
టైటిల్ : ఒన్ పీస్ (వెబ్ సిరీస్)
కాస్ట్ : ఇనకి గొడోయి, ఎమిలీ రడ్డ్, మకెన్యూ, తాజ్ స్కైలార్, పీటర్ గాడియట్, మోర్గాన్ డేవిస్, జెఫ్ వార్డ్, జాకబ్ గిబ్సన్, విన్సెంట్ రెగాన్
డైరెక్టర్ : మార్క్ జాబ్స్
లాంగ్వేజ్ : ఇంగ్లిష్, తెలుగు
ప్లాట్ ఫాం : నెట్ ఫ్లిక్స్
మాంకీ డి లూఫీ అనే ఒక కుర్రాడికి సముద్రపు దొంగలకు రాజు (పైరెట్స్) అవ్వాలనేది కల. అందుకోసం ఒక మిస్టీరియస్ ఒన్ పీస్ ట్రెజర్ని కనిపెట్టాల్సి ఉంటుంది. ఈ కుర్రాడు, తన ఫ్రెండ్స్‌తో కలిసి చేసిన అడ్వెంచర్స్ థ్రిల్లింగ్‌గా ఉన్నాయి. ఈ కథ జపనీస్ కామిక్ యానిమేషన్ స్టోరీ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీశారు. ఒరిజినల్ కామిక్ స్టోరీలానే ఇది కూడా బాగా తీశారు. ఒరిజినల్ స్టోరీ 45 ఎపిసోడ్స్ కాగా... దీన్ని ఎనిమిది ఎపిసోడ్లుగా తెరకెక్కించారు. అలాగని కథ, ఎమోషన్స్‌లో ఎక్కడా ఫీల్ తగ్గలేదు. ఇందులో సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, గ్రాఫిక్స్ బాగున్నాయి. ఈ సిరీస్‌లో యాక్టర్స్ అందరూ ఆయా పాత్రలకు సరిపోయారు. వాళ్ల యాక్టింగ్, యాక్షన్ సీన్స్ బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది.
నలుగురు ఫ్రెండ్స్ ఓ బిజినెస్ టూర్
టైటిల్ : నల్ల నిలవుల్ల రాత్రి
కాస్ట్ : బాబు రాజ్, చెంబన్ వినోద్ జోస్, జీను జోసెఫ్, బిను పప్పు, గణపతి, సాయికుమార్ రోనీ డేవిడ్, సజిన్ చెరుకాయిల్
డైరెక్టర్ : ముర్ఫీ దేవసీ
లాంగ్వేజ్ : మలయాళం
ప్లాట్ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో
నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తుంటారు. వాళ్లకు ఒక పాత ఫ్రెండ్ కలుస్తాడు. కర్నాటక వచ్చి బిజినెస్ చేసుకుంటే బాగుంటుందని సలహా ఇస్తాడు అతను. దాంతో వాళ్లు నలుగురు కలిసి కర్నాటకలోని షిమోగకి స్వకార్యం, స్వామి కార్యం అని బయల్దేరతారు. అక్కడికి వెళ్లాక ఏం జరిగిందనేది మిగతా కథ. ఇందులో అందరి క్యారెక్టర్స్ కరెక్ట్‌గా సెట్ అయ్యాయి. లొకేషన్స్, విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగున్నాయి. సింపుల్ సర్వైవల్ స్టోరీ ఇది. తెలుగులో లేదు.. కానీ, ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి. ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు.
రెస్క్యూ ఆపరేషన్
టైటిల్ : ది ఫ్రీలాన్సర్
కాస్ట్ : మోహిత్ రైనా, సుశాంత్ సింగ్, అనుపమ్ ఖేర్, కశ్మీర పరదేశీ, ఆయేషా రజా మిశ్రా, నవనీత్ మాలిక్.
డైరెక్టర్ : భవ్ దులియా
లాంగ్వేజ్ : హిందీప్లాట్ ఫాం : డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
ముంబయికి చెందిన ఆలియా అనే అమ్మాయి పెండ్లి చేసుకున్నాక సిరియాలో చిక్కుకుపోతుంది. ఆమెని తిరిగి ఇండియా తీసుకురావడం చుట్టూ కథ నడుస్తుంది. మొత్తం ఏడు ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. హీరో అవినాశ్ (మోహిత్ రైనా), ఇనాయత్ ఖాన్ పోలీస్ ఆఫీసర్స్. మంచి ఫ్రెండ్స్. కొన్ని కారణాల వల్ల వాళ్లిద్దరినీ సస్పెండ్ చేస్తారు. ఎవరి జీవితాల్లో వాళ్లు బిజీ అయిపోతారు. కొన్నాళ్లకు ఇనాయత్ ఖాన్ కూతురు ఆలియా ప్రేమించిన అబ్బాయితో పెండ్లి జరుగుతుంది.
అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఆలియా సిరియాలో ఎందుకు చిక్కుకుపోతుంది? తనను తిరిగి తీసుకురావడానికి అవినాశ్ ఏం చేశాడు? అనేది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే మోహిత్ రైనా యాక్షన్ సీక్వెన్స్‌లు బాగున్నాయి. టెర్రరిజం బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఈ సిరీస్ ఆద్యంతం సస్పెన్స్‌తో థ్రిల్ చేస్తుంది. ఇందులో నటీనటులందరి పర్ఫార్మెన్స్ బాగుంది.
జల కన్య లవ్ స్టోరీ
టైటిల్ : ది లిటిల్ మర్మెయిడ్ (వెబ్ సిరీస్)
కాస్ట్ : హాలీ బైలీ, మెలీసా మెక్కార్తి, జొనాహ్ హౌర్, జేవియర్ బార్డెమ్, జెస్సికా అలెగ్జాండర్, సైమన్ యాష్లే, జాకబ్ ట్రెంబ్లమ్, డిగ్స్
డైరెక్టర్ : రాబ్ మార్షల్
లాంగ్వేజ్ : ఇంగ్లిష్, తెలుగు
ప్లాట్ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో
సముద్రపు రాజుకు చాలామంది కూతుళ్లు ఉంటారు. అందులో అందరికంటే చిన్నదైన జలకన్య భూమ్మీదకు వచ్చి మనుషులతో మాట్లాడాలి అనుకుంటుంది. కానీ, ఆమె తండ్రి అందుకు ఒప్పుకోడు. అందుకు కారణం జలకన్య తల్లిని మనుషులు చంపడం అంటాడు. ఎన్నిసార్లు అడిగినా మనుషుల్ని కలిసేందుకు ఒప్పుకోడు. అయితే, జలకన్య తన ఫ్రెండ్స్ అయిన, చేప, కొంగ, పీతలతో కలిసి నీటి పైకి వెళ్తుంది. అక్కడ అనుకోకుండా పడవ ప్రమాదం ఒకటి చూస్తుంది. ఆ ప్రమాదంలో చిక్కుకున్న రాజకుమారుడిని చూసి ఇష్టపడుతుంది. వాళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించిందా? వాళ్ల పెండ్లికి జలకన్య తండ్రి సముద్రపు రాజు ఒప్పుకుంటాడా? వంటి విషయాలు తెలియాలంటే సినిమా పూర్తిగా చూడాల్సిందే. త్రీడీ గ్రాఫిక్స్ బాగున్నాయి. విజువల్స్ కోసం ఈ సినిమా చూడొచ్చు.
స్టూడెంట్స్ లైఫ్
టైటిల్ : బాబా బ్లాక్ షీప్
కాస్ట్ :ఆర్జె విగ్నేష్కాంత్, అమ్ము అభిరామి, అబ్దుల్ అయాజ్, నరేంద్ర
డైరెక్టర్ :రాజమోహన్ ఆర్ముగం
లాంగ్వేజ్ : తమిళం
ప్లాట్ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో
పేరున్న ఎడ్యుకేషనలిస్ట్ రంగరాజన్ (సురేష్ చక్రవర్తి). ఆయన సేలంలో రెండు స్కూల్స్ నడిపిస్తుంటాడు. ఒకటి బాయ్స్ స్కూల్, రెండోది కో– ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్. ఆ రెండు స్కూల్స్ పక్కపక్కనే ఉంటాయి. కాకపోతే వాటిని వేరు చేస్తూ ఒక గోడ అడ్డుగా ఉంటుంది. ఆయన తదనంతరం ఆ స్కూల్‌ని ఆయన కొడుకులు రాజ (సుబ్బు పంచు), రవి (మలర్ కన్నన్) చూసుకుంటుంటారు. ఆ రెండు స్కూల్స్‌కి కలిసి ఒకటే అటెండెన్స్ తీసుకుంటారు. దాంతో రెండు స్కూల్స్‌లో ఉండే ప్లస్ వన్ స్టూడెంట్స్‌కి మధ్య సమస్య ఏర్పడుతుంది. అలా స్కూల్ పిల్లల గొడవతో సరదాగా వెళ్తుంటుంది. అయితే అక్కడున్న స్టూడెంట్స్ చదువు ఒత్తిడి తట్టుకోలేక ఒక్కొక్కరుగా సూసైడ్ చేసుకుంటుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? క్లాస్ రూమ్ గొడవల్ని ఎలా డీల్ చేయాలి? స్టూడెంట్ సూసైడ్స్ జరగకుండా ఎలా ఆపాలి? వంటి విషయాలు బాగా చూపించారు ఈ సినిమాలో. కామెడీతోపాటు మెసేజ్ ఉన్న కథ.
ఉద్యోగం రాక, స్కామ్‌లోకి దిగి..
టైటిల్ : స్కామ్ 2003
కాస్ట్ : గగన్ దేవ్ రియర్, సానా అమిన్, అనిరుద్ధ్ రాయ్, షాద్ రంద్వా, ముఖేశ్ తివారీ, యష్ క్యాటమ్, సత్యం శ్రీవాస్తవ, విశాల్ సి. భరద్వాజ్
డైరెక్టర్ : తుషార్ హీరానందిని
లాంగ్వేజ్ : హిందీ, తెలుగు
ప్లాట్ ఫాం : సోనీ లివ్
వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన సినిమా ఇది. కర్నాటకలోని ఖానాపూర్‌కి చెందిన అబ్దుల్ కరీం తెల్గీ (గగన్ దేవ్ రియార్) గ్రాడ్యుయేట్. పేదరికంలో పుట్టిన అతను కష్టపడి చదువుకుంటాడు. డిగ్రీ చదివినా ఉద్యోగం దొరకదు. దాంతో రైళ్లలో పండ్లు అమ్ముతాడు. అందరితో కలిసిపోయే తత్వం అతనిది. ఒకసారి రైల్లో ప్రయాణిస్తున్న షౌకత్ ఖాన్ అనే అతనికి అబ్దుల్ వ్యక్తిత్వం నచ్చుతుంది. దాంతో తనతో పాటు ముంబయికి వస్తే ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తానని మాట ఇస్తాడు.
తన కష్టాలు తీరాలంటే ముంబై వెళ్లాల్సిందే అని డిసైడ్ అవుతాడు. అందుకు కారణం... డబ్బులు సంపాదించడం కంటే కొట్టేయడం ఈజీ అని నమ్మడమే. అలాగని దొంగతనం చేయడం కాదు. స్కామ్ చేసి సంపాదించొచ్చు అనేది అతని ఆలోచన. అలా ముంబయి వెళ్లిన అబ్దుల్ వేల కోట్ల కుంభకోణం ఎలా చేశాడు? అతనికి సహకరించింది ఎవరు? వంటి విషయాల గురించి తెలుసుకోవాలంటే ‘స్కామ్ 2023’ చూడాల్సిందే.