టైటిల్ : బ్యాడ్ కాప్
కాస్ట్ : అనురాగ్ కశ్యప్, గుల్షన్ దేవయ్య, హర్లీన్ శేతీ, పాల్లె సింగ్
డైరెక్షన్ : ఆదిత్య దత్
ప్లాట్ ఫాం : డిస్నీ ప్లస్ హాట్ స్టార్
నటుడు గుల్షన్ దేవయ్య ‘కరణ్, అర్జున్’ అనే కవల పాత్రల్లో నటించాడు. ఈ ట్విన్స్ ఇద్దరూ ఒక అనాథ శరణాలయంలో పెరుగుతారు. ఆ తర్వాత కరణ్‌ని ఒక కుటుంబం దత్తత తీసుకుంటుంది. పెద్దయ్యాక కరణ్ పోలీస్ ఆఫీసర్ అవుతాడు. కరణ్‌కు దేవిక (హర్లీన్ శేతీ) అనే పోలీస్ ఆఫీసర్‌తో పెండ్లి అవుతుంది. వాళ్లకి ఒక పాప కూడ ఉంటుంది. దేవికకు ప్రమోషన్ రావడంతో కరణ్ కంటే పై స్థాయికి వెళ్తుంది. దాంతో ఈగోల వల్ల ఇద్దరి మధ్యా దూరం పెరుగుతుంది.
ఇకపోతే అర్జున్ దొంగగా మారతాడు. ముంబయిలో చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. అయితే కరణ్, అర్జున్ ఇద్దరూ టచ్‌లోనే ఉంటుంటారు. దేవిక అర్జున్‌తో టచ్‌లో ఉండొద్దని కరణ్‌కి చెప్తూ ఉంటుంది. అలాంటి సిచ్యుయేషన్‌లో అర్జున్ ఒక జర్నలిస్ట్ మర్డర్ కేస్‌లో ఇరుక్కుంటాడు. ఆ కేసుని డీల్ చేయడానికి సీనియర్ పోలీస్ ఆఫీసర్ (సౌరభ్ సచ్దేవ్) రంగంలోకి దిగుతాడు.
ఆ కేసు నుంచి తప్పించుకునే క్రమంలో కరణ్, అర్జున్‌లు కలిసి పోరాడతారు. అందులో కరణ్ చనిపోతాడు. అది గమనించక అర్జున్‌ని కాపాడుతుంది దేవిక. అయితే, కరణ్‌ని చంపిందెవరు? అర్జున్ మర్డర్ కేస్ ఏమైంది? దేవిక అర్జున్‌ని పసిగడుతుందా? వంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.ఇది రెండు ఎపిసోడ్లు మాత్రమే. స్క్రీన్ ప్లే కొత్తగా ఉంది. ఎక్కడా బోర్ కొట్టదు. గుల్షన్ దేవయ్య ద్విపాత్రాభినయంతో ఆకట్టుకున్నాడు.
పవర్ఫుల్ పీటీ సర్
టైటిల్ : పీటీ సర్
కాస్ట్ : హిప్ హాప్ తమిళన్, కశ్మీర పరదేశీ, దేవదర్శిని, ప్రభు, ఇళవరసు, అనిఖా సురేంద్రన్, త్యాగరాజన్
డైరెక్షన్ : కార్తీక్ వేణు గోపాలన్
ప్లాట్ ఫాం : అమెజాన్ ప్రైమ్
మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన కనగవేల్ (హిప్ హాప్ తమిళన్) ఒక కార్పొరేట్ స్కూల్లో పీటీ సర్గా పనిచేస్తుంటాడు. అదే స్కూల్లో క్రిమినల్ లాయర్ మాణిక వేల్ కూతురు వానతి (కశ్మీర పరదేశీ) టీచర్‌గా పనిచేస్తుంటుంది. ఈ ఇద్దరి మధ్య పరిచయం.. ప్రేమగా మారుతుంది. కనగవేల్కి జాతక దోషం ఉంటుంది. అందువల్ల అతను పెండ్లి అయ్యేవరకు ఎవరితోనూ గొడవపెట్టుకోకూడదు అని జ్యోతిష్యుడు చెప్తాడు. దాంతో అతను ఎలాంటి గొడవలకు వెళ్లకుండా పేరెంట్స్ కాపాడుతూ ఉంటారు. అయితే, కనగవేల్ ఇంటి ముందే నందిని (అనిఖా సురేంద్రన్) ఇల్లు ఉంటుంది.
కనగవేల్ పనిచేస్తున్న స్కూల్‌కి, నందిని చదువుతున్న కాలేజీకి ఛైర్మన్ ఒక్కడే. అతని పేరు పురుషోత్తం (త్యాగరాజన్). కట్ చేస్తే... నందిని డెడ్ బాడీ గుర్తుపట్టలేని స్థితిలో దొరుకుతుంది. అందుకు విద్యాసంస్థల ఛైర్మన్ కారణం అవుతాడు? అతడిని దోషిగా నిరూపించడానికి ఒక సాధారణ పీటీ సర్ ఏం చేస్తాడు? ఈ క్రమంలో అతను ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటాడు? అనేదే కథ. మొదట్లో కామెడీ, లవ్ ట్రాక్ చూపించినా.. తర్వాత సీరియస్ డ్రామా నడుస్తుంది. ఈ మధ్యకాలంలో తక్కువ బడ్జెట్లో వచ్చిన ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది.
ఒక జర్నలిస్ట్ బయోగ్రఫీ
టైటిల్ : మహరాజ్
కాస్ట్ : జునైద్ ఖాన్, జైదీప్ అహ్లావత్, శాలినీ పాండే
డైరెక్షన్ : సిద్ధార్థ్ మల్హోత్రా
ప్లాట్ ఫాం : నెట్ ఫ్లిక్స్
మహరాజ్ సినిమా1862లో జరిగిన ఒక నిజ సంఘటన ఆధారంగా తెరకెక్కిన కథ. ఇందులో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ మెయిన్ లీడ్. ఈ సినిమాలో అతను చేసిన క్యారెక్టర్ పేరు కర్సందాస్ ముల్జీ. గుజరాత్‌కి చెందిన సామాజిక కార్యకర్త, జర్నలిస్ట్. ఆయన బయోగ్రఫీనే ఈ సినిమా కథ. ఇందులో శాలినీ పాండే కర్సందాస్ భార్య కిశోరీ పాత్రలో నటించింది.
కర్సందాస్ వితంతు వివాహాలను ప్రోత్సహించిన విధానం, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడడం వంటి అంశాలు ఉంటాయి. మూఢనమ్మకాలను ఎదిరించే వ్యక్తిగా కనిపిస్తాడు. మతాచారాల పేరుతో మహరాజ్ చేసే దురాచారాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత ఏమైందనేదే మిగతా కథ. ఇందులో జునైద్, జైదీప్ నటన బాగుంది.
ఆరుగురి ఆత్మ హత్య?
టైటిల్ : గాంఠ్
కాస్ట్ : మానవ్ విజ్, సలోని బాత్రా, మోనికా పన్వర్, గౌరవ్ మిశ్రా, ప్రమోద్ చతుర్వేది, సౌరభ్ పటేల్
డైరెక్షన్ : కనిష్క్ వర్మ
ప్లాట్ ఫాం : జియో సినిమా
ఢిల్లీ సమీపంలోని ‘హకీకత్ నగర్’. అక్కడ జతిన్ కుటుంబం నివసిస్తుంది. తండ్రి మరణంతో మానసికంగా దెబ్బతింటాడు జతిన్. ఆ షాక్ వల్ల అతనికి మాట పోతుంది. చాలా కాలం తరువాత ఎప్పటికో మాట వస్తుంది. వాళ్లింట్లో ఆరుగురు సభ్యులు ఉంటారు. అయితే ఆ కుటుంబ సభ్యులంతా తెల్లవారేసరికి ఇంట్లో ఉరికి వేలాడుతూ కనిపిస్తారు. దాంతో ఆ కాలనీ వాసులంతా భయపడిపోతారు. ఈ కేసును గదర్ సింగ్ (మానవ్ విజ్)కి అప్పగిస్తారు.
అయితే పోలీస్ ఆఫీసర్‌గా ఉన్న అతన్ని ఫ్యామిలీ వైపు నుంచి కొన్ని సమస్యలు వెంటాడుతుంటాయి. ఆ సమస్యల కారణంగా మద్యానికి బానిస అవుతాడు. ఆ కారణంగానే సస్పెండ్ అవుతాడు. అలాంటి గదర్.. ఈ కేసును ఛేదించగలడని భావించి, డిపార్ట్మెంట్ వాళ్లు అతన్ని కేస్ టేకప్ చేయమంటారు. అందుకు ఒప్పుకుని అక్కడికి వెళ్లిన గదర్‌కు. ఆ ఆరుగురిలో ఒక చిన్న పిల్లాడు బతికే ఉన్నట్టు తెలుస్తుంది.
అతన్ని వెంటనే హాస్పిటల్లో చేరుస్తారు. ఆ తర్వాత ఏమైంది? వాళ్లంతా ఉరి వేసుకోవడానికి గల కారణాలేంటి? బతికిన పిల్లాడు ఏమైనా చెప్తాడా? లేదా? తెలుసుకోవాలంటే సిరీస్ చూడాల్సిందే. మామూలుగా ఇన్వెస్టిగేషన్ స్టోరీ అంటే హడావిడి కనిపిస్తుంటుంది. కానీ, ఈ సిరీస్‌లో అలాంటి హడావిడి ఏమీ ఉండదు. రియల్ పోలీసులు ఎలాగైతే కేసును సాల్వ్ చేస్తారో అలానే చేసినట్టు చూపించారు. సినిమాటిక్ ఎలిమెంట్ మిస్ అయ్యి కొన్ని సీన్స్ బోర్ కొట్టిస్తాయి. కానీ, క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంటుంది. కొంచెం టైం దొరికింది అంటే కూల్‌గా కూర్చుని ఈ సిరీస్ చూడొచ్చు.
సూపర్ స్టార్ కెరీర్ ఏమైంది?
టైటిల్ : నడికర్
కాస్ట్ : టొవినో థామస్, సౌబిన్ సాహిర్, ధ్యాన్ శ్రీనివాసన్, సురేశ్ కృష్ణ, భావన, దివ్య పిళ్లై, చందు సాలిమ్కుమార్, బాలు వర్గీస్, గణపతి, షైన్ టామ్ చాకో
డైరెక్షన్ : జీన్ పాల్ లాల్ (జూనియర్ లాల్)
ప్లాట్ ఫాం : నెట్ ఫ్లిక్స్
సినిమాల్లో సూపర్ స్టార్ డేవిడ్ పడిక్కల్ (టొవినో థామస్) చుట్టూ తిరిగే స్టోరీ నడికర్. డేవిడ్‍కు వరుసగా మూడు భారీ ఫ్లాప్‌లు వస్తాయి. దాంతో అవకాశాలు తగ్గిపోతాయి. అయితే, అతడి మేనేజర్ పైలీ (సురేశ్ కృష్ణ) ఎలాగో కష్టపడి డేవిడ్‍తో మూవీ చేసేందుకు ఓ దర్శకుడిని ఒప్పిస్తాడు. అయితే, డేవిడ్ తన పొగరుతో ఆ ప్రాజెక్ట్ నుంచి కూడా తప్పుకుంటాడు. ఒకానొక టైంలో అయితే, తనలో యాక్టింగ్ టాలెంట్ తగ్గిపోయిందని గుర్తిస్తాడు.
దీంతో యాక్టింగ్ కోచ్ బాలు (సౌబిన్ షాహిర్)ను నియమించుకుంటాడు. ఆ తర్వాత డేవిడ్, బాలు మధ్య కూడా ఈగో సమస్యలు వస్తాయి. అయితే, డేవిడ్ మళ్లీ స్టార్డమ్ తెచ్చుకునేలా బాలు సాయం చేశాడా? డేవిడ్ యాక్టింగ్ కెరీర్ ఏమైంది? అనేదే నడిగర్ కథ. ఇందులో టొవినో థామస్ నటన హైలైట్. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, స్క్రీన్ ప్లే బాగున్నాయి.