- గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్లను ఎప్పుడైనా అమ్ముకునేందుకు వీలు
- ఇన్వెస్ట్‌మెంట్ గోల్ బట్టి ఎంచుకోవాలని నిపుణుల సలహా
బిజినెస్ డెస్క్, వెలుగు: దీపావళి వచ్చేసింది. ధంతేరాస్ (ఈ నెల 10, 11) అంటే ముందు గుర్తొచ్చేది ‘గోల్డ్’. ఈ పండుగ టైమ్‌లో బంగారాన్ని కొనుగోలు చేయడాన్ని శుభప్రదమైనదిగా భావిస్తారు. కానీ, బంగారంలో కూడా డిజిటల్ గోల్డ్, సావరిన్ బాండ్స్, గోల్డ్ ఈటీఎఫ్‌లు అంటూ కొత్త ఆప్షన్లు కన్జూమర్ల ముందుకు వచ్చాయి. ఫిజికల్ గోల్డ్‌లో కాకుండా పేపర్ గోల్డ్ (ఇన్వెస్ట్‌మెంట్) కోసం చూసుకునేవారికి సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్‌జీబీ) లేదా గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.
సావరిన్ గోల్డ్ బాండ్లు..
వీటిని ప్రభుత్వం తరపున ఆర్‌బీఐ అమ్ముతోంది. కమర్షియల్ బ్యాంకులు (ఎస్‌బీఐ, బీఓబీ వంటివి), స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కొన్ని పోస్ట్ ఆఫీసులు, ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో ఎస్‌జీబీలను కొనుక్కోవచ్చు. ఎస్‌జీబీలను 2015 నుంచి ఆర్‌బీఐ అమ్ముతోంది. గోల్డ్ కొనుక్కొని బీరువాల్లో ఉంచుకోవడం వలన ఎటువంటి ఉపయోగం ఉండదు. అదే ఎస్‌జీబీలు కొంటే వడ్డీ పొందొచ్చు.
మెచ్యూరిటీ అయ్యాక అప్పటి గోల్డ్ ధరను ప్రభుత్వం చెల్లిస్తుంది. తాజాగా ఎస్‌జీబీ సేల్ ఈ ఏడాది సెప్టెంబర్ 11 ఓపెనై అదే నెల 20 న ముగిసింది. ఇండియన్ బులియన్, జ్యువెలరీ అసోసియేషన్ పబ్లిష్ చేసిన రేటు బట్టి ఎస్‌జీబీల ఇష్యూ ధర ఉంటోంది. ఆన్‌లైన్‌లో వీటిని కొనేవారికి రూ.50 డిస్కౌంట్ ఇస్తున్నారు. ఎస్‌జీబీలను ఇష్యూ టైమ్‌లో కొనుక్కోవచ్చు. ఇప్పటి వరకు ఇష్యూ అయిన ఎస్‌జీబీలు స్టాక్ మార్కెట్‌లో ట్రేడవుతున్నాయి. వీటిని ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. సాధారణంగా ఫిజికల్ గోల్డ్ ధర షాపుల్లో 10 శాతం వరకు ఎక్కువ ఉంటుంది. అదే ఎస్‌జీబీల రేటు అయితే గోల్డ్ అసలు ధరకు సమానంగా ఉంటుంది.
టెన్యూర్, వడ్డీ..
ఎస్‌జీబీలను ఎనిమిదేళ్ల కాల పరిమితితో అందుబాటులోకి వస్తున్నాయి. ఇన్వెస్ట్ చేసిన ఐదు, ఆరు, ఏడో ఏడాదిల్లో బాండ్ల నుంచి ఎగ్జిట్ అవ్వడానికి వీలుంటోంది. ఎస్‌జీబీల్లో పెట్టుబడులకు ఏడాదికి 2.50 శాతం వడ్డీని, ప్రతీ ఆరు నెలలకొకసారి ప్రభుత్వం ఇస్తోంది. ఎస్‌జీబీల ద్వారా వచ్చిన వడ్డీ ఆదాయంపై ఇన్‌కమ్ ట్యాక్స్ పడుతోంది. మెచ్యూరిటీ వరకు ఎస్‌జీబీలను హోల్డ్ చేస్తే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వేయడం లేదు. కానీ, మెచ్యూరిటీ కంటే ముందు అమ్మితే ఈ ట్యాక్స్ పడుతుంది. వీటిని కొనేటప్పుడు జీఎస్‌టీ కూడా వేయడం లేదు.
గోల్డ్ ఈటీఎఫ్..
లిక్విడిటీ (ఎక్కువ మంది కొనడం, అమ్మడం) ప్రకారం చూస్తే ఎస్‌జీబీలతో పోలిస్తే గోల్డ్ ఈటీఎఫ్‌లు చాలా బెటర్. నచ్చినప్పుడు పెట్టుబడులను గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి వెనక్కి తీసుకోవచ్చు. ఎటువంటి లాకిన్ పీరియడ్ ఉండదు. ఫిజికల్ గోల్డ్ కంటే పేపర్ గోల్డ్ కొనుక్కోవాలనుకునే వారికి గోల్డ్ ఈటీఎఫ్‌లు బెటర్. వీటిలో ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ ద్వారా పెట్టుబడులు పెట్టొచ్చు. గోల్డ్ జ్యువెలరీ, బార్స్, కాయిన్లను ఎక్కువగా కొంటే ఛార్జీలు కూడా ఎక్కువగానే పడతాయి.
కానీ, లో–కాస్ట్ గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసినా తక్కువ ఛార్జీనే పడుతుంది. ధరల్లో పారదర్శకత ఉంటుంది. గోల్డ్ రేటు పెరిగినప్పుడు ఈటీఎఫ్ యూనిట్లను అమ్ముకోవచ్చు. పడినప్పుడు మరింతగా ఇన్వెస్ట్ చేయొచ్చు. స్టాక్ బ్రోకర్ దగ్గర డీమాట్, ట్రేడింగ్ అకౌంట్లను ఓపెన్ చేసుకొని గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకేసారి భారీగా ఇన్వెస్ట్ చేయొచ్చు లేదా కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేయొచ్చు. కనీసం గ్రాము గోల్డ్ కోసం పెట్టుబడి పెట్టాలి. సిప్ మాదిరి ఇన్వెస్ట్ చేసుకోవాలని ఎనలిస్టులు సలహా ఇస్తున్నారు.
ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్ అయిన కొన్ని గోల్డ్ ఈటీఎఫ్‌లు..
1) మిరాయ్ అసెట్ గోల్డ్ ఈటీఎఫ్
2) క్వాంటమ్ గోల్డ్ ఫండ్
3) ఎల్‌ఐసీ ఎంఎఫ్ గోల్డ్ ఈటీఎఫ్
4) యాక్సిస్ గోల్డ్ ఈటీఎఫ్
5) ఆదిత్య బిర్లా సన్ లైఫ్ గోల్డ్ ఈటీఎఫ్
ఛార్జీలు..
గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు, ఎగ్జిట్ అయ్యేటప్పుడు బ్రోకరేజ్ ఛార్జీలు ఉంటాయి. అలానే ఫండ్ మేనేజ్ చేస్తున్నవారు కొంత ఛార్జీ వసూలు చేస్తారు. గోల్డ్ ఈటీఎఫ్‌లను అమ్మడం ద్వారా లాభాలు వస్తే వీటిపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పడుతుంది. 36 నెలల కంటే ఎక్కువ రోజులు హోల్డ్ చేస్తే లాంగ్ టెర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా చూస్తారు. లాభాల్లో 20 శాతం ట్యాక్స్ పడుతుంది. గోల్డ్ ఈటీఎఫ్‌లపై వెల్త్ ట్యాక్స్, జీఎస్‌టీ, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌లు పడవు.
4 కేజీల వరకు..
ఎస్‌జీబీలు కొనాలనుకునేవారు కనీసం గ్రాము నుంచి గరిష్టంగా 4 కేజీల వరకు కొనుక్కోవచ్చు. క్యాష్‌లో పేమెంట్ చేయాలనుకునేవారు గరిష్టంగా రూ.20 వేల వరకు మాత్రమే చేయడానికి వీలుంటుంది. ఇంకా ఒక వ్యక్తి ఎన్ని సార్లు ఎస్‌జీబీల్లో ఇన్వెస్ట్ చేసినా వీరి మొత్తం పెట్టుబడి గరిష్టంగా 4 కేజీలను దాటకూడదు. స్టాక్ మార్కెట్‌లో కొన్నవారికి కూడా ఈ రూల్ వర్తిస్తుంది. బ్యాంకుల్లో ఉన్న గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్లను పరిగణనలోకి తీసుకోరు. ఎస్‌జీబీలను కొంటే ఒక ఐడీ ఇష్యూ చేస్తారు. ఈ ఐడీని బట్టి సంబంధిత వ్యక్తి ఎస్‌జీబీల్లో ఎంత మేర ఇన్వెస్ట్ చేశారో లెక్కిస్తారు. ఈ బాండ్లను డీమాట్ ఫామ్‌లోకి కూడా మార్చుకోవచ్చు. డీమాట్‌గా మారిన బాండ్లను మాత్రమే స్టాక్ ఎక్స్చేంజిల్లో అమ్ముకోవడానికి వీలుంటుంది.