డేంజర్ గేమ్‌ని సియాంగ్ ఆపగలిగాడా?
టైటిల్ : స్విడ్ గేమ్ సీజన్ 2
డైరెక్షన్ : హ్వాంగ్ డాంగ్ హ్యూక్
కాస్ట్ : లీ జంగ్ జే, వి –హ జున్, లీ బ్యుంగ్ హూన్
ప్లాట్‌ఫాం : నెట్‌ఫ్లిక్స్
అప్పులపాలై జీవితం మీద విరక్తి చెందిన స్థితిలో ఉన్న వ్యక్తులను ఎంచుకుని వాళ్లను ఒక దీవికి తీసుకెళ్తారు కొందరు ధనవంతులు. పిల్లలు ఆడుకునే ఆటల పేరుతో వాళ్లతో ప్రమాదకరమైన గేమ్స్ ఆడిస్తుంటారు. ఆ ఆటల్లో ఓడిన వాళ్ల ప్రాణాలు తీసి.. మానసిక ఆనందం పొందుతుంటారు. 600 మందితో మొదలుపెట్టిన ఆ గేమ్స్‌లో ఒక్కరు మాత్రమే మిగులుతారు. అతనే సియాంగ్ జి హున్ లీ (లీ జంగ్జే). గేమ్ రూల్స్ ప్రకారమే అతడికి కొన్ని కోట్ల రూపాయలు ప్రైజ్‌మనీ ఇస్తారు.
కానీ అతను డబ్బు తీసుకొని వెళ్లిపోకుండా, ఆ డేంజర్ గేమ్‌ను ఆపేయాలని కోరతాడు. అతని మాట వాళ్లు వినకపోవడంతో ఎలాగైనా సరే దాన్ని ఆపేయాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత అతనేం చేశాడు? గేమ్ ఆడించేవాళ్లకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనేది తెలియాలంటే సిరీస్ చూడాలి. ‘స్క్విడ్ గేమ్’ మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. దానికి సీక్వెల్ అంటే కచ్చితంగా అంచనాలు పెరుగుతాయి. కానీ, రెండో భాగం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. బోర్ కొట్టదు.. కానీ, ఊహించినంత థ్రిల్లింగ్‌గా అయితే ఉండదు.
హంతకుడెవరు?
టైటిల్ : సొర్గవాసల్
డైరెక్షన్ : సిద్ధార్థ్ విశ్వనాథ్
కాస్ట్ : ఆర్జే బాలాజీ, సెల్వరాఘవన్, కరుణాస్, నట్టి సుబ్రమణియన్, సానియా అయ్యప్పన్, షరాఫ్ యు ధీన్, బాలాజీ శక్తివేల్, హక్కిమ్ షా
ప్లాట్‌ఫాం : నెట్‌ఫ్లిక్స్
తమిళనాడులో జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. జైలు చుట్టూ తిరిగే ఈ కథ కంటెంట్ పరంగా మెప్పిస్తుంది. కథలోకి వెళ్తే.. పార్థిబన్ (ఆర్జే బాలాజీ) రోడ్డు పక్కన ఒక ఫుడ్ స్టాల్ పెట్టుకుని జీవనం సాగిస్తుంటాడు. ఓ ఐఏఎస్ ఆఫీసర్ పార్థి షాప్‌కి రెగ్యులర్ కస్టమర్. ఒకానొక సమయంలో ఆ అధికారి హత్య జరుగుతుంది. దీంతో పార్థినే అతన్ని చంపాడని భావించిన పోలీసులు అతన్ని జైల్లో వేస్తారు. కట్ చేస్తే..
జైల్లో రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలు జరుగుతుంటాయి. ఆ గొడవలకు ఇతనికి సంబంధం ఏంటి? అసలు ఆ ఐఏఎస్ అధికారిని ఎవరు చంపారు? హీరోను కావాలని జైలుకు పంపించిందెవరు? జైలు నుంచి బయటకు వచ్చాడా? లేదా అనేది తెలియాలంటే సొర్గవాసల్ సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో ఆర్జే బాలాజీ కథానాయకుడిగా తన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. సెల్వ రాఘవన్, నజరాజ సుబ్రమణియన్ నటన బాగుంది. సర్వైవల్ థ్రిల్లర్ జానర్లో సాగే ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది.
థ్రిల్ చేసే మెడికల్ డ్రామా
టైటిల్ : డాక్టర్స్
డైరెక్షన్ : సాహిర్ రజా
కాస్ట్ : శరద్ కేల్కర్, హర్లీన్ సేథీ, విరాఫ్ పటేల్, అమీర్ అలీ, వివాన్ షా
ప్లాట్‌ఫాం : జియో సినిమా
ముంబయిలోని ఎలిజబెత్ బ్లాక్‌వెల్ మెడికల్ సెంటర్‌లో కొత్తగా వచ్చిన డాక్టర్ నిత్యా వాసు (హర్లీన్ సేథీ) చుట్టూ కథ తిరుగుతుంది. ఆమెకు తన మాజీ గురువు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ ఇషాన్ అహుజా (శరద్ కేల్కర్) అంటే నచ్చదు. ఆమె సోదరుడు ధవల్ (అమీర్ అలీ) కెరీర్ నాశనం కావడానికి కారణం ఇషాన్ అని, అతనిపై పగ పెంచుకుంటుంది. కానీ, ఆ తర్వాత ఇషాన్ తాను అనుకున్నట్టు చెడ్డవాడు కాదని నిత్య తెలుసుకుంటుంది.
దీంతో ఆమె ఇషాన్‌తో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత ఏమైంది? ఇషాన్ మంచివాడని నమ్మడానికి ఎలాంటి పరిస్థితులు కారణమయ్యాయి? వంటి విషయాలతోపాటు డాక్టర్ల పనితీరు, హాస్పిటల్ వాతావరణం, అక్కడ ఎదురయ్యే సవాళ్లు, వాటిని అధిగమించే క్రమంలో డాక్టర్లు పడే శ్రమ, ఒత్తిడి, తోటివాళ్లను మోటివేట్ చేసే విధానం, సహనం వంటి ఎమోషన్స్ అన్నీ కనిపిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే డాక్టర్ల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఈ సిరీస్ చూస్తే అర్థమైపోతుంది. ఇందులో శరద్ నటన, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ బాగున్నాయి.