
ఓ తాగుబోతు కథ!
టైటిల్ : బాటిల్ రాధ
ప్లాట్ ఫాం : ఆహా తమిళ్
డైరెక్షన్ : దినకరన్ శివలింగం
కాస్ట్ : గురు సోమసుందరం, సంజనా నటరాజన్, జాన్ విజయ్, లొల్లు సబామారన్
చెన్నైకి చెందిన రాధా మణి (గురు సోమసుందరం).. అలియాస్ పాతాళ్ రాధా టైల్స్ వేసే కార్మికుడు. అతని భార్య అంజలం (సంజ న నటరాజన్), కూతురు, కొడుకుతో కలిసి చిన్న ఇంట్లో ఉంటాడు. రాధకు మందు తాగే అలవాటు ఉంటుంది. అది కొన్నాళ్లకు వ్యసనంగా మారుతుంది. అప్పటినుంచి భార్య, పిల్లలను పట్టించుకోవడం మానేస్తాడు. దాంతో వాళ్ల కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
రాధ పని చేసే ప్లేస్‌లో.. రోడ్డు మీద.. ఎక్కడపడితే అక్కడే తాగి పరువు తీసుకునేవాడు. అదంతా చూసి అసహనానికి గురైన అతని భార్య, రాధని అశోకన్ (జాన్ విజయ్) నడుపుతున్న రీహాబిలిటేషన్ సెంటర్‌కి పంపుతుంది. రాధ అక్కడ ఉండలేక కొంతమంది స్నేహితులతో కలిసి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మందు తాగడం మానేశాడా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాలి.
కిడ్నాపర్ రాబిన్ హుడ్
టైటిల్ : క్రైమ్ బీట్
ప్లాట్ ఫాం : జీ5
డైరెక్షన్ : సుధీర్ మిషార్, సంజీవ్ కౌల్
కాస్ట్ : సాకిబ్ సలీమ్, సబా ఆజాద్, సాయి తంహంకర్, రాహుల్ భట్, ఆదియంత్ కొఠారే, డానిష్ హుస్సేన్, రాజేష్ తైలాంగ్
తను పెద్ద క్రైమ్ రిపోర్టర్ కావాలని కలలు కంటుంటాడు అభిషేక్ (సాకిబ్ సలీమ్). అలా ఇంగ్లీష్ పేపర్ ఎక్స్‌ప్రెస్‌లో చేరతాడు. దాని చీఫ్ ఎడిటర్ అమీర్ (డానిష్ హుస్సేన్) కూడా అభిషేక్ బాగా పనిచేయగలడని నమ్మి క్రైమ్ వార్తలు రాసే పనిని అప్పగిస్తాడు. అభిషేక్‌కి అనుభవజ్ఞుడైన ఫొటోగ్రాఫర్ పశుపతి (కిషోర్ కదమ్) కూడా సాయం చేస్తుంటాడు. అభిషేక్ తను రాసిన వార్తలు మొదటి పేజీలో రావాలని చాలా కష్టపడుతుంటాడు.
అప్పుడే అభిషేక్ కిడ్నాపర్ బిన్నీ చౌదరి (రాహుల్ భట్), అతని సహచరురాలు అర్చన (సాయి తమహంకర్) మీద రీసెర్చ్ చేయడం మొదలుపెడతాడు. బిన్నీ చౌదరి కిడ్నాప్‌లు చేయడంతో పాటు హవాలా వ్యాపారం కూడా నడుపుతుంటాడు. వాటివల్ల సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని పేదల కోసం ఖర్చు చేస్తుంటాడు. అభిషేక్‌తో పాటు మంత్రి రావత్ (విపిన్ శర్మ) కూడా బిన్నీ గురించి వెతుకుతుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది. అభిషేక్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.
ట్రయాంగిల్ లవ్‌స్టోరీ
టైటిల్ : సమ్మేళనం
ప్లాట్ ఫాం : ఈటీవీ విన్
డైరెక్షన్ : తరుణ్ మహాదేవ్
కాస్ట్ : ప్రియా వడ్లమాని, గణాదిత్య, బిందు నూతక్కి, శ్రీకాంత్ గుర్రం, విజ్ఞయ్ అభిషేక్, శ్రీకాంత్ యాచమనేని, జీవన్ ప్రియా రెడ్డి
రామ్ (గణాదిత్య) ఒక రైటర్. అతను రాసిన ఒక పుస్తకానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. దాంతో.. అతనితో పాటు బుక్ గురించి న్యూస్పేపర్లో ఫ్రంట్ పేజీల్లో వార్తలు వస్తాయి. అవి చూసి అతడిని వెతుకుతూ శ్రేయ (బిందు నూతక్కి), రాహుల్ (శ్రీకాంత్ యాచమనేని), అర్జున్ (విజ్ఞయ్ అభిషేక్), మేఘన (ప్రియా వడ్లమాని) బయల్దేరుతారు. అర్జున్, రామ్ చిన్నప్పటి ఫ్రెండ్స్. రైటర్ కావాలనేది రామ్ లక్ష్యం. అందుకు అర్జున్ చాలా సపోర్ట్ చేస్తాడు. అలాంటి వాళ్లు ఎందుకు దూరమయ్యారు? మళ్లీ ఎలా కలిశారు? అనేది మిగతా కథ.