ఖమ్మంలో రెండు కొత్త మున్సిపాలిటీలు!

ఖమ్మంలో  రెండు కొత్త మున్సిపాలిటీలు!
  • అశ్వారావుపేట, ఏదులాపురం మున్సిపాలిటీల ఏర్పాటుకు ఓకే
  • కొత్తగూడెం కార్పొరేషన్​ఏర్పాటుకు తాత్కాలిక బ్రేక్?​

ఖమ్మం/అశ్వారావుపేట, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు కొత్త మున్సిపాలిటీలు ఏర్పడుతున్నాయి. అశ్వారావుపేట, ఏదులాపురం మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. కొత్తగూడెం కార్పొరేషన్​ ఏర్పాటుకు బ్రేక్​ పడినట్టు తెలుస్తోంది. 

12 గ్రామాలతో ఏదులాపురం మున్సిపాలిటీ!

ఖమ్మం జిల్లాలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలో ఏదులాపురం మున్సిపాలిటీ ఉంది. ఖమ్మం రూరల్​ మండలంలోని ఏదులాపురం కేంద్రంగా బారుగూడెం, గొల్లగూడెం, గుదిమల్ల, చిన్న వెంకటగిరి, పెద్దతండా, గుర్రాలపాడు, మద్దులపల్లి, ముత్తగూడెం, తెల్దారుపల్లి, పోలేపల్లిలో కొంతభాగం, పల్లెగూడెంలో కొంతభాగం కలిపి మున్సిపాలిటీని ఏర్పాటవుతోంది. ప్రస్తుతానికి ఖమ్మం జిల్లాలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్​ ఉండగా, వైరా, సత్తుపల్లి, మధిర మున్సిపాలిటీలున్నాయి. కొత్త దానితో కలిపి జిల్లాలో మున్సిపాలిటీల సంఖ్య నాలుగుకు చేరనుంది.

 ప్రస్తుతం ఏదులాపురం మున్సిపాలిటీగా ఏర్పాటవుతున్న 12 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 58,647 మంది జనాభా ఉండగా, 43,874 మంది ఓటర్లున్నారు. 69.771 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉండగా, ఒక్క చదరపు కిలోమీటర్​ కు 840.56 మంది జన సాంద్రత ఉంది. మొత్తం 18,937 ఇండ్లు ఉండగా, ఈ గ్రామాలన్నింటిలో కలిపి ప్రస్తుతం రూ.5.84 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్​ డిమాండ్​ ఉంది. వరంగల్ క్రాస్​ రోడ్డులో ఉన్న తరుణి హట్ లో కొత్త మున్సిపల్ ఆఫీస్​ ను ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. 

Also Read :- గ్రేటర్ సిటీగా కరీంనగర్..?

నెరవేరిన ‘పేట’ వాసుల కల 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అశ్వారావుపేట వాసుల కల నెరవేరింది. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చొరవతో అశ్వారావుపేట మున్సిపాలిటీగా మారుతోంది. అశ్వారావుపేట, గుర్రాల చెరువు, పేరాయి గూడెం గ్రామపంచాయతీలను నూతన మున్సిపాలిటీగా అసెంబ్లీలో తీర్మానం చేయటంతో పేట వాసుల్లో ఆనందం వెల్లివిరిసింది. అశ్వారావుపేటలో ప్రస్తుతం 22,366 మంది, గుర్రాల చెరువులో 1,248 మంది, పేరాయి గూడెంలో 8,082 మంది జనాభా ఉంది. పురపాలక సంఘం ప్రకటనతో పేట మరింత వేగవంతంగా అభివృద్ధి చెందుతుందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. 

ఆగిన కొత్తగూడెం  కార్పొరేషన్ ​ఏర్పాటు 

పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీలను కలుపుతూ మున్సిపల్ కార్పొరేషన్​ ఏర్పాటు కోసం ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ శుక్రవారం అసెంబ్లీలో మంత్రి శ్రీధర్​ బాబు ప్రకటించిన లిస్ట్ లో ఆ ప్రస్తావన లేదు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు దీనిపై కొద్దినెలలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ, కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నట్టు తెలుస్తోంది. 

కొత్తగూడెం ఎయిర్​ పోర్టు కోసం ఒకవైపు ప్రయత్నాలు జరుగుతుండగా, అదే సమయంలో కార్పొరేషన్​ ఏర్పాటైతే ఈ ప్రాంతంలో మరింత అభివృద్ధి జరిగే చాన్స్​ ఉంది. కానీ ఏజెన్సీ ప్రాంతం కావడం, 1/70 యాక్ట్ కారణంగా కార్పొరేషన్​ ఏర్పాటులో కొన్ని సాంకేతిక సమస్యలున్నట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే తర్వాతి అసెంబ్లీ సెషన్​ నాటికి కొత్తగూడెం కార్పొరేషన్​ పై ముందడుగు పడే అవకాశం కనిపిస్తోంది.