OTT లో ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాలేవే

OTT లో ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాలేవే

సౌదీ నుంచి వచ్చిన ధనవంతుడు

టైటిల్ : కుయికో ; ప్లాట్​ ఫాం : నెట్​ఫ్లిక్స్​
డైరెక్షన్ : అరుల్ చెజియాన్
కాస్ట్ : యోగి బాబు, విధార్థ్, శ్రీ ప్రియాంక, దుర్గ, ఇళవరసు, వినోదిని వైద్యనాథన్

మలయప్పన్ (యోగిబాబు) పశువులు మేపుతూ సొంతూళ్లో హాయిగా ఉండేవాడు. అతనికి ఉన్నదల్లా ఒక చిన్న ఇల్లు మాత్రమే. అందులోనే తన తల్లితోపాటు ఉండేవాడు. అలాంటి టైంలో అతను ముత్తుమారి (దుర్గ)తో ప్రేమలో పడతాడు. ఆమెతో కలిసి జీవితం పంచుకోవాలి అనుకుంటాడు. కానీ.. మలయప్పన్​కు ఆస్తిపాస్తులు లేకపోవడంతో ముత్తుమారి అన్న తన చెల్లితో పెండ్లి చేయడం కుదరదని తేల్చి చెప్తాడు. 

దాంతో మలయప్పన్​ ఎలాగైనా డబ్బు సంపాదించాలి అనుకుంటాడు. చివరికి డబ్బు కోసం సౌదీ వెళ్తాడు. అలా కొన్నాళ్లు గడిచాక మలయప్పన్​ తల్లి చనిపోతుంది. దాంతో అతను ఇండియాకు వచ్చేవరకు తన తల్లి శవాన్ని ఫ్రీజర్​లో పెట్టి ఉంచమని అదే ఊళ్లో ఉండే షణ్ముగం ( ఇళవరసు)కి చెప్తాడు. 

అదే ఊళ్లో ఉంటున్న తంగరాజ్ (విధార్థ్​) టీచర్​గా పనిచేసేవాడు. కానీ.. ఉద్యోగం పోవడంతో ఏ పని చేయకుండా ఖాళీగా తిరుగుతుంటాడు. అవసరాలు తీర్చుకునేందుకు అప్పుడప్పుడు మేనమామ ముత్తుకుమార్​(పంబజగన్​) దగ్గర డబ్బులు తీసుకుంటుంటాడు. ముత్తుకుమార్​ వడ్డీ వ్యాపారం చేస్తూనే టెంట్ సామాను, ఫ్రీజర్ అద్దెకు ఇస్తుంటాడు. అయితే.. ఒకరోజు తంగరాజ్​ చెన్నయ్​లో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌ చూసేందుకు వెళ్లాలి అనుకుంటాడు. 

అందుకు కావాల్సిన డబ్బు కోసం ముత్తుకుమార్ దగ్గరకు వెళ్తాడు. అదేరోజు మలయప్పన్​ తల్లి చనిపోతుంది. దాంతో.. ముత్తుకుమార్​ ఫ్రీజర్​ బాక్స్​ని మలయప్పన్ ఇంటి దగ్గర పెట్టి, మ్యాచ్​ చూసేందుకు వెళ్లమని తంగరాజ్​​కు చెప్తాడు. ఆ ఫ్రీజర్ మలయప్పన్​, తంగరాజ్​ల జీవితాలను ఎలాంటి మలుపుతిప్పింది? మలయప్పన్​ ఆ ఫ్రీజర్​ని ఏం చేయాలి అనుకున్నాడు? అనేదే సినిమా.

ఫ్రెండ్​ కోసం.. 

టైటిల్ : సోపతులు
ప్లాట్​ ఫాం : ఈటీవి విన్
డైరెక్షన్ : అనంత్ వర్ధన్
కాస్ట్ : భాను ప్రకాశ్, సృజన్ , మణి ఏగుర్ల, అనూష రమేశ్, అంజిమామ

చింటు (మాస్టర్‌ భానుప్రకాశ్‌), గుడ్డు (సృజన్‌) బెస్ట్‌ ఫ్రెండ్స్‌. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఏ విషయంలోనూ తమ మధ్య పోటీ ఉండకూడదు అనుకుంటారు. అలాంటిది కరోనా లాక్​డౌన్​ వల్ల ఇద్దరూ దూరమైపోతారు. పనులు లేక అప్పులు పెరిగి గుడ్డు ఫ్యామిలీ  మహబూబాబాద్‌ నుంచి సొంతూరికి వెళ్లిపోతుంది. గుడ్డు దూరం కావడంతో చింటు ఒంటరైపోతాడు. 

గుడ్డూనే తలుచుకుంటుంటాడు. తన ఫ్రెండ్​ని కలిసేందుకు రకరకాలుగా ట్రై చేస్తుంటాడు. అక్కడ గుడ్డుది కూడా అదే పరిస్థితి. ఫ్రెండ్​ని కలిసేందుకు ప్రయత్నాలు మొదలుపెడతాడు. చివరికి ఇద్దరు కలుసుకున్నారా? లేదా?

ఐల్యాండ్​లో ఆస్తి కోసం..

టైటిల్ : ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్​
ప్లాట్​ ఫాం : హాట్ స్టార్
డైరెక్షన్ : అనీష్ కురువిల్లా
కాస్ట్ : అహుతోష్ రాణా, భానుచందర్, నందు, ప్రియా ఆనంద్, అక్షర గౌడ, సుధ

విశ్వక్సేన్ (అశుతోష్ రాణా) ఒక సైంటిస్ట్​. ప‌దేళ్లుగా ప్రపంచానికి దూరంగా నికోబార్ దీవుల్లోని మోక్ష ఐల్యాండ్​లో ఉంటూ ప్రయోగాలు చేస్తాడు. అలాంటిది అనుకోకుండా ఒక ప్రమాదంలో అతను చనిపోతాడు. అయితే.. ‘విశ్వక్సేన్​ సంపాదించిన వేల కోట్ల రూపాయలు మోక్ష ఐల్యాండ్​లో ఉన్నాయి. అక్కడికి వెళ్లిన వారసులకు ఆ ఆస్తులు ఇమ్మన్నాడనే’ ఉత్తరాలు వాళ్లందరికీ అందుతాయి. 

దాంతో ఆ ఆస్తి కోసం విక్కీ (నందు), ఝాన్సీ(ప్రియా ఆనంద్‌), మున్నా(అజ‌య్ క‌తుర్వార్‌), అదితి (సోనియా అగ‌ర్వాల్‌) కుటుంబాలు వెళ్తాయి. వారం రోజులు ఐల్యాండ్‌లో ఉండి తాము పెట్టిన టెస్ట్‌ల‌కు పాసైన వ్యక్తికే కంపెనీకి సీఈవో అయ్యే అర్హత ఉందని మాయ (అక్షర గౌడ‌) చెప్తుంది. కానీ.. ఆ ఐల్యాండ్​లో అడుగుపెట్టిన విశ్వక్సేన్​ ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. ఆ చావులకు కారణం ఏంటి? నిజంగానే విశ్వక్సేన్​ ఆస్తి కూడబెట్టాడా? అతను ఎలాంటి ప్రయోగాలు చేసేవాడు? అనేది అసలు కథ. 

పనికిరానివాళ్లు

టైటిల్ :  వాజ ; ప్లాట్​ ఫాం : డిస్నీ ప్లస్​ హాట్​స్టార్​
డైరెక్షన్ : ఆనంద్ మేనన్
కాస్ట్ : జగదీష్, కొట్టాయం నజీర్, అజీస్ నెడుమ్నాగడ్, సిజు సన్నీ, అమిత్ మోహన్ రాజేశ్వరి, జోమోన్ జ్యోతిర్, అనురాజ్,  సాఫ్ బ్రోస్

అజో (సిజు సన్నీ), విష్ణు (అమిత్ మోహన్ రాజేశ్వరి), మూసా (జోమన్ జ్యోతిర్), అబ్దుల్ కలాం (అనురాజ్), వివేక్ (సాఫ్ బ్రోస్​) ఒకటో తరగతి నుండి బ్యాక్‌బెంచర్స్​. వాళ్లంతా మంచి ఫ్రెండ్స్ అవుతారు​. స్కూల్​లో ఎక్కడ గొడవ జరిగినా, ఏ సమస్య వచ్చినా దానికి కారణం కచ్చితంగా వీళ్లే అవుతారు. వాళ్లు ఏదో ఒక గొడవ చేయడం సంజాయిషీ ఇచ్చేందుకు ప్రతిరోజూ వాళ్ల పేరెంట్స్​ని స్కూలుకు  పిలవడం మామూలైపోతుంది.

 వాళ్ల తల్లిదండ్రులు మాత్రం పిల్లలు జీవితాల్లో ఏదో ఒకటి సాధించాలని కోరుకుంటారు. వాళ్లు మాత్రం తల్లిదండ్రుల కలలకు చాలా దూరంగా బతుకుతుంటారు. అందుకు అందరూ వాళ్లను వాజాస్ (అరటి చెట్లు అని అర్థం. కానీ.. వాడుకలో పనికిరాని వ్యక్తులను అలా పిలుస్తారు) అని పిలుస్తుంటారు. వాళ్లకు ఇరవై ఏండ్లు వచ్చినా ఏ మాత్రం మార్పు రాకపోయేసరికి ఉద్యోగాలు కూడా రావు. దాంతో నిరంతరం అవమానాలు, తిట్ల వల్ల కలిగే గాయాలతో బాధపడుతుంటారు. ఇంతకీ వాళ్ల సమస్య ఏంటి? వాళ్లు ఎందుకలా ఉండిపోయారు? వాళ్లకు అసలేం కావాలి? 

ఇంటి కోసం తంటాలు

టైటిల్ : జో తేరా హై వో మేరా హై మూవీ 
ప్లాట్​ ఫాం : జియో సినిమా
డైరెక్షన్ : రాజ్ త్రివేది
కాస్ట్ : పరేష్ రావల్, అమిత్ సియాల్, ఫైజల్ మాలిక్

మితేష్ (అమిత్ సియాల్) ముంబయిలో ఉంటాడు. అదే సిటీలో ఉన్న ‘ఉత్సవ్’ అనే అందమైన విల్లాని ఎప్పటికైనా దక్కించుకోవాలి అనేది అతని కోరిక. అతనికి ఆ విల్లా అంటే ఎంత ఇష్టమంటే తన ఫోన్​లో కూడా ఎప్పుడూ ఆ విల్లా ఫొటోలే అటుఇటు తిప్పుతూ చూస్తుంటాడు. ఆ విల్లా యజమాని గోవింద (పరేష్ రావల్). అందులో ఒక్కడే ఉంటాడు. కానీ.. దాన్ని అమ్మేందుకు ఇష్టపడడు. ఆ ఇంటికి చాలా డిమాండ్​ ఉంటుంది. 

అందుకే రియల్​ఎస్టేట్​ బ్రోకర్లు పదే పదే అతని దగ్గరికి వెళ్లి విల్లా అమ్మమని అడుగుతారు. కానీ.. అతను మాత్రం ఒప్పుకోడు. అందుకే మితేష్​ ఆ ఇంటి విషయంలో గోవిందాని ఒప్పించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆ ప్రయత్నాలు చూసేవాళ్లకు నవ్వు తెప్పిస్తాయి. చివరకు మితేష్​ ఇంటిని దక్కించుకున్నాడా? లేదా?

కొండమీద డాక్టరమ్మ

టైటిల్ : నాడు
ప్లాట్​ ఫాం : అమెజాన్ ప్రైమ్‌ వీడియో
డైరెక్షన్ : ఎమ్. శరవణనన్
కాస్ట్ : దర్శన్, మహిమ నంబియార్, ఆర్.ఎస్ శివాజీ, సింగంపులి, ఇంబా రవికుమార్, వసంత

దట్టమైన అటవీ ప్రాంతంలోని ఒక కొండ మీద చిన్న ఊరు ఉంటుంది. అక్కడికి బస్సు సౌకర్యం కూడా సరిగ్గా ఉండదు. ఒకే ఒక్క బస్సు వెళ్తుంది ఆ ఊరికి. సమీపంలో ఊళ్లు కూడా ఉండవు. విసిరేసినట్టుగా ఉంటుంది ఆ కొండమీది ఊరు. ఆ ఊళ్లో హాస్పిటల్​ ఉంటుంది. కానీ అక్కడ పనిచేసేందుకు డాక్టర్లు ఇష్టపడరు. ఎవరో ఒక డాక్టరు పనిచేసేందుకు అక్కడికి వచ్చినా సౌకర్యాలు సరిగ్గా లేక ఒకట్రెండు వారాల్లో ట్రాన్స్​ఫర్​ చేయించుకుని వెళ్లిపోతుంటారు. దాంతో డాక్టర్​ లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంటారు. 

ఆ ఊళ్లో ఉండే  మారి(దర్శన్) చెల్లి ఆత్మహత్యాయత్నం చేస్తుంది. ఆమెని హాస్పిటల్​కి తీసుకెళ్లేలోపే చనిపోతుంది. ‘కొంచెం ముందు తీసుకొస్తే కాపాడేవాడ్ని’ అంటాడు డాక్టర్. దాంతో బస్సు సౌకర్యం, వైద్య సదుపాయం లేకపోవడం వల్లనే ఆమె చనిపోయిందని వాళ్ల ఊరికి వచ్చిన బస్సుని కదలనీయకుండా చేసి నిరసన తెలుపుతారు. దాంతో స్వయంగా కలెక్టర్​ అక్కడికి వెళ్తాడు. ‘‘మీ ఊరికి డాక్టర్​ని పంపిస్తా. అయితే డాక్టర్ మీ ఊళ్లో ఉండేలా చూసుకునే బాధ్యత మాత్రం మీదేన’’ని చెప్తాడు. కొన్ని రోజులకి ఆ ఊరికి ఒక లేడీ డాక్టర్ (మహిమ నంబియార్) వస్తుంది. 

అతి కష్టం మీద వారం రోజులు ఉండడానికి ఒప్పుకుంటుంది. కానీ.. ఆమెని ఇంప్రెస్​ చేసి అక్కడే ఉండేలా చేయాలనేది ఆ ఊరివాళ్ల ప్లాన్​. అందుకే డాక్టర్​ని జాగ్రత్తగా చూసుకుంటుంటారు. ఆమెకు కాపలాగా ఉంటూ ఇష్టమైన వాటిని తెచ్చి పెడుతుంటారు. అంత కష్టపడ్డందుకు వాళ్ల ప్లాన్​ వర్కవుట్​ అయ్యిందా? లేదా? డాక్టర్​ని సంతోషపెట్టేందుకు వాళ్లు ఎలాంటి కష్టాలు పడ్డారు?