఉత్పత్తి అనేది బయటపడుతుంది. బహుళ జాతి సంస్థలు వస్ట్ర ప్రపంచంలో విస్తరిస్తున్నాయి.  అనేకమంది కార్మికులు, యజమానులచే  సిరిసిల్లలో  వస్త్రోత్పత్తులు పురుడు పోసుకుంటున్నాయి. రాష్ట్రంలోనే మరో  భివండీగా, మరో షోలాపూర్​గా  వస్ట్ర  పరిశ్రమలో ఉత్పత్తి కేంద్రంగా కొనసాగుతున్న సిరిసిల్లకు దశాబ్దాల చరిత్ర ఉంది.  

సిరిసిల్ల  మరమగ్గాల పరిశ్రమపై ఆధారపడిన దాదాపు 50 వేల మంది  అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు.  ఆత్మహత్యలు, ఆకలి చావులు, వ్యాపారాలలో మందగమనంతో నేతన్న ఒడుదొడుకులు సిరిసిల్ల చరిత్రలో ఉన్నాయి. వస్త్ర ఉత్పత్తి పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులు కూడా వీరి కష్టాలకు ఒకింత కారణం.  వృత్తినే నమ్ముకొని  జీవనం కొనసాగిస్తున్న కార్మికుల బతుకు చిత్రంలో  వారి శ్రమకు పలు విధాలుగా దోహదమైన వాటిలో కాటన్, పాలిస్టర్ పరిశ్రమలున్నాయి. 

ప్రభుత్వ పథకాల ద్వారా ఉపాధి

చేనేత మగ్గాలపై  గతంలో కాటన్ చీరలు, ధోవతులు, పంచెలు, కండువాలు విరివిగా నేసి వివిధ ప్రాంతాలకు ఎగుమతులు చేసేవారు.  అనంతరం  మరమగ్గాల పరిశ్రమ విస్తృత రూపాన్ని దాల్చుకొని పవర్​లూములు, రేపర్ లూములపై  షూటింగ్,  సెట్టింగ్,  వస్త్రాలు తయారు చేసి  దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఎగుమతులు చేసేవారు.   ఉత్పత్తిదారుడే  అమ్మకందారుడుగా మారి వివిధ మార్కెట్లలో ఆటుపోట్లను ఎదుర్కొనేవాడు.  అనేక ఉత్పత్తులను తయారుచేసి ఒక కుటీర పరిశ్రమ నేపథ్యం నుంచి యజమానులుగా కొనసాగారు.  యంత్రాలలో, కార్మికుల నైపుణ్యంలో, వివిధ రకాల మార్కెట్లను అన్వేషించడంలో యజమానులు ఎవరికివారు ఒక నిర్మాణాత్మక వ్యవస్థను కొనసాగించారు.  

కానీ,  మార్కెట్,  రవాణా పరిస్థితులు సిరిసిల్ల పట్టణానికి అనువుగా లేకపోయినా కులవృత్తిపైన ఆధారపడిన పద్మశాలి వర్గం సిరిసిల్లలో  అధికంగా ఉండడం వల్ల ఉత్పత్తిని ఏకతాటిపై నడిపించే ప్రయత్నం  జరుగుతున్నది.  తరతరాలుగా వారసత్వంగా వృత్తిలో  కొనసాగుతున్నారు.  కాటన్ పరిశ్రమను నమ్ముకొని అనేకమంది ఉత్పత్తులు కొనసాగిస్తున్నారు. ఒక ప్రత్యేక మార్కెట్ వ్యవస్థ, రవాణా వ్యవస్థ లేని కారణంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఆటుపోట్లను ఎదుర్కొన్న సందర్భంలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరల తయారీ పథకం  పరిశ్రమ వర్గాల్లో  కొత్త ఆవిష్కరణగా నిలిచింది. దానికి తోడుగా రాజీవ్ విద్యా మిషన్  ( ఆర్వీఎం ) ద్వారా పలు ప్రభుత్వ ఆర్డర్లు ఉత్పత్తికి ఊతం ఇచ్చాయి.   ప్రభుత్వ పథకాలు  నేత వర్గాలకు అండగా నిలిచాయి.

కళాత్మక ఉత్పత్తుల ఆవిష్కరణ

విభిన్న కళాత్మక ఉత్పత్తులను ఆవిష్కరిస్తున్నది సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ.  ఒక సెంటీమీటర్ చదరపు వస్త్రంలో వార్పు ( నిలువు ) వెఫ్ట్ ( అడ్డం) నిర్మితమైన నూలు దారాలను ప్రామాణిక టెక్స్ టైల్  లెక్కల ఆధారంగా వస్త్రాన్ని తయారు చేస్తారు.   సృజనాత్మకతతో  వస్త్రం తయారుచేసిన తదుపరి అద్దకం( డయింగ్ యూనిట్ల ద్వారా) రసాయనాలతో  రంగు రంగుల వస్త్రాలను తయారు చేయడం జరుగుతున్నది. అద్దకం పరిశ్రమలో కూడా  ప్రత్యేకమైన శ్రద్ధ, కళాత్మకతతో  కృషి  చేస్తేనే  ఒక వస్త్రం రూపం దాల్చుకుంటుంది.  చేనేత వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఐక్యవేదిక  సిరిసిల్లలో కాటన్ పరిశ్రమను ఆదుకోవాలని కోరుతూ ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టినా వారు ఆశించిన ఫలితం దక్కలేదు. పద్మశాలి సామాజిక వర్గాలు  నేత వృత్తిని నమ్ముకుని  మనుగడను కొనసాగిస్తున్నాయి.  నేత పరిశ్రమ దాని అనుబంధ పరిశ్రమలకు కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాల ఆదరణ ఉన్నట్లయితే  మరిన్ని నూతన ఆవిష్కరణలు ఉత్పన్నమవుతాయి.  వాటికి నిదర్శనంగా సిరిసిల్ల నేత కార్మికుల కళాకృతులైనటువంటి అగ్గిపెట్టెలో అమర్చగల చీరను నేసి ప్రపంచానికి చాటి చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల  యార్న్ డిపో ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్లకు అనుమతులు ఇవ్వడం హర్షించదగ్గ విషయం. సిరిసిల్ల నేత వర్గీయులు మరిన్ని కొత్త ఆవిష్కరణలతో  ఫలితాలను సాధించే దిశగా సాగాలని ఆశిద్దాం.

- డా. చిటికెన కిరణ్ కుమార్.
మెంబర్,  ఇంటర్నేషనల్ బెనివలెంట్
రీసెర్చ్ ఫోరం