భూభారతితో వివాదాలకు పరిష్కారం : రాజీవ్​గాంధీ హనుమంతు

భూభారతితో వివాదాలకు పరిష్కారం : రాజీవ్​గాంధీ హనుమంతు
  • పెండింగ్​ సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం
  • ‘ధరణి’లో లోపాలు సరిదిద్దుతూ కొత్త చట్టం
  • ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి,  కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
  • బోధన్ పట్టణంలో రెవెన్యూ అవగాహన సదస్సు

బోధన్,వెలుగు: వివాదాలకు పరిష్కారం చూపుతూ రైతులకు భూ యాజమాన్య హక్కులు కల్పించేందుకే కాంగ్రెస్​ ప్రభుత్వం ‘భూభారతి’ కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందని ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి, కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు అన్నారు.  మంగళవారం బోధన్​ పట్టణంలోని లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి ఆడిటోరియం లో ‘భూభారతి’ రెవెన్యూ అవగాహన సదస్సు నిర్వహించారు. భూభారతి చట్టంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏండ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సాదా బైనామాల క్రమబద్ధీకరణకు ‘భూభారతి’లో అవకాశం ఉందన్నారు.   ‘ధరణి’ లోపాలను సరిదిద్దుతూ కాంగ్రెస్​ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి ఆర్వోఆర్​ చట్టం దేశానికే రోల్​ మాడల్​ అన్నారు. 

ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పైలట్​ గ్రామాల్లో పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు.  తొలి విడతగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 3500 మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు.  ఇందిరమ్మ ఇండ్లకు నామమాత్రపు రుసుముతో ఇసుక సరఫరా అయ్యేలా చొరవ చూపాలని అధికారులకు సూచించారు.   మే, జూన్ మాసాల్లో  రైతు సదస్సులు ఉంటాయని, భూ సమస్యలు ఉన్న రైతులు అర్జీలు సమర్పించవచ్చన్నారు. ఆన్​లైన్​లోనూ భూ సమస్యలపై దరఖాస్తు చేసుకోవచ్చని, ‘భూభారతి’లో  రెండంచెల అప్పీల్​ వ్యవస్థ ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.  అప్పీలు చేసుకున్న రైతులకు అధికారులు ఉచిత న్యాయ సాయం అందిస్తారన్నారు. 

ఆధార్​ తరహాలో ప్రతి రైతుకు భూధార్​ కార్డులు అందజేస్తామన్నారు. ఎవరైనా సర్టిఫైడ్ కాపీలు కావాలంటే ‘భూభారతి’లోని ఫారంలో రూ.10 రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని,  తహసీల్దార్ సర్టిఫైడ్ కాపీలు జారీ చేస్తారని సూచించారు.  పహాణీ, భూముల రిజిస్ట్రర్, మార్పుల రిజిస్ట్రర్, నీటి వనరుల రిజిస్ట్రర్లను ప్రభుత్వం నిర్వహిస్తుందని, భూమి హక్కుల రికార్డుల్లోని వివరాలను ఈ రికార్డులో ఆన్ లైన్ ద్వారా పొందుపరుస్తారని తెలిపారు.  మ్యుటేషన్ చేసిన ప్రతిసారి ఆన్​లైన్​లో గ్రామ లెక్కల్లో మార్పులు జరుగుతాయని, ప్రతి సంవత్సరం డిసెంబర్​ 31న  గ్రామ రెవెన్యూ రికార్డులను ప్రింట్ తీసి భద్రపరుస్తారన్నారు. 

అధికారులు ఎలాంటి తప్పిదాలకు పాల్పడినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.  అనంతరం కల్యాలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులను ఎమ్మెల్యే, కలెక్టర్​ అందజేశారు.   కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్​ కిరణ్​ కుమార్, సబ్ కలెక్టర్ వికాస్​ మహతో, ఏసీపీ శ్రీనివాస్​, తహసీల్దార్ విఠల్​, స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు.  

డంపింగ్ యార్డు పరిశీలన

బోధన్, వెలుగు : బయోమైనింగ్ కాంట్రాక్టర్​కు చెల్లించిన బిల్లుల విషయంలో కమిషనర్​పై ఆరోపణలు రావడంతో బోధన్ పట్టణ శివారులోని డంపింగ్ యార్డును ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి పరిశీలించారు. తడి, పొడి చెత్తను వేరే చేసే యంత్రాన్ని పరిశీలించి, అగ్నిప్రమాదం ఎలా జరిగిందని ఆరా తీశారు. అనంతరం మున్సిపల్ ఆఫీసులో మూలకుపడ్డ  ట్రాక్టర్లు, ఆటోలకు మరమ్మతులు చేయించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు.