ఈ వారం స్ట్రీమ్ంగ్ లో ఉన్న మూవీస్ ఇవే ?

ఈ వారం స్ట్రీమ్ంగ్ లో ఉన్న మూవీస్ ఇవే ?

వందకోట్ల స్కామ్​

టైటిల్ : టర్బో, కాస్ట్ : మమ్ముట్టి, అంజనా జయప్రకాశ్​, రాజ్​ బి షెట్టి, శబరీష్​ శర్మ, సునీల్, కబీర్​ దుహాన్ సింగ్
డైరెక్షన్ : వైశాఖ్​, ప్లాట్ ఫాం : సోనీలివ్​
లాంగ్వేజ్ :  తెలుగు

ఒక గ్రామంలో తల్లితో కలిసి ఉంటాడు జోస్ (మమ్ముట్టి). అతని ఫ్రెండ్​ జెర్రీ (శబరీశ్) చెన్నైలోని బ్యాంకు ఉద్యోగి. అక్కడే మరో బ్యాంకులో మేనేజర్​గా పనిచేస్తున్న ఇందులేఖ (అంజనా జయప్రకాశ్)ని జెర్రీ లవ్ చేస్తాడు. ప్రతి ఏడాది తిరునాళ్లు జరిగేటప్పుడు జోస్ వాళ్ల ఊళ్లో గొడవలు అవుతుంటాయి. దాంతో కొడుకును వేరే ఊరికి పంపించాలని అనుకుంటుంది జోస్ తల్లి. ఈ క్రమంలో జెర్రీ వల్ల గొడవ జరుగుతుంది. అందులో జోస్ ఇన్వాల్వ్ అవుతాడు. కానీ, వాళ్ల నాన్నకు జెర్రీ భయపడి, ఇందులేఖ ఎవరో తెలియనట్టుగా ప్రవర్తిస్తాడు. ఆ కోపంతో ఆమె చెన్నై బస్సు ఎక్కేస్తుంది. ఇందులేఖని తాను కిడ్నాప్ చేసినట్టుగా ఆమె తండ్రి కేస్ పెట్టాడని తెలుసుకున్న జోస్, ఆమె కోసం చెన్నై వెళ్తాడు. 

కట్ చేస్తే.. తిరునాళ్ల తరువాత యథావిధిగా డ్యూటీకి వెళ్లిన జెర్రీ, చనిపోయినవారి బ్యాంకు అకౌంట్ల ద్వారా వంద కోట్ల స్కామ్ జరిగిందని గుర్తిస్తాడు. ఈ స్కామ్ వెనుక ఉన్నది షణ్ముగ సుందరం ( రాజ్ బి షెట్టి) అని తెలుస్తుంది. ఈ ఎఫెక్ట్ ఇందులేఖ పనిచేసే బ్యాంకుపై కూడా పడుతుందని భావించి, ఆమెకి చెప్పడానికి వెళ్తాడు. అయితే అతనిపై ఉన్న కోపం కారణంగా ఆమె వినిపించుకోదు. 

ఆ తరువాత అతను అనుమానాస్పద స్థితిలో చనిపోతాడు. ప్రియుడు చనిపోయిన బాధలో ఉన్న ఆమెపై అటాక్ జరుగుతుంది. ఒకవైపు ఇదంతా ఎవరు చేస్తున్నారనే ఆలోచన జోస్​కి అర్థంకాదు. జెర్రీ చావుకు కారణం షణ్ముగ సుందరం అని తెలుస్తుంది. అసలు షణ్ముగ సుందరం ఎవరు? జోస్,- ఇందులేఖలు అతన్ని ఎలా ఎదుర్కొంటారు? అనేది మిగతా కథ. ఈ మమ్ముట్టి, రాజ్​ బి షెట్టిల నటన సినిమాకే హైలైట్. పర్ఫార్మెన్స్​లో ఎవరూ తగ్గలేదు. కాకపోతే కథ పరంగా అంత థ్రిల్ చేయదు.

అమ్మాయిల డెత్ మిస్టరీ

టైటిల్ : డి – బ్లాక్, కాస్ట్ : అరుల్​నిధి, చరణ్​దీప్, అవంతిక మిశ్రా, తలైవసల్ విజయ్, ఉమా రియాజ్ ఖాన్​, డైరెక్షన్ : విజయ్ కుమార్ రాజేంద్రన్​, ప్లాట్ ఫాం : ఈటీవీ విన్​, లాంగ్వేజ్ :  తెలుగు

కోయంబత్తూర్ లోని ఒక ఇంజనీరింగ్ కాలేజీ అడవికి ఆనుకుని ఉంటుంది. ఆ కాలేజీలో అరుళ్ (అరుళ్ నిధి), విజయ్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ చేరతారు. అదే కాలేజీలో చదువుతున్న శృతి (అవంతిక మిశ్రా) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు అరుళ్. ఆమె ఉండే హాస్టల్.. బాయ్స్ హాస్టల్​కి కాస్త దూరంగా ‘డి-–బ్లాక్’ లో ఉంటుంది. అడవికి దగ్గర ఉండడం వల్ల సాయంత్రం ఆరు గంటలకే కాలేజీ గేట్లు మూసేస్తారు. ఆ తర్వాత ఎవరూ తమ రూమ్స్ నుంచి బయటికి రారు. 

ఎలాంటి పరిస్థితుల్లోను హాస్టల్ డాబాపైకి వెళ్లకూడదు.. అనేది రూల్. అయితే ఒక రోజు రాత్రి శృతి రూం మేట్ స్వాతి (జనని) బట్టలు ఆరేయడానికి హాస్టల్ డాబాపైకి వెళ్తుంది. మర్నాడు స్వాతి శవమై కనిపిస్తుంది. ఆమెపై చిరుతపులి దాడి చేసిందని పోలీసులు తేలుస్తారు. స్వాతి చావు మీద డౌట్ ఉందని శృతి, అరుళ్​తో చెప్తుంది. ఆ తర్వాత జరిగిన పరిమాణాల వల్ల కాలేజీలో ఏదో జరుగుతోందని అరుళ్​ కూడా అనుమాన పడతాడు.

 అదేంటో తెలుసుకోవాలని అరుళ్ అనుకుంటాడు. ఆరా తీస్తే.. ఆ కాలేజీలో అప్పటికే ఎనిమిది మంది అమ్మాయిలు చనిపోయారని, వాళ్లలో గతంలో వాచ్​మెన్​గా పనిచేసిన అతని కూతురు కూడా ఉందని తెలుస్తుంది. ఆ వాచ్ మెన్ అడ్రస్ తెలుసుకుని, అతని ఊరుకు వెళ్తారు వాళ్లు. అక్కడ ఏం జరుగుతుంది? కాలేజీలో అమ్మాయిలు ఎందుకు చనిపోతున్నారు? అనేది అరుళ్ కనిపెట్టాడా? లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

బంగ్లాలో దెయ్యం 

టైటిల్ : లైఫ్​ హిల్ గయీ, 
కాస్ట్ : దివ్యేందు, కుషా కపిల, ముక్తి మోహన్, వినయ్ పాఠక్​
డైరెక్షన్ : ప్రేమ్​ మిస్త్రీ​, ప్లాట్ ఫాం : డిస్నీ ప్లస్ హాట్ స్టార్​
లాంగ్వేజ్ :  తెలుగు

ఉత్తరాఖండ్ లోని పంచ్​మోలి అనే గ్రామానికి లండన్ నుంచి హిమాలయ్ (వినయ్ పాఠక్) ఫ్యామిలీతో కలిసి అక్కడికి వస్తాడు. అతనికి దేవ్​ (దివ్యేందు), కల్కి (కుషా కపిల) సంతానం. అక్కడ వాళ్ల తాత పృథ్వీకి సంబంధించిన ఒక పాత బంగ్లా ఉంటుంది. ‘‘ఆ బంగ్లాలో హోటల్​ నడపాలి. ఎవరు ఎక్కువ కష్టపడితే వాళ్లకు ప్రతి నెలా ఒక మెడల్ ఇస్తా. ఆరు నెలల్లో ఎవరి దగ్గర ఎక్కువ మెడల్స్  ఉంటే వాళ్లకి తన ఆస్తి రాసిస్తా’’ అంటాడు తాత. దాంతో దేవ్, -కల్కి పని మొదలుపెడతారు. దేవ్, కల్కి కలిసి ఆ బంగ్లాను హోటల్​లాగా మార్చేస్తారు. ఆ ఊరి వాళ్లని కొందరిని పనివాళ్లుగా తీసుకుంటారు. అదే గ్రామానికి చెందిన హిమ (ముక్తి మోహన్) పండ్ల వ్యాపారం చేస్తుంటుంది. అనాథ అయిన ఆమె చందన్​ను ప్రేమిస్తుంది. 

చందన్ నిజస్వరూపం గురించి తెలుసుకున్న హిమ.. దేవ్​ని చూసి అట్రాక్ట్ అవుతుంది. దేవ్​కి కూడా తనంటే ఇష్టమే. ఇదిలా ఉంటే.. తాతయ్య ఇచ్చే ఆస్తులు తీసుకుని లండన్ వెళ్లిపోవాలని కల్కి అనుకుంటుంది. మరోవైపు తనతోపాటు హిమను న్యూయార్క్ తీసుకెళ్లాలని దేవ్ అనుకుంటాడు. ఇక్కడే ఒక ట్విస్ట్​ ఉంటుంది. అదేంటంటే.. గతంలో ఆ హోటల్లో చనిపోయిన వ్యకి దెయ్యమై తిరుగుతున్నాడని జనాలు భయపడుతుంటారు. దాంతో హోటల్ మూతపడుతుందని దేవ్, కల్కి కంగారుపడతారు. ఆ తర్వాత ఏమైంది?  చివరకు దేవ్​, హిమ ప్రేమ గెలుస్తుందా?  అనేది మిగతా కథ.

ఆటో డ్రైవర్​, రౌడీ షీటర్...

టైటిల్ : తెప్ప సముద్రం
కాస్ట్ : ​చైతన్యరావు, అర్జున్ అంబటి, రవిశంకర్, కిషోరి ధహ్రక్
డైరెక్షన్ : సతీశ్ రాపోలు
ప్లాట్ ఫాం : ​ఆహా
లాంగ్వేజ్ :  తెలుగు

తెప్ప సముద్రం అనే గ్రామంలో గణేశ్ (చైతన్యరావు) ఎస్సై. అతని తండ్రి విశ్వనాథ్ (రవి శంకర్) లాయర్. అదే ఊళ్లో విజయ్ (అర్జున్ అంబటి) ఆటో నడుపుతుంటాడు. టౌన్‌లో చదువుకునే ఆడపిల్లలు అతని ఆటోలోనే వెళ్తుంటారు. ఆ ఊళ్లోనే గజ అనే లోకల్ రౌడీ కూడా ఉంటాడు. విజయ్​కి తెలియకుండా అతని ఆటోలోనే టౌన్​కి గంజాయిని తరలిస్తుంటాడు గజ. 

ఇదిలాఉంటే ... పదిహేనేండ్లుగా తెప్ప సముద్రం గ్రామానికి చెందిన టీనేజ్ అమ్మాయిలు మిస్సవుతుంటారు. వాళ్లని ఎవరు కిడ్నాప్ చేస్తున్నారనే విషయంపై ఎస్.ఐ. గణేశ్ దృష్టిపెడతాడు. తన తండ్రి విశ్వనాథం కూడా అందరినీ అనుమానిస్తుంటాడు. అందులో భాగంగానే ఆటో డ్రైవర్ విజయ్ పై కూడా ఒక కన్నేసి ఉంచుతాడు. లాయర్ అనుమానం నిజమేనా?  అది తెలియాలంటే సినిమా చూడాలి. 

థ్రిల్​ చేసే రాణి కథ

టైటిల్ : హసీన్ దిల్​ రుబా
కాస్ట్ : తాప్సీ పన్నూ, విక్రాంత్ మెస్సే, సన్నీ కౌశల్, జిమ్మీ షెర్గిల్, ఆదిత్య శ్రీవాస్తవ
డైరెక్షన్ : జేప్రద్​ దేశాయ్
ప్లాట్ ఫాం : నెట్ ఫ్లిక్స్
లాంగ్వేజ్ : హిందీ 

రాణి (తాప్సీ) రిషు సక్సేనా ( విక్రాంత్ మాస్సే) లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. అయితే నీల్ ( హర్షవర్ధన్ రాణే)ని చూసి రాణి అట్రాక్ట్ అవుతుంది. వాళ్లిద్దరి మధ్య రిలేషన్ ఏర్పడుతుంది. ఆ విషయం రిషుకి తెలుస్తుంది. దాంతో ఆ ముగ్గురి మధ్య గొడవ జరుగుతుంది. ఆ గొడవలో నీల్ చనిపోతాడు. భార్యభర్తలిద్దరూ కలిసి అతని శవాన్ని మాయం చేస్తారు. ఆ కేసు డీల్ చేస్తున్న పోలీసులను పక్కదారి పట్టిస్తుంటారు. కట్ చేస్తే.. కథ ఆగ్రాలో మొదలవుతుంది. రాణి, -రిషు ఇద్దరూ కూడా సపరేట్​గా ఉంటూనే, రహస్యంగా కలుసుకుంటూ ఉంటారు. 

ఈ క్రమంలో పోలీస్ ఆఫీసర్ అయిన రిషు మేనమామకు రాణిపై డౌట్ వస్తుంది. దాంతో ఓ పోలీస్ ఆఫీసర్ ఆమెను స్పై చేస్తుంటాడు. ఇదిలా ఉంటే.. రాణి ఒంటరిగా ఉంటుందని భావించిన కాంపౌండర్ అభిమన్యు (సన్నీ కౌశల్) ఆమెను ప్రేమిస్తుంటాడు. తనని ఎవరో రహస్యంగా గమనిస్తున్నారని తెలిసిన రాణి, వాళ్ల దృష్టి మరల్చేందుకు అభిమన్యుని పెండ్లి చేసుకుంటుంది. ఇక ఆ తర్వాత ఏమైంది?  రిషు ఏమయ్యాడు? కేసు ఎలా ముగుస్తుంది? వంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో, తాప్సీ, విక్రాంత్, హర్షవర్ధన్​లు తమ పాత్రలకు న్యాయం చేశారు. స్క్రీన్ ప్లే బాగుంది.

డేనియల్ డైరీలో ఏముంది?

టైటిల్ : బర్త్ మార్క్
కాస్ట్ : షబ్బీర్ కల్లరక్కల్, మిర్నా మెనన్, పొర్కొడి సెంథిల్, ఇందిరాజీత్, దీప్తి ఓరియెంటెలు, పి.ఆర్ వరలక్ష్మి, డైరెక్షన్ : విక్రమ్ శ్రీధార
ప్లాట్ ఫాం : ఆహా, లాంగ్వేజ్ :  తమిళం

డేనియల్ (షబ్బీర్) ఆర్మీలో పనిచేస్తుంటాడు. అతని భార్య జెన్నిఫర్ (మిర్నా మీనన్) గర్భవతిగా ఉన్న టైంలో ‘ధవంతరి’ అనే బర్తింగ్ విలేజ్ గురించి వింటాడు. ఫారెస్ట్​కి దగ్గర్లోనే ఉంటుంది ఆ విలేజ్​. అక్కడ‘కుందవై’ (పీఆర్ వరలక్ష్మి).. ఆ ఆశ్రమాన్ని నడిపిస్తుంటుంది. ఆమె దగ్గర వాచ్ మెన్​ సెబాస్టియన్, ఇద్దరు అసిస్టెంట్లు పనిచేస్తుంటారు. భార్య డెలివరీ కోసం ఆ ఆశ్రమానికి తీసుకెళ్తాడు డేనియల్. ఆశ్రమంలో సిగరెట్లు, మందు తాగకూడదని డేనియల్​తో సెబాస్టియన్ గట్టిగా చెప్తాడు. కానీ, వాటి విషయంలో కంట్రోల్​ లేని డేనియల్ వాచ్​మెన్​పై కోపం పెంచుకుంటాడు. 

అదే టైంలో ఈ విలేజ్ అడవికి దగ్గరగా, టౌన్​కి దూరంగా ఉండటంతో జెన్నీ భయపడుతుంటుంది. ఆశ్రమంలో వాళ్ల ప్రవర్తన బాగాలేదనీ, తనని టౌన్ కి తీసుకెళ్లమని భర్తను అడుగుతుంటుంది. అయినా డేనియల్ ఆమె చెప్పే విషయాన్ని పట్టించుకోడు. అంతేకాకుండా డేనియల్ అప్పుడప్పుడు విచిత్రంగా బిహేవ్​ చేస్తుంటాడు. దెయ్యం పట్టినట్టు అరుస్తుంటాడు. కట్ చేస్తే.. ఒక రోజు భర్త డేనియల్ డైరీ ఆమెకు కనిపిస్తుంది. ఆమె ఆ డైరీ చదవడం మొదలుపెడుతుంది. ఆ తర్వాత భర్త, తనను ఏదో చేసేస్తాడని భయపడుతుంది జెన్నీ. అప్పుడు జెన్నీ ఏం చేస్తుంది? ఆ డైరీలో ఏముంది? సెబాస్టియన్​ని డేనియల్ ఏం చేస్తాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో షబ్బీర్, మిర్నా మెనన్​ల నటన బాగుంది. ఆసక్తిగా ఉండే కథ.. కానీ, కాస్త స్లోగా ఉంటుంది.