బాసర ట్రిపుల్ ఐటీ మెస్‌ల నిర్వహణకు టెండర్లు..పది వేల మందికి ఇక క్వాలిటీ ఫుడ్

 బాసర ట్రిపుల్ ఐటీ మెస్‌ల నిర్వహణకు టెండర్లు..పది వేల మందికి ఇక క్వాలిటీ ఫుడ్
  • ఈనెల 20 నుంచి టెండర్ ప్రక్రియ షురూ
  • ఏప్రిల్19 వరకు గడువు

నిర్మల్, వెలుగు:  నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఎట్టకేలకు కొత్త  మెస్ ఏజెన్సీలు రాబోతున్నాయి. రెండేళ్ల నుంచి ఇక్కడి విద్యార్థులు మెస్ ఏజెన్సీలను మార్చాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.  విద్యార్థుల ఆందోళనలకు దిగి వచ్చిన అప్పటి బీఆర్‌‌ఎస్ ప్రభుత్వం మెస్‌ ఏజెన్సీలను మార్చుతామని హామీ ఇచ్చి పట్టించుకోలేదు.  ప్రస్తుత మెస్ ఏజెన్సీలకు రాజకీయ అండదండలు పుష్కలంగా ఉండడంతో ఇప్పటివరకు వారి ఏజెన్సీలను మార్చలేకపోయారు.  

ఇటీవలే వైస్ ఛాన్స్ లర్ గా బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ గోవర్ధన్ పెద్ద ఎత్తున  సంస్కరణలు చేపట్టారు. విద్యార్థుల్లో  మానసిక ధైర్యం పెంచేందుకు ఆయన ఇప్పటికే పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. పరిశోధనాత్మక సెమినార్ లతోపాటు టెక్నికల్ టూర్ల లాంటి ప్రోగ్రాంలను నిర్వహించారు.  క్యాంపస్‌లో నిత్యం స్టూడెంట్స్ కు అందుబాటులో ఉంటూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. 

 మెస్ లపై ప్రత్యేక దృష్టి...

ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో మొత్తం మూడు మెస్ లు కొనసాగుతున్నాయి. ఒక్కో మెస్‌లో ప్రతి రోజు 3 వేల మంది విద్యార్థులు భోజనం చేస్తారు. అయితే వైస్ చాన్స్ లర్   గోవర్ధన్ ప్రతిరోజు ఏదో ఒక మెస్ లో విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్నారు. నాణ్యతా విషయంలో ఏదైనా తేడా వస్తే అక్కడికక్కడే మెస్ మేనేజర్ ని పిలిచి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతోపాటు ప్రతినెల మంజూరయ్యే బిల్లుల్లో  కోతలు విధిస్తున్నారు. మెస్ ల నిర్వహణ గడువు రెండేళ్ల క్రితమే ముగిసిపోయింది. రాజకీయ ఒత్తిళ్లు, సాంకేతిక, పరిపాలన పరమైన కారణాలతో ఆ ఏజెన్సీల గడువు పెంచుతూ వచ్చారు. ప్రస్తుత ఏజెన్సీలు తమకున్న పలుకుబడితో మెస్‌ల నిర్వహణ గడువును ఎక్స్ టెన్షన్ చేసుకున్నాయి.  ఈ నేపథ్యంలోనే వైస్ ఛాన్స్‌ లర్   గోవర్ధన్ మూడు మెస్‌ల  నిర్వహణ కోసం కొత్తగా టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీచేశారు. ఈ నెల 20 నుండి ఏప్రిల్ 19 వరకు ఆన్ లైన్ లో  టెండర్లు దాఖలు చేసేందుకు గడువు విధించారు.

ఎట్టకేలకు నెరవేరనున్న విద్యార్థుల డిమాండ్...

త్రిబుల్ ఐటీ విద్యార్థులు చాలా రోజుల నుంచి మెస్‌ల నిర్వహణ బాధ్యతలను మార్చి కొత్త ఏజెన్సీలకు అప్పజెప్పాలంటూ  గతంలో ఈ విషయమై విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. అప్పటి ప్రభుత్వం ఈ దిశగా స్పందించ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ట్రిపుల్ ఐటీపై ప్రత్యేక దృష్టి సారించడమే కాకుండా వైస్ చాన్స్‌ లర్‌‌ను, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ను నియమించి సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. 

నిధులను సైతం ఎప్పటికప్పుడు విడుదల చేస్తుండటంతో  ట్రిపుల్ ఐటీలో సమస్యలన్నీ దశలవారీగా పరిష్కారానికి నోచుకుంటున్నాయి.   విద్యార్థుల దీర్ఘకాలిక డిమాండ్ అయిన మెస్‌  ఏజెన్సీల మార్పు అంశాన్ని వైస్ ఛాన్స్ లర్ పరిగణలోకి తీసుకొని కొత్త ఏజెన్సీల నియామకానికి టెండర్లు పిలిచారు.