టైటిల్ : మస్త్ మే రెహనే కా
డైరెక్షన్ : విజయ్ మౌర్య
కాస్ట్ : జాకీ ష్రాఫ్, నీనా గుప్తా, అభిషేక్ చౌహాన్, మోనికా పన్వర్, ఫైసల్ మాలిక్, రాఖీ సావంత్
లాంగ్వేజ్ : హిందీ
ప్లాట్ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో
వీఎస్ కామత్ (జాకీ ష్రాఫ్) భార్య చనిపోవడంతో ముంబైలోని ఒక పెద్ద ఇంట్లో పన్నెండేండ్లుగా ఒంటరిగా ఉంటున్నాడు. అతనికి ప్రతిరోజూ వాకింగ్ చేసే అలవాటు ఉంది. వాకింగ్ చేసేటప్పుడు జాగింగ్ చేసే వాళ్లను నిశితంగా గమనిస్తుంటాడు. కానీ, ఎప్పుడూ వాళ్లతో మాట్లాడడు. అదే టైంలో మిసెస్ హండా (నీనా గుప్తా) ఇంట్లో దొంగతనం జరుగుతుంది. అందుకు కారణం.. కామత్ అనుకుని అతన్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తారు. అక్కడ హండాతో పరిచయం అవుతుంది. అది కాస్తా స్నేహంగా మారుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఒక దొంగ వల్ల వీళ్ల జీవితాలు ఎలా మారాయి? అనేది తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాలి.
జాకీ ష్రాఫ్, నీనా గుప్తా చాలా బాగా నటించారు. సిరీస్‌లో మొదటి 40 నిమిషాలు బాగుంటుంది. ఆ తర్వాత కథ కాస్త నెమ్మదిగా సాగినట్టు అనిపిస్తుంది. ఈ వృద్ధుల కథతోపాటు మరో కథ కూడా ఈ సిరీస్‌లో చూడొచ్చు. ఈ రెండు కథల్లో కామెడీతోపాటు సెంటిమెంట్ బాగా పండింది.
పొట్టి - పొడవు
టైటిల్ : లిటిల్ మిస్ రాదర్
డైరెక్షన్ : విష్ణు దేవ్
కాస్ట్ : గౌరీ జి కిషన్, షేర్షాషెరీఫ్, మనోజ్, సంగీత్ ప్రతాప్, జిష్ణు శ్రీకుమార్
లాంగ్వేజ్ : మలయాళం
ప్లాట్ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో
సినిమా ఫస్ట్ షాట్‌లోనే ఒక ఫిల్మ్ మేకర్ తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను స్క్రిప్ట్‌లా రాస్తుంటాడు. ఈ సినిమాకు అతనే నిర్మాత కూడా. పేరు అభిజిత్ (షేర్షా షెరీఫ్). అతని జ్ఞాపకాల్లో ఉన్న వ్యక్తి పేరు నైనా (గౌరీ జి కిషన్). వాళ్లిద్దరి ఆలోచనలు రెండు భిన్న ధృవాల్లా ఉంటాయి. కానీ.. ప్రేమించుకుంటారు. అతనికి బద్ధకం ఎక్కువ. ఆమెకి పరిశుభ్రత, బాధ్యత ఎక్కువ. అందుకే వీళ్ల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతుంటాయి. వాళ్లు చేసే అల్లరినే సినిమాగా తీశారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. నైనా పొట్టిగా, అభిజిత్ పొడవుగా ఉంటాడు. ఎత్తుల్లో ఉన్న తేడా కూడా వాళ్ల జీవితాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది.
డైరెక్టర్ విష్ణు దేవ్ గతం, వర్తమానాల మధ్య సినిమాను బాగా నడిపించాడు. లీడ్ రోల్‌లో చేసిన ఇద్దరూ బాగా నటించారు. ఇద్దరి మధ్య గొడవల వల్ల సినిమాలో కామెడీ కూడా జనరేట్ అయ్యింది.
నేరం చేసిందెవరు?
టైటిల్ : కడక్‌సింగ్
డైరెక్షన్ : అనిరుధ రాయ్ చౌధురి
కాస్ట్ : పంకజ్ త్రిపాఠి, పార్వతి తిరువోతు, సంజనా సాంఘి, జయా ఆషన్
లాంగ్వేజ్ : హిందీ
ప్లాట్ ఫాం : జీ5
ఏకే శ్రీవాస్తవ అలియాస్ కడక్ సింగ్ (పంకజ్ త్రిపాఠి) ఆర్థిక నేరాల డిపార్ట్మెంట్లో ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. ఓ కుంభకోణంలో ఇరుక్కుపోయిన కడక్ ఆత్మహత్యా ప్రయత్నం చేస్తాడు. చావు నుంచి తప్పించుకొని.. గతం మరిచిపోయి హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటుంటాడు. గతం మరిచిపోయినప్పటికీ అతనికి ఓ కొడుకు, భార్య ఉన్నారనే విషయం గుర్తుంటుంది. అప్పుడు అతని కూతురు అని చెప్పే సాక్షి (సంజనా సాంఘి) గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంటుంది. కానీ.. కడక్ మాత్రం తనకు కూతురు ఉన్న విషయం గుర్తు లేదని చెప్తాడు. ఇంతకీ ఆమె ఎవరు? అతను నిజంగానే గతం మర్చిపోయాడా? ఫైనాన్స్ కుంభకోణంలో అతని పాత్ర ఉందా?
హస్పిటల్‌లో చేరిన కడక్ సింగ్‌కు కూతురు సాక్షి గతంలో జరిగిన సంఘటనలు చెప్పడంతో సినిమా మొదలవుతుంది. దాంతో ఆ తర్వాత ఏం జరుగుతుంది? అనే క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది ప్రేక్షకుల్లో. మొదట్లో కాస్త విసుగు తెప్పించినా.. కుంభకోణం ఇన్వెస్టిగేషన్ మొదలయ్యాక ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇందులో సెంటిమెంట్ కూడా ఉంది. స్టోరీలో ఎమోషన్స్‌కు స్కోప్ ఉన్నప్పటికీ.. క్రైమ్ డ్రామాకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు.