సిరిసిల్ల నేత కార్మికులకు రూ.200 కోట్ల విలువైన కొత్త ఆర్డర్లు

  • రూ. 250 కోట్ల పాత బకాయిలు ఇంకా ఇవ్వని సర్కారు
  • వెంటనే రిలీజ్​చేయాలని మ్యాక్స్ సంఘాల డిమాండ్

రాజన్న సిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల నేత కార్మికులకు రాష్ట్ర సర్కారు ఈ ఏడాది బతుకమ్మ చీరల ఆర్డర్​ఇచ్చింది. సుమారు రూ.200  కోట్ల విలువైన ఈ కొత్త ఆర్డర్​ కింద 95.90 లక్షల చీరలు, జాకెట్​పీసులను సెప్టెంబర్​15లోగా అందించాలని చేనేత, జౌళిశాఖ పేర్కొంది. ఈసారి 21కలర్లు, 25 డిజైన్లలో బతుకమ్మ చీరలు ఉత్పత్తి చేయనున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ గత రెండేళ్లకు సంబంధించి రూ.250 కోట్ల పాత బకాయిలను సర్కారు ఇప్పటికీ ఇవ్వలేదు. నేతకార్మికుల ఆత్మహత్యలు ఆపేందుకే బతుకమ్మ చీరల ఆర్డర్​ ఇస్తున్నామని చెప్తున్న సర్కారు బకాయిల విడుదలలో చేస్తున్న జాప్యంపై  తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బకాయిలు వెంటనే రిలీజ్​చేసి, కష్టాల్లో ఉన్న కార్మికులను ఆదుకోవాలని మ్యాక్స్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

జీఎస్టీ తగ్గించిన కేంద్రం

ఈ ఏడాది బతుకమ్మ కోసం 5.54 కోట్ల మీటర్ల వస్త్రాన్ని ఉత్పత్తి చేయాలని చేనేత జౌళిశాఖ సిరిసిల్ల నేతన్నలకు ఆర్డర్ ఇచ్చింది. 139 మ్యాక్స్ సంఘాలు,126 ఎస్ఎస్ఐ యూనిట్లు చీరల ఉత్పత్తిలో భాగస్వామ్యం కానున్నాయి. చీరలకు ఒక్కో మీటర్ కు రూ. 35.50 చొప్పున రూ. 196 కోట్లు, 68 లక్షల మీటర్ల బ్లౌజ్​బట్ట కోసం మీటర్​కు రూ. 27 చొప్పున రూ. 18 కోట్లకు పైగా చెల్లించనున్నారు. నేత కార్మికులు కొనుగోలు చేసే బట్టపై కేంద్రం మొదట్లో 12 శాతం జీఎస్టీ విధించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఆరు శాతం, కేంద్ర ప్రభుత్వానికి ఆరు శాతం చెల్లిస్తున్నారు. హ్యాండ్లూమ్ పై  కేంద్రం జీఎస్టీని ఒక్క శాతం తగ్గించింది. ముందుగా 6 శాతం జీఎస్టీ చెల్లిస్తే తర్వాత ఒక శాతం చేనేత కార్మికుల ఖాతాలో జమ చేస్తుంది. పాలిస్టర్ బట్టపై ఈ వెసులబాటు లేదు. మరోవైపు చేనేతపై రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జీఎస్టీ తగ్గించలేదు. 

పాత బకాయిలు 250 కోట్లు 

సిరిసిల్ల నేతన్నలకు  బతుకమ్మ చీరల బకాయిలు మూడేండ్లుగా పెండింగ్ లో ఉన్నాయి. పాత బకాయిలను  రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు విడుదల చేయకపోవడంతో అప్పులు తెచ్చిన మ్యాక్స్ సంఘాల నాయకులు మిత్తిలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. 2021 నుంచి బతుకమ్మ చీరలకు సంబంధించి దాదాపు రూ. 149 కోట్లు మ్యాక్స్ సంఘాలకు అందాల్సి ఉంది. బతుకమ్మ చీరలతోపాటు రాజీవ్ విద్యామిషన్, క్రిస్మస్, రంజాన్ పండుగలకు ఇచ్చే కానుకలకు సంబంధించిన వస్ర్తాలు సైతం సిరిసిల్లలోనే ఉత్పత్తి అవుతున్నాయి.  వీటికి సంబంధించి రెండేండ్ల బకాయిలు రావాల్సి ఉంది. 2021 నుంచి రాజీవ్ విద్యామిషన్ స్టూడెంట్స్ యూనిఫాంల ఉత్పత్తికి సంబంధించి 70 లక్షల మీటర్ల ఆర్డర్ ఇచ్చారు. ఇందుకు సంబంధించి దాదాపు రూ. 25 కోట్లు, రంజాన్ పండుగకు అందించే వస్త్రాలకు రూ. 8 కోట్లు, క్రిస్మస్​వస్త్రాలకు రూ. 20 కోట్లు, సోషల్ వెల్ఫేర్​స్టూడెంట్స్ యూనిఫాంలకు రూ. 14 కోట్లు, అంగన్వాడీల కోసం రూ. 3 కోట్లు,  కేసీఆర్ కిట్  కింద ఇచ్చే వస్త్రాలకు సంబంధించి దాదాపు రూ.10 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. మూడేండ్లుగా మ్యాక్స్ సంఘాల నాయకులు అడిగినప్పుడల్లా రూ. రెండు కోట్లు మాత్రమే ప్రభుత్వం విడుదల చేస్తోంది. పాత బకాయిలన్నీ కలిపి దాదాపు రూ. 250 కోట్ల వరకు పెండింగ్ లో పెట్టింది. 

పాత బకాయిలు విడుదల చేయాలి

పాత బకాయిలను క్లియర్ చేయకముందే ప్రభుత్వం ఈ ఏడాది ఆర్డర్లను ఇచ్చింది. ప్రభుత్వం ప్రతి సంవత్సరం బతుకమ్మ చీరలకు సంబంధించిన బడ్జెట్ విడుదల చేయాలి. చిన్నతరహా యజమానులు అప్పులు తెచ్చి చీరలను ఉత్పత్తి చేస్తున్నారు. ప్రభుత్వం బకాయి లేకుండా ప్రతి సంవత్సరం రెగ్యులర్ బడ్జెట్ ను రిలీజ్ చేస్తే యజమానులకు వడ్డీ బాధ తప్పుతుంది. ప్రభుత్వం ఆలస్యం చేస్తే మిత్తిలు మీద పడి నష్టాలపాలవుతారు. రెండు సంవత్సరాల బకాయిలను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలి.

- మండల సత్యం, సిరిసిల్ల పాలిస్టర్ పవర్లూం వస్ర్త ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు 

ప్రభుత్వానికి నివేదించాం

బతుకమ్మ చీరలు, ఇతర ఉత్పత్తులకు సంబంధించిన బకాయిల లెక్కలు ప్రభుత్వానికి నివేదించాం. ఇప్పటికే బతుకమ్మ చీరలకు సంబంధించి  గతేడాది రూ. 50 కోట్లు ప్రభుత్వం నుంచి విడుదలయ్యాయి. అవి నేతన్నల ఖాతాల్లో వేశాం. మిగితా బకాయిలు ప్రభుత్వం రిలీజ్ చేయగానే ఉత్పత్తి దారుల ఖాతాలకు ట్రాన్స్​ఫర్ చేస్తాం. 

- సాగర్, చేనేత జౌళిశాఖ ఏడీ