డాక్టర్ల నిర్లక్ష్యం వల్లేనని కుటుంబసభ్యుల ఆందోళన
చిట్యాల, వెలుగు: డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే పుట్టిన బిడ్డ, బాలింత మరణించారని ఆగ్రహిచిన కుటుంబ సభ్యులు దవాఖానా ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల సర్కార్ దవాఖానాలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మొగుళ్లపల్లికి చెందిన సంపెల్లి కవిత(25) చిట్యాల సీహెచ్‌సీలో డెలివరీ కోసం మంగళవారం అడ్మిట్ అయింది. ఆసుపత్రిలో ముగ్గురు గైనకాలజిస్టులు ఉన్నారు. అయితే బుధవారం రావాల్సి గైనకాలజిస్ట్ అటెండ్ అవలేదు. దీంతో స్థానికంగా ఉన్న ఓ డాక్టర్ సాయంతో డెలివరీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే పుట్టిన బిడ్డ మృతిచెందింది.
తల్లి పరిస్థితి విషమంగా ఉందని వరంగల్ ఆసుపత్రికి తరలించాలని డాక్టర్లు కుటుంబసభ్యులకు సూచించారు. వారు ఆసుపత్రి నుంచి బయటికి తీసుకొచ్చేసరికి ఆమెను చనిపోయింది. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే తల్లీబిడ్డలు మృతిచెందారని కోపోద్రిక్తులయ్యారు. ఆసుపత్రిలోని ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్సై అనీల్‌కుమార్ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తెచ్చారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యురాలు చందుపట్ల కీర్తిరెడ్డి ఆసుపత్రిని సందర్శించి, పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.