స్ట్రీమ్ ఎంగేజ్ : ఈ వారం OTT లో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే

స్ట్రీమ్ ఎంగేజ్ : ఈ వారం OTT లో రిలీజ్ కానున్న  సినిమాలు ఇవే

మోపెడ్​ పోయింది!

టైటిల్ : పారాచూట్, ప్లాట్​ ఫాం : డిస్నీ ప్లస్​ హాట్​స్టార్,​ డైరెక్షన్ : రాసు రంజిత్, కాస్ట్ :  శక్తి రిత్విక్, ఇయల్, కృష్ణ, కని తిరు, కిషోర్, కాళి వెంకట్

అది తమిళనాడులోని ఒక చిన్న టౌన్. షణ్ముగం(కిశోర్), లక్ష్మి(కని తిరు) ఓ చిన్న ఇంట్లో అద్దెకి ఉంటారు. వాళ్లకు కొడుకు పదకొండేండ్ల వరుణ్ (శక్తి రిత్విక్), కూతురు ఏడేండ్ల రుద్ర (ఇయల్) ఉన్నారు. షణ్ముగం వంట గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేస్తుంటాడు. తన పిల్లలు బాగా చదువుకోవాలి అనే ఉద్దేశంతో పెద్ద స్కూల్లో చేర్పిస్తాడు. కానీ.. వరుణ్​ కాస్త అల్లరి పిల్లవాడు కావడంతో చదువు మీద పెద్దగా ఇంట్రస్ట్​ ఉండదు. పిల్లలను క్రమశిక్షణలో పెట్టాలంటే దండించడం ఒక్కటే మార్గమని నమ్ముతాడు షణ్ముగం. అందుకే తరచూ వరుణ్​పై చేయిచేసుకుంటాడు. 

వరుణ్‌కి తండ్రి మోపెడ్​ అంటే ఇష్టం. ఒక్కసారైనా దాన్ని నడపాలి అనుకుంటాడు. ఆ మోపెడ్​కి పిల్లలు ముద్దుగా ‘పారాచూట్’ అని పేరు పెట్టుకుంటారు. ఒక రోజు షణ్ముగం ఇంట్లో లేని టైం చూసుకుని మోపెడ్​ మీద రుద్రను ఎక్కించుకుని బయటికి తీసుకెళ్తాడు వరుణ్. ఒక చోట రోడ్డు పక్కన పార్క్ చేస్తాడు. కట్​ చేస్తే.. మోపెడ్​ కనిపించకుండా పోతుంది. మోపెడ్​ పోగొట్టానని నాన్నకు తెలిస్తే కొడతాడని వరుణ్​ భయపడిపోతుంటాడు. అన్నాచెల్లెళ్లు కలిసి బండిని వెతుకుతుంటారు. మరోవైపు పిల్లల కోసం  తల్లిదండ్రులు వెతుకుతుంటారు. వాళ్లు తిరిగి ఇంటికి చేరుకుంటారా? ఇంతకీ ఆ మోపెడ్​ ఏమైంది? తెలుసుకోవాలంటే ఈ వెబ్​సిరీస్​ చూడాల్సిందే.

ప్రేమ కోసమై.. 

టైటిల్ : కృష్ణం ప్రణయ సఖి, ప్లాట్​ ఫాం : సన్​నెక్స్ట్​, డైరెక్షన్ :  శ్రీనివాసరాజు, కాస్ట్ :  గణేష్, మాళవిక నాయర్, శరణ్య శెట్టి, సాధు కోకిల, రంగాయణ రఘు, కురి ప్రతాప్, శృతి, శశికుమార్, రామకృష్ణ

కృష్ణ (గణేష్) బాగా డబ్బున్న కుటుంబంలో పుట్టి పెరుగుతాడు. హార్వర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేస్తాడు. తన 30వ ఏట ఇంట్లో వాళ్లు అతనికి పెండ్లి చేయాలని ఫిక్స్​ అవుతారు. అప్పుడే అతను ప్రణయ (మాళవిక నాయర్)ని చూసి ప్రేమిస్తాడు. ఆమె ఒక అనాథ. అనాథాశ్రమంలోనే పెరుగుతుంది. తను పెరిగిన ఆశ్రమం కోసమే పనిచేస్తుంటుంది. ఫండ్స్​ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటుంది. 

అదే టైంలో కృష్ణ ఆమెకు దగ్గరవ్వడానికి ఆ ఆశ్రమంలో డ్రైవర్‌గా చేరతాడు. మరోవైపు సంపన్న కుటుంబానికి చెందిన జాహ్నవి (శరణ్య శెట్టి) ఎలాగైనా కృష్ణని పెండ్లి చేసుకోవాలి అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? కృష్ణ, ప్రణయలు ఒక్కటయ్యారా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 

టీఆర్పీ కోసం.. 

టైటిల్ : నారదన్, ప్లాట్​ ఫాం : ఆహా తెలుగు, డైరెక్షన్ : ఆషిక్ అబు, 
కాస్ట్ : టొవినో థామస్, షరాఫ్ యు ధీన్, అన్నా బెన్

మలయాళ స్టార్ టొవినో థామస్ నటించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ రెండున్నరేళ్ల క్రితం థియేటర్లలో రిలీజ్​ అయ్యింది. ఇప్పుడు తెలుగులో ఓటీటీలోకి వచ్చింది. చంద్రప్రకాష్ (టొవినో థామస్) నారద న్యూస్​ అనే ఒక టాప్ ​టీవీ ఛానెల్​లో యాంకర్​గా పనిచేస్తుంటాడు. నైతిక విలువలు పాటించే జర్నలిస్టుగా పేరు తెచ్చుకుంటాడు. కానీ..  ప్రత్యర్థి మీడియా హౌస్ నుంచి పోటీ విపరీతంగా పెరిగిపోతుంది.

 వాళ్లు ఎక్స్​క్లూజివ్​ వార్తలు ప్రసారం చేసినప్పుడు తన యజమాని చంద్రప్రకాశ్​ని నిలదీస్తాడు. ఇలాంటి ఒత్తిళ్ల వల్ల చంద్రప్రకాష్ కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాడు. టీఆర్పీ రేటింగ్​ కోసం రకరకాల ఫీట్లు చేస్తాడు. చివరకు టీఆర్పీ మైండెడ్ చంద్రప్రకాష్‌గా మారిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే అసలు కథ.