టైటిల్ : మ్యాన్షన్ 24
డైరెక్షన్ : ఓం కార్
కాస్ట్ : వరలక్ష్మీ శరత్‌కుమార్, సత్యరాజ్, రావు రమేష్, శ్రీమాన్, అవికా గోర్, మానస్ నాగులపల్లి, అభినయ, రాజీవ్ కనకాల, నందు, బిందు మాధవి, తులసి, అర్చనా జాయిస్, అమర్ దీప్ చౌదరి
లాంగ్వేజ్ : తెలుగు
ప్లాట్ ఫాం : డిస్నీ+హాట్‌స్టార్
కాళిదాసు (సత్యరాజ్) ఆర్కియాలజీ విభాగంలో పనిచేస్తుంటాడు. అతను కనిపించకుండా పోయాడని ఒకరోజు వార్తలు వస్తాయి. కాళిదాసు చేస్తున్న రీసెర్చ్‌లో విలువైన సంపద దొరకడంతో దాన్ని తీసుకుని పారిపోయాడని అందరూ అనుకుంటారు. అతడిపై దేశద్రోహి అనే ముద్ర కూడా వేస్తారు. ఇదంతా చూసిన అతని భార్య (తులసి) మంచాన పడుతుంది. అతని కూతురు అమృత (వరలక్ష్మీ శరత్ కుమార్) ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. తండ్రి ఆచూకీ కనుక్కొని అతను నిజాయితీ పరుడని నిరూపించాలి అనుకుంటుంది.
కాళిదాసు కనిపించకుండా పోవడానికి ముందు ఓ పాడుబడిన మ్యాన్షన్‌కు వెళ్లాడని తెలుసుకుని, అక్కడకు వెళ్తుంది. దానికి వాచ్‌మెన్‌గా రావు రమేష్ పనిచేస్తుంటాడు. అతని ద్వారా అమృత ఆ మ్యాన్షన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటుంది. అందులో దెయ్యాలు ఉన్నాయని, అందులోకి వెళ్లిన వాళ్లు తిరిగి రారని చెప్తాడు అతను. అయినా.. లెక్క చేయకుండా అమృత ఆ మ్యాన్షన్‌లోకి వెళ్తుంది.
ఆ తర్వాత ఏం జరిగింది? అమృత తండ్రి ఏమయ్యాడు? తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అమృతగా వరలక్ష్మి శరత్‌కుమార్ బాగా నటించారు. ఇక రావు రమేష్, సత్యరాజ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మిగతావాళ్లు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. కథలో ట్విస్ట్‌లు బాగానే ఉన్నా.. తెరకెక్కించిన విధానం మాత్రం కొత్తగా లేదు.
లాహోర్ నుంచి ఢిల్లీకి
టైటిల్ : సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ (సీజన్ – 1)
డైరెక్షన్ : మిలాన్ లుథ్రియా, సుపర్న్ ఎస్. వర్మ
కాస్ట్ : అనుప్రియా గోయెంక, మౌనీ రాయ్, వినయ్ పాతక్, సునిల్ పల్వాల్, తాహిర్ రాజ్ భాసిన్, మెహ్రీన్ ఫిర్జాద, నిశాంత్ దాహియ
లాంగ్వేజ్ : హిందీ
ప్లాట్ ఫాం : డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
మన దేశం నుంచి పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఈ కథ మొదలవుతుంది. అప్పుడు జరిగిన అల్లర్లలో లాహోర్ నుంచి ప్రాణాలతో బయటపడిన అర్జున్ భాటియా (తాహిర్ రాజ్ భాసిన్) ఢిల్లీ చేరుకుంటాడు. అతను వయసు పెరుగుతున్న కొద్దీ ఇల్లీగల్ పనులు చేయడం మొదలుపెడతాడు. జగన్ సేథ్ (వినయ్ పాఠక్) సాయంతో అతని ఫ్రెండ్ బంగాలీ (అంజుమ్ శర్మ)తో కలిసి ఆయుధాల వ్యాపారం చేస్తుంటాడు. ఆ తర్వాత ఢిల్లీ అండర్ వరల్డ్‌లో డాన్‌గా ఎదుగుతాడు.
అందులో భాగంగానే ఎన్నో పోరాటాలు, ఘర్షణలు ఎదుర్కొంటాడు. అదే టైంలో సంజన (మెహ్రీన్ పిర్జాదా)తో అర్జున్ ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏ జరిగిందనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి. మేకింగ్‌లో సిరీస్ టైమ్‌లైన్‌కి తగ్గట్టు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. 1960ల్లోకి వెళ్లి చూసినట్టు అనిపిస్తుంది. కాకపోతే.. సెట్టింగ్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడితే బాగుండేది. అర్జున్ భాటియాగా తాహిర్ రాజ్, అంజుమ్ బంగాలీ పాత్రలో బాగా చేశారు.
దోచిందెవరు?
టైటిల్ : కాసర్‌గోల్డ్
డైరెక్షన్ : మృదుల్ నాయర్
కాస్ట్ : ఆసిఫ్ అలీ, సన్నీ వేన్, వినాయకన్, సిద్ధిక్, సంపత్ రామ్, దీపక్ పరంబోల్
లాంగ్వేజ్ : మలయాళం
ప్లాట్ ఫాం : నెట్‌ఫ్లిక్స్
ఫైజల్ (సన్నీ) మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన యువకుడు. తల్లి, భార్య దివ్య, చిన్న పాప.. వీళ్లే అతని ప్రపంచం. అతను కులాంతర వివాహం చేసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందుల్లో ఉంటాడు. ఆ తరువాత అతని కూతురు అనారోగ్యంతో బాధపడుతుంటుంది. ఆమెకు ఆపరేషన్ చేయించడానికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం పడుతుంది. దాంతో డబ్బు సంపాదించే అవకాశం కోసం ఎదురు చూస్తుంటాడు. అదే టైంలో వాళ్ల ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్న మూసా (సిద్ధికీ) వాళ్ల పార్టీ జిల్లా సెక్రెటరీగా ఉన్న నారాయణతో కలిసి బంగారం స్మగ్లింగ్ చేస్తుంటారు.
వాళ్ల మనుషుల ద్వారా దుబాయి నుంచి ఇక్కడికి బంగారం తీసుకొస్తుంటారు. ఈ వ్యవహారమంతా అల్బీ (అసిఫ్ అలీ) పర్యవేక్షణలో నడుస్తుంటుంది. అతని లవర్ నాన్సీ (మాళవిక శ్రీనాథ్) కూడా అతనికి సాయం చేస్తుంటుంది. ఒకసారి ఆమె దుబాయి నుంచి రెండున్నర కోట్ల ఖరీదు చేసే బంగారాన్ని అక్రమంగా తెస్తుంది. ఆ బంగారాన్ని అల్బీ, నాన్సీ కలిసి ఎయిర్‌పోర్ట్ నుంచి తీసుకొస్తుండగా వాళ్ల కారుని ఎదురుగా వచ్చిన ఫైజల్ కారు ఢీ కొడుతుంది.
అల్బీతో ఫైజల్, అతని ఫ్రెండ్స్ గొడవకు దిగుతారు. గొడవ సద్దుమణిగాక కారులో బంగారం కనిపించదు. దాంతో అల్బీ ఆ విషయాన్ని ఎమ్మెల్యేకు చెప్తాడు. ఫైజల్ బ్యాచ్ ప్లాన్ ప్రకారమే బంగారం కొట్టేసి ఉంటుంది అనుకుంటారు. దాంతో ఫైజల్‌ను పట్టుకోవడానికి ఎమ్మెల్యే రౌడీలను పంపుతాడు. సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ అలెక్స్ (వినాయకన్)ని కూడా ఫైజల్‌ని పట్టుకోవడానికి నియమిస్తాడు. ఎమ్మెల్యేకి అల్బీపై కూడా అనుమానం ఉంటుంది. ఆ బంగారాన్ని ఎవరు కొట్టేశారు? అల్బీకి, ఫైజల్‌కి మధ్య సంబంధం ఏంటి? చివరికి ఆ బంగారం ఎవరి చేతుల్లోకి వెళ్లింది?