
- రైతుబంధు, రైతు బీమాకు నోచుకోని దళిత రైతులు
- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సొంతూరులో ఇదీ పరిస్థితి
మెదక్, రామాయంపేట, వెలుగు: వారంతా పేద దళిత రైతులు. వారికి ప్రభుత్వ భూ పంపిణీ స్కీంలో భాగంగా భూమి కేటాయించి... సాక్షాత్తు ప్రధాన మంత్రి చేతుల మీదుగా భూమి పట్టాలు పంపిణీ చేశారు. రెవెన్యూ ఆఫీసర్లు భూమి పొజిషన్ చూపిచ్చారు. అప్పట్లో పట్టదారు పాస్ బుక్‌లు కూడా ఇచ్చారు. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చాక కొత్త పట్టాదార్‌పాస్ బుక్‌లు ఇవ్వలేదు.
దీంతో ప్రభుత్వం అమలు చేసే ఏ స్కీం ఆ రైతులకు వర్తించడంలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నపుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పేద రైతులకు భూమి పంపిణీ పథకాన్ని అమలు చేసింది. 2005 ఆగస్టు 21వ తేదీన మెదక్ పట్టణంలో ఏర్పాటు చేసిన భూ పంపిణీ కార్యక్రమంలో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా రైతులకు పట్టాలు పంపిణీ చేశారు.
ఇందులో భాగంగా మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి స్వగ్రామమైన రామాయంపేట మండలం కోనాపూర్ లో దాదాపు 40 మంది రైతులకు సర్వే నెంబర్ 433లో కొందరికి ఎకరా, మరికొందరికి అరెకరా చొప్పున దాదాపు 50 ఎకరాల వరకు పంపిణీ చేశారు. పట్టాలు అందుకున్న వారిలో దళిత రైతులే ఎక్కువ మంది ఉన్నారు. పట్టా సర్టిఫికెట్లతో పాటు అప్పట్లో రెవెన్యూ అధికారులు పాస్ బుక్ లు కూడా ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం 2017లో భూ ప్రక్షాళన చేపట్టి, 2018లో ధరణి పోర్టల్ అందుబాటులోకి తెచ్చాక కోనాపూర్ రైతులకు సమస్య మొదలైంది. ధరణి పోర్టల్‌లో 433 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిగా చూపిస్తోందని చెప్పి రెవెన్యూ అధికారులు ప్రధాన మంత్రి చేతుల మీదుగా పట్టాలు అందుకున్న రైతులకు కొత్త పాస్‌బుక్‌లు జారీ చేయలేదు.
పాస్ బుక్ లు రాకపోవడంతో సంబధిత రైతులు క్రాప్లోన్లు పొందలేదు. దీంతో పాటు రైతు బంధు పథకం కింద పెట్టుబడి సాయం అందడం లేదు. రైతు బీమాకు నోచుకోవడం లేదు. తమకు పట్టాదారు పాస్‌బుక్‌లు ఇప్పించాలంటూ ఏండ్ల తరబడిగా రెవెన్యూ అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా తమ సమస్య పరిష్కారం కావడం లేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి చెందిన పద్మాదేవేందర్ రెడ్డి రామాయంపేట ఎమ్మెల్యేగా ఉన్నపుడే తమకు భూమి పట్టాలు వచ్చాయని, ఆ తర్వాత ఆమె అధికార పార్టీ తరపున రెండు సార్లు ఎమ్మెల్యే అయినప్పటికీ తమకు కొత్త పాస్ బుక్‌లు ఇప్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కలెక్టర్‌కు మొర..
కోనాపూర్ రైతులు గ్రామానికి చెందిన సాగర్, సిద్దిరాములు ఆధ్వర్యంలో గురువారం మెదక్ కలెక్టరేట్‌కు తరలివచ్చారు. ప్రధాన మంత్రి చేతుల మీదుగా పట్టా సర్టిఫికెట్లు అందుకున్నతమకు కొత్త పాస్‌బుక్‌లు జారీ చేయాలని కోరుతూ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.
సర్కార్ నుంచి ఏమీ వస్తలేవు
మేం చాలా పేదోళ్లం. సొంత భూమి లేదని బతుకు దెరువు కోసం మాకు అప్పట్ల కాంగ్రెస్ గవర్నమెంట్ భూమి ఇచ్చింది. పట్టా సర్టిఫికెట్లు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ గవర్నమెంట్ కొత్త పాస్ బుక్‌లు ఇయ్యలేదు. దీంతో సర్కార్ నుంచి మాకు ఏమీ వస్తలేవు.
టంకరి నర్సమ్మ, మహిళా రైతు
ఎమ్మెల్యే పట్టించుకొని న్యాయం చేయాలి
భూమి ఇచ్చి పొజిషన్చూపిచ్చినా పాస్‌బుక్ లేక మస్తు తిప్పలైతుంది. ఏండ్ల సంది ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నం. కానీ లాభం లేదు. ఇంతకు ముందున్న మా ఊరి ఎమ్మెల్యే మా సమస్యను పట్టించుకోలేదు. ఇపుడొచ్చిన కొత్త ఎమ్మెల్యే అయినా కొత్త పాస్‌బుక్‌లు ఇప్పించి మాకు న్యాయం జరిగేటట్టు చూడాలి.
కొల్గూరి భారతి, మహిళా రైతు
ప్రభుత్వ భూమి కావడం వల్లే
రామాయంపేట మండలం కోనాపూర్ లో 443 సర్వే నంబర్ లో ప్రభుత్వ భూమి ఉండడం వల్లే కొత్త పాస్ బుక్కులు రాలేదు. ఈ విషయాన్ని రైతులు మా దృష్టికి తీసుకు వచ్చారు. కానీ ప్రభుత్వ భూమికి ధరణి లో ఆప్షన్ లేక పోవడం వల్ల రికార్డుకు ఎక్కియ్య లేక పోయాం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటాం.
రజినీ కుమారి, రామాయంపేట తహసీల్దార్