800 డిగ్రీల వేడిని తట్టుకునే సరికొత్త లోహం

800 డిగ్రీల వేడిని తట్టుకునే సరికొత్త లోహం
  • క్యుటాలి’ కి రూపకల్పన చేసిన యూఎస్​ ఆర్మీ రిసర్చ్​ ల్యాబ్
  • పేటెంట్​ ఇచ్చిన అమెరికా ప్రభుత్వం
  • విమానయానం, రక్షణ రంగం, ఇండస్ట్రీల అవసరాలకు వాడకం

హైదరాబాద్, వెలుగు: కొన్ని వందల డిగ్రీల సెల్సియస్​  వేడిని తట్టుకునే సరికొత్త లోహాన్ని అమెరికా శాస్త్రవేత్తలు తయారు చేశారు. కాపర్​, టాంటలం, లిథియం అణువులతో తయారు చేసిన ఆ లోహాన్ని క్యుటాలిగా సైంటిస్టులు పిలుస్తున్నారు. 800 డిగ్రీల సెల్సియస్​ టెంపరేచర్​ వద్ద కూడా ఆ లోహం చెక్కచెదరకుండా ఉంటుందని సైంటిస్టులు  చెబుతున్నారు. 

అమెరికాకు చెందిన యూఎస్​ ఆర్మీ రిసర్చ్​ లేబొరేటరీ, లీహై యూనివర్సిటీ పరిశోధకులు కలిసి క్యుటాలి లోహాన్ని డెవలప్​ చేశారు. విమానయాన రంగం, రక్షణ రంగం, పరిశ్రమల అవసరాలకు దీనిని ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా హైపర్​సోనిక్​  మిసైల్స్, హై  పెర్ఫార్మెన్స్​ టర్బైన్​ ఇంజిన్ల  తయారీకి ఈ లోహం అనువుగా ఉంటుందని తెలిపారు. కాపర్​ లిథియం ప్రెసిపిటేట్స్​ను టాంటలిం అణువులతో జతచేయడం ద్వారా హీట్​ కండక్టవిటీ గరిష్ఠంగా ఉంటున్నదని, అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద లోహ నిర్మాణాన్ని టాంటలం బైలేయర్​ స్టెబిలైజ్​ చేస్తున్నట్లు గుర్తించారు. 

ఇవీ లాభాలు..

ప్రస్తుతం జెట్  ఇంజిన్లలో నికెల్​ సూపర్​ అల్లాయ్స్​ను వాడుతున్నారని, అయితే.. అత్యధిక ఉష్ణోగ్రతలను ఆ లోహం తట్టుకోలేదని సైంటిస్టులు చెబుతున్నారు. టంగ్​స్టన్ ​ లోహాలు అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకున్నా.. చాలా మందంగా ఉండడం వంటి కారణాలతో వాటి తయారీ క్లిష్టంగా మారుతున్నదని పేర్కొన్నారు. వాటికి ఈ క్యుటాలి లోహం ప్రత్యామ్నాయం అవుతుందని వెల్లడించారు.  

నెక్స్ట్​ జనరేషన్​ ఇంజినీరింగ్​ సొల్యూషన్స్​కు వీటిని ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుందన్నారు. కాగా.. 800 డిగ్రీల వేడి వద్ద పదివేల గంటల పాటు ఆ లోహాన్ని టెస్ట్​ చేసి చూస్తున్నారు. ఈ లోహానికి అమెరికా పేటెంట్ ను ఇచ్చింది. సైన్యంలో వాడే హీట్​ ఎక్స్​చేంజర్స్, ప్రొపల్షన్​ సిస్టమ్స్, హైపర్​సోనిక్​ మిసైల్స్​ వంటి వాటిలో వినియోగించుకునేందుకు యూఎస్​ ఆర్మీ రిసర్చ్​ లేబొరేటరీ దీనిపై పేటెంట్​ను సంపాదించింది.