బిజినెస్ డెస్క్, వెలుగు: జాబ్స్ వెతికే వారిని కొత్త సంవత్సరం నిరుత్సాహపరచదని సర్వేలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌కు సంబంధించి హైరింగ్ అవుట్‌లుక్ ఎలా ఉంటుందో మ్యాన్‌పవర్ గ్రూప్ ఎంప్లాయ్‌మెంట్ సర్వే చేసింది. ఈ సర్వే ప్రకారం, వచ్చే మూడు నెలల్లో హైరింగ్‌ను చేపట్టాలని 49 శాతం కంపెనీలు ప్లాన్స్ వేసుకున్నాయి. ఈ ఏడాది జనవరి–మార్చి పిరియడ్‌తో పోలిస్తే హైరింగ్ సెంటిమెంట్ 43 శాతం పెరిగిందని ఈ సర్వే పేర్కొంది. వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి బాగా స్కిల్స్ ఉన్న ఉద్యోగులకు ఫుల్ డిమాండ్ క్రియేట్ అవుతుందని అంచనావేస్తోంది. జీతాలను ఎక్కువగా ఇచ్చే సెక్టార్లలో ఐటీ, టెక్నాలజీ ముందుంటాయని అభిప్రాయపడింది. ‘వచ్చే ఏడాది స్పెసిఫిక్ రోల్స్ కోసం హైరింగ్ పెరుగుతుంది. రిక్రూటర్లు ‘దేని కోసం హైర్’ చేసుకోవాలనే అంశంపై కంటే ‘ఎవరిని హైర్ చేసుకోవాలి’ అనే కాన్సెప్ట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు’ అని మెర్సర్‌మెట్ల్ సీఈఓ సిద్దార్ధ గుప్తా అన్నారు. గ్రేట్ రిజిగ్నేషన్, కరోనా సంక్షోభం, డిజిటైజేషన్ వంటి అంశాల వలన ‘వర్క్’ అనే పదం డెఫినిషన్ మారిపోయిందని అన్నారు. ఉదయం 9– సాయంత్రం 5 వరకు, సోమవారం నుంచి శుక్రవారం వరకు వర్క్ చేసే కాలం ముగింపు దశకు వచ్చిందని చెప్పారు. ఎక్కువ టైమ్ ఆఫీస్‌లో ఉంటే ఎక్కువ పనిచేసినట్టనే ఆలోచన పాతబడిందని అన్నారు.
కంపెనీలు భయపడడం లేదు..
కరోనా సంక్షోభం నుంచి ఎకానమీ రికవరీ అవుతోందని, దీంతో కంపెనీల రెవెన్యూలు పెరుగుతున్నాయని ఎనలిస్టులు చెబుతున్నారు. కొత్తగా జాబ్స్ క్రియేట్ అవుతాయని, ప్రొఫెషనల్స్‌కు మంచి ప్యాకేజిలు అందుతాయని పేర్కొన్నారు. కరోనా ఒమిక్రాన్ భయాలు ఇంకా కొనసాగుతున్నప్పటికీ కంపెనీలు ఆందోళనపడడం లేదు. 2020 ప్రారంభంలో దేశ జాబ్ మార్కెట్‌కు కరోనా దెబ్బ తగిలింది. ఫార్మల్‌తో పాటు ఇన్‌ఫార్మల్ సెక్టార్ కూడా నష్టపోయింది. ప్రస్తుతం ఈ గాయాల నుంచి ఎకానమీ బయటపడుతోంది. ప్రస్తుతం దేశ జాబ్ మార్కెట్ పాజిటివ్‌గా ఉందని ఎనలిస్టులు పేర్కొన్నారు. ‘ఒమిక్రాన్ ఉన్నా, లేకపోయినా, పూర్తిగా షట్‌డౌన్ ఉండదని కంపెనీలు నమ్ముతున్నాయి’ అని టీమ్‌లీజ్ సర్వీసెస్ బిజినెస్ హెడ్ ఏ బాలసుబ్రమణియన్ అన్నారు. ఉద్యోగులు తిరిగి ఆఫీస్‌లకు వస్తుండడం పెరుగుతోంది. ప్రజల వినియోగం పెరుగుతుండడంతో కంపెనీలు తమ రిక్రూట్‌మెంట్ ప్లాన్స్‌ను కొనసాగిస్తున్నాయి. వ్యాక్సినేషన్ ప్రాసెస్ సక్సెస్ అవుతుండడంతో కంపెనీల్లో నమ్మకం పెరుగుతోంది. ‘ప్రైవేట్ ఈక్విటీ, మెర్జర్ అండ్ అక్విజేషన్ (ఎం అండ్ ఏ) డీల్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్లు పెరిగాయి. అన్ని సెక్టార్లలో స్కిల్స్ ఉన్నవారికి షార్టేజ్ కనిపిస్తోంది. ఇవన్నీ 2022 లో జాబ్ మార్కెట్ బాగుంటుందనే విషయాన్ని చెబుతున్నాయి’ అని ఎస్‌హెచ్‌ఆర్‌ఎం ఇండియా, సీనియర్ నాలెడ్జ్ అడ్వైజర్ నిత్య విజయ్‌కుమార్ అన్నారు. వరెస్ట్ పోయిందా? లేదా? అనేది టైమ్ మాత్రమే చెప్పగలదని, కానీ, అన్ని సెక్టార్లు ఫ్యూచర్ కోసం ప్రిపేర్‌గా ఉన్నాయన్నారు. కాగా, వైట్‌కాలర్ జాబ్స్ (ఆఫీసుల్లో చేసే జాబ్స్) కు డిమాండ్ పెరుగుతోంది.
టాలెంట్ ఉన్నవారికి ఫుల్ గిరాకి..
టాలెంట్ ఉన్నవారిని ఆకర్షించడం, ఉద్యోగులు జాబ్ మానేయకుండా చూసుకోవడం కంపెనీలకు పెద్ద సమస్యలుగా ఉన్నాయి. దీంతో కంపెనీలు కూడా టాలెంట్ ఉన్నవారికి భారీగా శాలరీలను ఆఫర్ చేస్తున్నాయి. వారి స్కిల్స్‌ను పెంచేందుకు స్కీమ్‌లు తెస్తున్నాయి. వారి వెల్‌నెస్ కోసం చర్యలు తీసుకుంటున్నాయి. ఉద్యోగులు మానేయకుండా ఉండేందుకు సగటున 7-–9 శాతం శాలరీ హైక్‌ను ఆఫర్ చేస్తున్నాయి. టాప్ పెర్ఫార్మర్లకు సగటు ఎంప్లాయికి ఇచ్చే ఇంక్రిమెంట్ కంటే 1.5-–1.8 రెట్లు ఎక్కువ ఇంక్రిమెంట్‌ను ఆఫర్ చేస్తున్నాయి. వచ్చే ఏడాది ఇండియాలో ఇచ్చే శాలరీలు ఆసియా–-పసిఫిక్ రీజియన్‌లోనే ఎక్కువగా ఉంటాయని విల్లీస్ టవర్స్ వాట్సన్ రిపోర్ట్ శాలరీ బడ్జెట్ ప్లానింగ్ వెల్లడించింది. ఐటీ, టెక్నాలజీ, టెలికం, మీడియా, హాస్పిటాలిటీ, బీఎఫ్‌ఎస్‌ఐ, రియల్‌ఎస్టేట్, ఫిన్‌టెక్, ఎడ్‌టెక్, ఎన్‌బీఎఫ్‌సీ, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా సెక్టార్లలో హైరింగ్ ఎక్కువగా జరుగుతుందని వివరించింది.