స్ట్రీమ్ ఎంగేజ్ : ఈ వారం OTT లో వచ్చిన మూవీస్ ఇవే

స్ట్రీమ్ ఎంగేజ్ : ఈ వారం OTT లో వచ్చిన మూవీస్ ఇవే

విజిలెన్స్​ ఆఫీసర్​గా.. 

టైటిల్ : డిస్పాచ్​ 
ప్లాట్​ ఫాం : జీ5, 
డైరెక్షన్ : కను బెల్,
కాస్ట్ : మనోజ్ బాజ్‌‌పెయ్​, షహానా గోస్వామి, రితుపర్ణ సేన్, పార్వతి సెహగల్, మామిక్ సింగ్, నిఖిల్ విజయ్

ప్రపంచం అంతా ‘డిజిటల్’ వైపు అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ప్రింట్​ మీడియా స్థానంలోకి డిజిటల్​ మీడియా వచ్చేస్తోంది. అలాంటి పరిస్థితుల్లో మధ్య వయస్కుడైన జాయ్ (మనోజ్ బాజ్‌‌పెయ్)  ప్రింట్​ మీడియాలో పనిచేస్తుంటాడు. క్రైమ్​ జర్నలిస్ట్‌‌గా మంచి పేరు తెచ్చుకున్న జాయ్​ని సెన్సేషనల్​ వార్తలు తీసుకురావడంలేదని మేనేజ్​మెంట్​ ఒత్తిడి పెడుతుంటుంది. 

అందుకే ఫస్ట్​ పేజీ బ్రేకింగ్ స్టోరీ కోసం విపరీతంగా వెతుకుతూ ఉంటాడు. మరో వైపు తన భార్య శ్వేత (షహానా గోస్వామి)ని ఇష్టం లేని పెండ్లి చేసుకుంటాడు. ఆమెతో సంతోషంగా గడిపిన క్షణాలు చాలా తక్కువ. పైగా తన జూనియర్ వర్ష (పార్వతి సెహగల్)తో రిలేషన్​లో ఉంటాడు జాయ్​. అతనికి ఒకరోజు తన ఇన్​ఫార్మర్​ ద్వారా ఒకచోట స్మగ్లింగ్​ జరుగుతోందని ఇన్ఫర్మేషన్​ వస్తుంది. జాయ్​ దాన్ని బయటపెట్టేందుకు వెళ్తాడు. అక్కడివాళ్లను నమ్మించేందుకు జాయ్ విజిలెన్స్ ఆఫీసర్‌‌గా మారువేషంలో వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అతనికి బ్రేకింగ్​ న్యూస్​ దొరికిందా? లేదా? తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. 

ఛాయ ఏమైంది? 

టైటిల్ : బోగెన్‌‌విల్లా, 
ప్లాట్​ ఫాం : సోనీ లివ్​
డైరెక్షన్ : అమల్ నీరద్, కాస్ట్ : జ్యోతిర్మయి, కుంచకో బోబన్, ఫహద్ ఫాజిల్, షరాఫుద్దీన్, అతీరా పటేల్

డాక్టర్ రాయిస్ థామస్ (కుంచకో బోబన్), రీతు (జ్యోతిర్మయి) భార్యాభర్తలు. వాళ్లు కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ అవుతుంది. దాంతో రీతు గతం మర్చిపోతుంది. పిల్లలను స్కూల్‌‌కు పంపడం.. తర్వాత ఇంట్లోనే కాలక్షేపం చేయడం ఆమె డైలీ రొటీన్. బొమ్మలు కూడా వేస్తుంటుంది. అలాంటి రీతు జీవితంలో ఒక అనుకోని సంఘటన ఎదురవుతుంది. ఏసీపీ డేవిడ్ కోషి (ఫహాద్ ఫాజిల్) ఒక  మిస్సింగ్​ కేసులో రీతూని అనుమానిస్తాడు.

 తమిళనాడుకు చెందిన ఒక మినిస్టర్ కూతురు ఛాయా కార్తికేయన్ (అతీరా పటేల్) హాస్టల్​ నుంచి కనిపించకుండా పోతుంది. అక్కడి సీసీ టీవీ ఫుటేజీ పరిశీలిస్తే.. ఛాయను రీతు ఫాలో అవుతున్న వీడియో దొరుకుతుంది. అందుకే రీతును డేవిడ్ కోషి ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఇంతకీ రీతూకి ఛాయతో ఉన్న సంబంధం ఏంటి? ఆమె ఛాయని ఎందుకు ఫాలో అయ్యింది? ఇన్వెస్టిగేషన్‌‌లో డేవిడ్ ఏం తెలుసుకున్నాడు? ఛాయ ఎలా మాయమైంది? తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. 

ఆత్మ ఎవరిది? 

టైటిల్ : 7/జి,  
ప్లాట్​ ఫాం : ఆహా, 
డైరెక్షన్ :  హరూన్ రషీద్, 
కాస్ట్ : రోషన్ బషీర్, స్మ్రుతి వెంకట్, సోనియా అగర్వాల్, సిద్ధార్థ్ విపిన్, సుబ్రమణ్య శివ

రాజీవ్ ( రోషన్ బషీర్) వర్ష ( స్మృతి వెంకట్) భార్యాభర్తలు. చాలా రోజులు అద్దె ఇంట్లో ఉండి చివరకు ఒక అపార్టుమెంటులో ఫ్లాట్ కొంటారు. చాలా సంతోషంగా ఆ ఇంట్లోకి వెళ్తారు. అక్కడికి వెళ్లగానే రాజీవ్​కి ప్రమోషన్ వస్తుంది. దాంతో చాలా సంతోషిస్తారు. తర్వాత రాజీవ్​ ఆఫీసు పని మీద బెంగళూరు వెళ్తాడు. వర్ష తన కొడుకు రాహుల్​తో కలిసి ఫ్లాట్​లో ఉంటుంది. 

రాజీవ్​ వెళ్లిపోయినప్పటి నుంచి రాత్రిళ్లు వింత వింత శబ్దాలు వినిపిస్తుంటాయి. ఏవేవో ఆకారాలు కనిపిస్తుంటాయి. దాంతో వర్ష చాలా భయపడుతుంది. దాంతో తన ఫ్రెండ్​ని పిలిచి విషయం చెప్తుంది. ఆమె వర్షని క్షుద్ర పూజలు చేసేవాళ్లను కలవమని సలహా ఇస్తుంది. ఆ తర్వాత ఏ జరిగింది? ఆ ఇంట్లో ఉన్న ఆత్మ ఎవరిది? తెలియాలంటే సినిమా చూడాలి.