- కొత్త మండలాలు ఏర్పాటు చేసి.. సొంత బిల్డింగ్‌లు నిర్మించని గత సర్కార్
- సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్న జనం
- కొన్నేమో శంకుస్థాపన చేసి వదిలేయగా..
- మరికొన్నింటికి జాగలు దొరుకుతలేవని పక్కకు పెట్టిన్రు..
అద్దె బిల్డింగుల్లో అవస్థలు
గత ప్రభుత్వ హయాంలో జిల్లాల విభజనతోపాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొత్తగా 13 మండలాలను ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లాలో గన్నేరువరం, ఇల్లందకుంట, పెద్దపల్లి జిల్లాలో రామగిరి, అంతర్గాం, పాలకుర్తి, రాజన్నసిరిసిల్లలో వీర్నపల్లి, రుద్రంగి, తంగళ్లపల్లి, జగిత్యాల జిల్లాలో ఎండపల్లి, భీమారం, జగిత్యాల రూరల్, బీర్పూర్, బుగ్గారం మండలాలు ఏర్పాటయ్యాయి. వీటికి మండల ఆఫీసులు, పోలీస్‌స్టేషన్లు, ఎంపీడీఓ, తహసీల్, ఇతర ఆఫీసులు ఏర్పాటు చేశారు. కొత్త మండలాల్లో సొంత బిల్డింగులు లేకపోవడంతో తాత్కాలికంగా అద్దె భవనాల్లో ఏర్పాటు చేశారు.
ఆ ఆఫీసులు ఇప్పటికీ అద్దె బిల్డింగ్‌ల్లోనే కొనసాగుతున్నాయి. ఈ బిల్డింగుల్లో సరైన వసతులు లేకపోవడంతో జనం, ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా మహిళా సిబ్బంది, మహిళలు టాయిలెట్ల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని మండలాల్లోని ఆఫీసులు మరో ఆఫీసు ఆవరణలో కొనసాగిస్తున్నారు.
కొత్త మండలాల్లో ఆఫీసులు ఇలా..
పెద్దపల్లి జిల్లా రామగిరిలో పోలీసుస్టేషన్ నిర్మాణానికి భూమిపూజ చేసి వదిలేశారు. ఆ జాగను ప్రస్తుతం హరితహారం కింద మొక్కలు పెంచడానికి కేటాయించినట్లు సమాచారం. కొన్ని ఆఫీసులకు శంకుస్థాపన జరిగినా పనులు మొదలు కాలేదు. రామగిరి మండలంలోని పోలీసుస్టేషన్, తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ, ఏఓ ఆఫీసులన్నీ సింగరేణి క్వార్టర్స్‌లో నిర్వహిస్తున్నారు. అంతర్గాం మండలంలో పోలీస్ స్టేషన్ మినహా దాదాపు అన్ని ఆఫీసులు ప్రైవేటు బిల్డింగ్‌లోనే కొనసాగుతోంది. పాలకుర్తి మండల తహసీల్దార్ఆఫీసు రైస్‌మిల్లులో ఏర్పాటు చేశారు. మిగతా ఆఫీసులు కూడా కిరాయి బిల్డింగుల్లోనే కొనసాగుతున్నాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి మండల తహసీల్దార్ఆఫీసు సర్కార్స్కూల్లో ఆవరణలో కొనసాగిస్తున్నారు. తంగళ్లపల్లి, రుద్రంగి మండలాల్లోనూ ఇదే పరిస్థితి.
కరీంనగర్ జిల్లా గన్నేరువరం తహసీల్దార్ ఆఫీసు శిథిలమైన ఓ అద్దె భవనంలో సాగుతోంది. ఇల్లందకుంట మండలంలోనూ ఆఫీసులు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.
జగిత్యాల జిల్లాలోని బీర్పూర్ పోలీస్ స్టేషన్ మినహా అన్ని మండలాల్లోనూ ఆఫీసులన్నీ ప్రైవేట్ బిల్డింగ్‌ల్లోనే నడుస్తున్నాయి.