ఖమ్మం జిల్లాలో కొత్త మున్సిపాలిటీ!

ఖమ్మం జిల్లాలో కొత్త మున్సిపాలిటీ!
  • రూరల్ మండలంలో 12 గ్రామాలను కలిపి ఎదులాపురం మున్సిపాలిటీ
  • రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్​ ముజామ్మిల్ ఖాన్​ ప్రతిపాదనలు

ఖమ్మం/ ఖమ్మం రూరల్​, వెలుగు : ఖమ్మం జిల్లాలో కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు కాబోతున్నది. ఖమ్మం రూరల్​ మండలంలోని ఎదులాపురం కేంద్రంగా మున్సిపాలిటీని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. బారుగూడెం, గొల్లగూడెం, గుదిమల్ల, చిన్న వెంకటగిరి, పెద్దతండా, ఎదులాపురం, గుర్రాలపాడు, మద్దులపల్లి, ముత్తగూడెం, తెల్దారుపల్లితోపాటు పోలేపల్లి, పల్లెగూడెంలో కొంతభాగం కలిపి మున్సిపాలిటీని ఏర్పాటుచేయనున్నారు. ప్రస్తుతానికి ఖమ్మం జిల్లాలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్​ ఉండగా, వైరా, సత్తుపల్లి, మధిర మున్సిపాలిటీలున్నాయి. 

ఎదులాపురం కొత్తగా ఏర్పడితే జిల్లాలో మున్సిపాలిటీల సంఖ్య నాలుగుకు చేరనుంది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్​ ను ఆనుకొని రూరల్​ మండలంలో ఉన్న ఏడు గ్రామాలను గతంలో కార్పొరేషన్​ లోనే విలీనం చేశారు. అప్పట్లో ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో, ఆ తర్వాత మళ్లీ ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ పంచాయతీలతో పాటు మరికొన్నింటిని కలిపి మున్సిపాలిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

ఇక అన్ని నియోజకవర్గాల్లో మున్సిపాలిటీలు!

ఖమ్మం జిల్లాలో మొత్తం ఐదు నియోజకవర్గాలుండగా, పాలేరు తప్ప అన్ని నియోజకవర్గాల్లో మున్సిపాలిటీలున్నాయి. దీంతో పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈ కొత్త మున్సిపాలిటీని ప్లాన్​ చేశారు. ఖమ్మం కార్పొరేషన్​ ను ఆనుకొని ఉండడంతో ఈ గ్రామాల్లో ఇప్పటికే పరిశ్రమలు, విద్యాసంస్థలు, గ్రానైటీ ఇండస్ట్రీలు ఉన్నాయి. 

పెద్ద సంఖ్యలో వ్యవసాయ భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారాయి. మున్సిపాలిటీగా ఏర్పాటైతే మరింత అభివృద్ధి జరగనుంది. కొత్త మున్సిపాలిటీకి సంబంధించి రెండు వారాల కింద రూరల్​ ఎంపీడీవో ఆఫీస్​ నుంచి కలెక్టరేట్ కు ప్రతిపాదనలు వెళ్లగా, తాజాగా కలెక్టర్​ ముజామ్మిల్ ఖాన్​ దీనిపై రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్​ కు ప్రతిపాదనలను పంపించారు. ఇప్పటికే ఒక వైపు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధం అవుతుండడంతో, ప్రభుత్వం త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 

12 పంచాయతీలు.. 58,647 జనాభా..

ప్రస్తుతం కొత్త మున్సిపాలిటీల్లో తీసుకోవాలనుకుంటున్న బారుగూడెం, గొల్లగూడెం, గుదిమల్ల, చిన్న వెంకటగిరి, పెద్దతండా, ఎదులాపురం, గుర్రాలపాడు, మద్దులపల్లి, ముత్తగూడెం, తెల్దారుపల్లి, పోలేపల్లి, పల్లెగూడెం పంచాయతీల పరిధిలో మొత్తం 58,647 మంది జనాభా ఉండగా, 43,874 మంది ఓటర్లున్నారు. 69.771 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉండగా, ఒక్క చదరపు కిలోమీటర్​ కు 840.56 మంది జన సాంద్రత ఉంది. 

మొత్తం 18,937 ఇండ్లు ఇండగా, ఈ గ్రామాలన్నింటిలో కలిపి ప్రస్తుతం రూ.5.84 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్​ డిమాండ్​ ఉంది. ఇప్పటికే ఖమ్మం రూరల్​ మండల నాయకుల నుంచి, అధికారుల నుంచి ఈ కొత్త మున్సిపాలిటీకి సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాస​ రెడ్డి ఫీడ్ బ్యాక్​ తీసుకున్నట్టు సమాచారం. వరంగల్ క్రాస్​ రోడ్డులో ఉన్న తరుణి హట్ లో కొత్త మున్సిపల్ ఆఫీస్​ ను ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.