టైటిల్ : ది రైల్వేమెన్
ప్లాట్ ఫాం : నెట్‌ఫ్లిక్స్
డైరెక్షన్ : శివ్ రావైల్
కాస్ట్ : కేకే మేనన్, మాధవన్, బాబిల్‌ఖాన్, సున్నీ హిందూజా, దివ్యేందు భట్టాచార్య, జుహీచావ్లా, మందిరాబేడి
రియల్ స్టోరీలని స్క్రీన్ మీద చూడడాన్ని ఆడియన్స్ ఎక్కువ ఇష్టపడుతుంటారు. అందుకే రియల్ స్టోరీలు, బయోపిక్స్ ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి. ‘ది రైల్వేమెన్’ కూడా అలాంటిదే. భోపాల్ గ్యాస్ దుర్ఘటన నాటి పరిస్థితులను ఆధారంగా చేసుకుని ఈ వెబ్‌సిరీస్ తెరకి ఎక్కించారు. ఇదివరకే ఓటీటీలోకి వచ్చింది ఇది. కానీ.. ఈ మధ్యే దీనికి స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ అవార్డ్స్‌లో ‘ఉత్తమ డైలాగ్ అవార్డ్’ దక్కించుకుంది. ఇఫ్తికార్ సిద్ధిఖీ (కేకే మేనన్) భోపాల్ రైల్వే స్టేషన్‌లో స్టేషన్ మాస్టర్‌గా పనిచేస్తుంటాడు. ఆయనకు చాలా మంచివాడు, మనసున్న మనిషి అనే పేరు. అందుకే ఆయన్ని ఆ స్టేషన్‌లో పనిచేసే ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు. ఎవరికి ఆపద వచ్చినా ముందుకొచ్చి ఆదుకోవడం అతని నైజం. అదే సిటీలో యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నడుస్తుంటుంది. విదేశీ కంపెనీ నడుపుతున్న ఆ ఫ్యాక్టరీలో సేఫ్టీ విషయంలో కనీస జాగ్రత్తలు కూడా తీసుకోరు. ఫ్యాక్టరీలోని లోపాలను వర్కర్లు ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం ఉండదు. ఆ ఫ్యాక్టరీకి దగ్గరలో ఉన్న ఒక బస్తీలో ఇమద్ (బాబిల్ ఖాన్) నివాసం ఉంటాడు. ఇమద్ కూడా కొన్ని రోజులపాటు ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు.
కానీ.. తనతో పాటు పనిచేసే ఒక ఫ్రెండ్ చనిపోవడంతో అక్కడ ఉండలేక ఉద్యోగం వదిలేస్తాడు. తర్వాత రైల్వేకోచ్ ఫ్యాక్టరీలో వర్కర్‌గా చేరతాడు. అంతేకాదు.. ఇమద్ యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో లోపాలు ఉన్నాయనే విషయాన్ని రిపోర్టర్ (సన్నీ హిందూజ)కు చెప్తాడు. దాంతో అతను తగిన ఆధారాల కోసం ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే టైంలో ఒక రోజు రాత్రి ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్ అవుతుంది. ఆ గ్యాస్ మెల్లిగా ఫ్యాక్టరీ పరిసరాలను దాటి భోపాల్ మొత్తం వ్యాపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అక్కడివాళ్లు ఆ గ్యాస్ వల్ల ఎలా బలైపోయారు? రైల్వేస్టేషన్‌లో ఉన్న ప్రయాణికులను కాపాడేందుకు ఇఫ్తికార్ సిద్ధిఖీ, ఇమద్‌లు ఏం చేశారు? విషయం తెలిసిన సెంట్రల్ రైల్వేస్ జీఎం రతి పాండే (మాధవన్) ఎలా రెస్పాండ్ అయ్యాడు? తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాలి.
సీరియల్ టు ఆర్‌ఆర్‌ఆర్
టైటిల్ : మోడర్న్ మాస్టర్స్ : ఎస్ఎస్ రాజమౌళి
ప్లాట్ ఫాం : నెట్‌ఫ్లిక్స్
డైరెక్షన్ : రాఘవ ఖన్నా, తన్వి అజింక్యా
కాస్ట్ : ఎస్.ఎస్. రాజమౌళి, రమా రాజమౌళి, జేమ్స్ కామెరూన్, జో రస్సో, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ఎం.ఎం. కీరవాణి, వి. విజయేంద్ర ప్రసాద్, కరణ్ జోహార్
తెలుగు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి లైఫ్ మీద తీసిన డాక్యుమెంటరీ ఇది. ‘నేను నా కథకు బానిసను. నా ఆడియన్స్ విషయంలో అత్యాశపరుణ్ణి...’ అంటూ తన మనసులోని ఎన్నో మాటలను ఇందులో చెప్పాడు రాజమౌళి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ రాజమౌళి గురించి తెలియని వాళ్లే ఉండరు.
అంతెందుకు ఆయన పేరు ఇప్పుడు బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌కి కూడా పరిచయం అయ్యింది. అంతలా పేరు ప్రఖ్యాతులు పొందిన రాజమౌళి ఒక సీరియల్ డైరెక్టర్‌గా జీవితాన్ని మొదలుపెట్టి.. ఈ స్థాయి వరకు ఎలా ఎదిగాడు? అందుకోసం ఆయన ఎంతలా కష్టపడ్డాడు? వంటి ఎన్నో విషయాలు ఈ డాక్యుమెంటరీ ద్వారా తెలుసుకోవచ్చు. ‘స్టూడెంట్ నెం.1’ నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా వరకు చేసిన ప్రయాణం... ఆయనతో పనిచేసిన యాక్టర్స్, ప్రముఖుల అభిప్రాయాలు ఇందులో ఉన్నాయి. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, రానా, కీరవాణిలు... రాజమౌళితో తమ అనుబంధాన్ని ఇందులో పంచుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా తమ ఎక్స్‌పీరియెన్స్ చెప్పారు.
కొడుకు చనిపోయాడు..కోడలు ప్రెగ్నెంట్!
టైటిల్ : ఉల్లోరుక్కు(అండర్ కరెంట్)
ప్లాట్ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో
డైరెక్షన్ : క్రిస్టో టామీ
కాస్ట్ : ఊర్వశి, పార్వతి తిరువోతు, ప్రశాంత్ మురళి, అర్జున్ రాధాకృష్ణన్
అంజు(పార్వతి తిరువోతు) ఒక బట్టల షాప్‌లో పనిచేస్తుంటుంది. తనతోపాటే పనిచేసే రాజీవ్(అర్జున్ రాధాకృష్ణన్)ని ప్రేమిస్తుంది. కానీ.. అంజు తండ్రి అంతగా సంపాదన లేని రాజీవ్‌ని తనకు అల్లుడిగా అంగీకరించడు. దాంతో థామస్(ప్రశాంత్ మురళి)కి ఇచ్చి పెండ్లి చేస్తారు. దాంతో మనసు చంపుకుని అత్తారింటికి వెళ్తుంది. కానీ.. కొన్నాళ్లకు అడ్జెస్ట్ అయ్యి భర్తతో భాగానే ఉంటుంది. అంతా బాగానే ఉందనుకునేలోపే థామస్ ఆరోగ్యం క్షీణిస్తుంది. దాంతో అత్త లీలమ్మ(ఊర్వశి)తోపాటు అంజు కూడా థామస్‌కి సేవలు చేస్తుంటుంది. లీలమ్మ చిన్నప్పటినుంచి డాక్టర్ కావాలని కలలు కనేది. కానీ.. 19 ఏండ్ల వయసులో పెద్దలు పెండ్లి చేస్తారు. ఆ వెంటనే ఇద్దరు పిల్లలు పుడతారు.
అంతా సంతోషంగా ఉందనుకునే టైంలో లీలమ్మ భర్త చనిపోతాడు. దాంతో కన్నీళ్లతో కాలం వెళ్లదీస్తుంది. ఎలాగోలా పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంది. కొడుకు థామస్ పెండ్లితో పరిస్థితులు సర్దుకుంటాయి అనుకునేలోపే అతను ట్యూమర్ బారిన పడడంతో మళ్లీ కష్టాలు మొదలవుతాయి. ఇలాంటి టైంలో అంజు అనుకోకుండా హాస్పిటల్లో మళ్లీ రాజీవ్‌ని కలుస్తుంది. అప్పటినుంచి ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటారు. మళ్లీ ప్రేమ చిగురిస్తుంది. అతనివల్ల ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది. అయితే.. తన కొడుకు వల్లే అంజు ప్రెగ్నెంట్అయ్యింది అనుకుని లీలమ్మ ఆ విషయాన్ని అందరికీ చెప్తుంది. ఆ విషయాన్ని థామస్ చెప్పేలోపే అతను హాస్పిటల్లో చనిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? నిజం తెలిశాక లీలమ్మ ఎలా రియాక్ట్ అయ్యింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నార్త్ వర్సెస్ సౌత్
టైటిల్ : రైల్
ప్లాట్ ఫాం : ఆహా తమిళం
డైరెక్షన్ : భాస్కర్ శక్తి
కాస్ట్ : కుంగుమరాజ్ ముత్తుసామి, పర్వైజ్ మెహ్రు, రమేష్ వైద్య, వైరమల, సెంథిల్ కొచ్చాడై
ముత్తయ్య (కుంగుమరాజ్ ముత్తుసామి) మధురైకి దగ్గర్లోని ఒక చిన్న ఊళ్లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుంటాడు. అతని ఫ్రెండ్ వరదన్ (రమేష్ వైద్య)తో కలిసి రోజూ మందుతాగుతాడు. రోజూ ఖాళీ చేతులతో ఇంటికి వస్తున్న ముత్తయ్యని చూసి భార్య చెల్లమ్మ (వైరమల) తిడుతుంటుంది. సంపాదించిన డబ్బంతా తాగడానికే ఖర్చు చేస్తాడు ముత్తయ్య. అందుకే వాళ్ల ఇంట్లో ఒక చిన్న భాగాన్ని నార్త్ ఇండియాకు చెందిన సునీల్ అనే వ్యక్తికి అద్దెకు ఇస్తుంది చెల్లమ్మ. సునీల్ ఆమెని ‘చెల్లి’ అని ఆప్యాయంగా పిలుస్తుంటాడు.
అతను చాలా మంచివాడు. కష్టపడి పనిచేస్తుంటాడు. అయితే.. వలసదారుల వల్లే లోకల్ వాళ్లకు పనులు సరిగ్గా దొరకడం లేదని.. తన కష్టాలకు వాళ్లే కారణమని ముత్తయ్య అనుకుంటాడు. అందుకే సునీల్ అంటే ఇష్టం ఉండదు ముత్తయ్యకు. సరిగ్గా అదే టైంలో సునీల్ బైక్ యాక్సిడెంట్లో చనిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది?
సైకో కిల్లర్
టైటిల్ : రక్షణ
ప్లాట్ ఫాం : ఆహా, డైరెక్షన్ : ప్రణదీప్ ఠాకోర్
కాస్ట్ : పాయల్ రాజ్‌పుత్, రోషన్, మానస్, రాజీవ్ కనకాల, వినోద్ బాల, శివన్నారాయణ
ఏసీపీ కిరణ్ (పాయల్ రాజ్‌పుత్) ఒక పవర్‌ఫుల్ పోలీసాఫీసర్. నిజాయితీ పరురాలు. తన దగ్గరకు వచ్చిన బాధితులకు అండగా నిలబడుతుంది. హైదరాబాద్‌లో వరుసగా అమ్మాయిలు చనిపోతుంటారు. అవి హత్యలా? ఆత్మహత్యలా? అని తేల్చేందుకు ఆ కేసును కిరణ్‌కు అప్పగిస్తారు. కిరణ్ కేసును చేపట్టాక మరో అమ్మాయి చనిపోతుంది. ఇన్వెస్టిగేషన్ చేసిన కిరణ్ అవి కచ్చితంగా హత్యలే అని తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఒక రోజు.. ఒక అమ్మాయి సమస్యలో ఉందని తెలిసి, ఆమె దగ్గరకు వెళ్లి ఆరా తీస్తుంది.
ప్రేమించాలంటూ అరుణ్ (మానస్) వేధిస్తున్నాడని చెప్తుందామె. దాంతో.. అరుణ్‌కు వార్నింగ్ ఇస్తుంది. అప్పటినుంచి అరుణ్ కోపంతో రగిలిపోతాడు. కిరణ్ కెరీర్‌ను నాశనం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెడతాడు. మరోవైపు హత్యలు చేస్తున్న హంతకుడిని పట్టుకునే పనిలో ఉంటుంది కిరణ్. అదే టైంలో అరుణ్ చనిపోతాడు. కిరణ్ కూడా అదే ప్లేస్‌లో ఉంటుంది. దాంతో అరుణ్ తండ్రి ఆమెపై కేసు పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? కిరణ్ సైకో కిల్లర్‌ని పట్టుకుందా? అరుణ్ హత్యకు, కిల్లర్‌కు సంబంధం ఏంటి? అనేది స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాలి.
16 హత్యలు
టైటిల్ : బృంద, ప్లాట్ ఫాం : సోనీలివ్
డైరెక్షన్ : సూర్య మనోజ్ వంగల
కాస్ట్ : త్రిష, ఇంద్రజిత్ సుకుమారన్, జయప్రకాశ్, ఆమని, రవీంద్ర విజయ్, ఆనంద్‌సామి, రాకేందుమౌళి
బృంద (త్రిష) ఒక పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా చేరుతుంది. మహిళ కావడంతో తోటి పోలీసులు ఆమెకు ఇంపార్టెన్స్ ఇవ్వరు. పైగా ఆమె పనితీరు మీద అక్కడి సీఐతో సహా ఎవ్వరికీ నమ్మకం ఉండదు. అయినా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంటుంది. అలాంటి టైంలో ఆ ఊరి చెరువులో ఒక గుర్తు తెలియని శవం దొరుకుతుంది. ఒక వ్యక్తికి గుండు కొట్టి, గుండెలో16సార్లు కత్తితో పొడిచి చెరువులో విసిరేసినట్టు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తెలుస్తుంది. అయినా.. పై అధికారులు ఆ కేసును క్లోజ్ చేయాలని చెప్తారు.
కానీ.. బృంద పట్టువదలకుండా ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెడుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్లో ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. హత్యకు గురైంది ఒక్కరు కాదని, మొత్తం16మందిని దారుణంగా చంపారనే ట్విస్ట్ రివీల్ అవుతుంది. దాంతో... పోలీస్ ఉన్నతాధికారులు స్పెషల్ ఎంక్వైరీ టీం ఏర్పాటు చేస్తారు. అందులో బృంద కూడా ఉంటుంది. ఆ టీం సాయంతో బృంద ఆ సీరియల్ కిల్లర్‌ని ఎలా పట్టుకుందనేదే అసలు కథ.