డ్రైవింగ్ ​లైసెన్స్​కు కొత్త పరీక్ష

డ్రైవింగ్ ​లైసెన్స్​కు కొత్త పరీక్ష
  • ఆటోమేటిక్​ డ్రైవింగ్​ టెస్ట్​కు ఆర్టీఏ సన్నాహాలు
  • ప్రస్తుత మాన్యువల్​ పద్ధతికి ఇక చెక్
  • టెస్ట్​ వివరాలు కంప్యూటరైజేషన్​ చేయాలని నిర్ణయం
  • నిబంధనలకు అనుగుణంగా డ్రైవింగ్​ చేస్తేనే లైసెన్స్​జారీ

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్​​పరిధిలో డ్రైవింగ్ ​లైసెన్స్​ జారీ ప్రక్రియను ఆధునీకరించాలని ఆర్టీఏ అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం కొనసాగుతున్న విధానం కంటే మరింత ప్రామాణికంగా డ్రైవింగ్​ టెస్ట్​లు నిర్వహించాలని యోచిస్తున్నారు. ఇందుకోసం ఆటోమేటిక్​ డ్రైవింగ్​ టెస్ట్​నిర్వహించేందుకు ఆర్టీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కొత్త పద్ధతిలో రహదారులపై నిత్యం ఎదురవుతున్న వివిధ రకాల ఇబ్బందులను టెస్ట్​ ట్రాక్​పై కృత్రిమంగా కల్పిస్తారు.

దీంతో టెస్ట్​ డ్రైవింగ్​కు వచ్చేవారు దొడ్డిదారిలో లైసెన్స్​పొందడం ఇక కుదరదని అధికారులు అంటున్నారు. అలాగే, లైసెన్స్​ కోసం దరఖాస్తు చేసుకున్న వారు తప్పని సరిగా టెస్ట్​ రాయాల్సిందేనని చెప్తున్నారు. డ్రైవింగ్​లో బాగా శిక్షణ తీసుకుని నైపుణ్యంతో టెస్ట్​లో పాసైన వారికే లైసెన్స్​జారీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు.
 
దొడ్డిదారిలో లైసెన్స్​ పొందే వారికి చెక్

ప్రస్తుతం యువకులు, మహిళలు, వ్యాపారులు, ఉద్యోగులు ఇలా అన్ని రకాల వారు వాహనాలు నడుపుతున్నారు. చాలా మంది ఎలాంటి టెస్ట్​లు లేకుండా హాయిగా లైసెన్స్​ ఇంటికే రావాలనుకుంటున్నారు. దీని కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. సాధారణంగా డ్రైవింగ్​ లైసెన్స్​పొందాలంటే నెల రోజుల పాటు డ్రైవింగ్​స్కూళ్లలో శిక్షణ పొందాలి. ఆ తర్వాత ఆర్టీఏకు లైసెన్స్​ కోసం దరఖాస్తు చేస్తే వారు పెట్టే పరీక్షలో పాసైన వారికి తాత్కాలిక లైసెన్స్​ జారీ చేస్తారు. ఆరు నెలల తర్వాత ఆర్టీఏ కార్యాలయాల్లోని టెస్ట్​ డ్రైవింగ్​ ట్రాక్​లో వాహనాలను నడిపి చూపిస్తేనే శాశ్వత లైసెన్స్​ ఇస్తారు. కానీ, ఇక్కడే బ్రోకర్లు, ఆర్టీఏ సిబ్బంది రంగ ప్రవేశం చేసి టెస్ట్​లో ఫెయిల్​ కాకుండా మేనేజ్​ చేస్తున్నారు.

కొన్ని సందర్భాల్లో డ్రైవింగ్​టెస్ట్​లో సరిగ్గా వాహనాలను నడపక పోయినా కొందరు అధికారులను మేనేజ్​చేస్తే లైసెన్స్​ ఇచ్చేస్తున్నారు. దీంతో డ్రైవింగ్ లో ​పూర్తి నైపుణ్యం లేని వారికి కూడా లైసెన్స్​లు జారీ అవుతున్నాయి. ఇలా లైసెన్స్​లు పొందిన వారివళ్లే చాలా వరకు యాక్సిడెంట్​లు అవుతున్నాయి. అయినప్పటికీ ఈ విషయాన్ని ఆర్టీఏ అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి పద్ధతికి స్వస్తి పలకాలని, డ్రైవింగ్​లో నైపుణ్యం ఉన్నవారే లైసెన్స్​ పొందే విధంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. 

కొత్త పద్ధతి ఎలా ఉంటుందంటే..

కొత్తగా అమలు చేయబోయే ఆటోమేటిక్​ డ్రైవింగ్​టెస్ట్​లో ఐదు రకాల ట్రాక్​లను ఏర్పాటు చేస్తారు. హెచ్​ అనే ట్రాక్​లో ఆర్టీఏ ప్రమాణాలలో పేర్కొన్న విధంగా వాహనాన్ని రివర్స్​చేయాలి. అలాగే, ఎస్​ అనే ట్రాక్​లో ఒక మూల నుంచి మరో మూలకు వెహికల్​ను టర్న్​చేయాలి. కె అనే ట్రాక్​లో బాగా మలుపులు, ఎత్తుపల్లాలు, ఎత్తయిన ప్రదేశాలు, చిన్న లోయలు వంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. వాటిలో వాహనాన్ని నడపాలి. చివరగా బండిని పార్కింగ్​ చేసి చూపించాల్సి ఉంటుంది.

అలాగే, ట్రాఫిక్​ నిబంధనల ప్రకారం టూ వీలర్స్​ హెల్మెట్,​ ఫోర్​వీలర్స్​ సీటు బెల్ట్​ పెట్టుకోవాలి. ఈ ప్రక్రియ అంతా కంప్యూటర్​లో నమోదు చేసి ఉంటుంది. లైసెన్స్​కోసం వచ్చిన వారు ట్రాక్​పై వాహనాన్ని నడిపేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేసినా కంప్యూటర్​లో నమోదవుతుంది. దీంతో టెస్ట్​లో ఫెయిల్​అయినట్టు చూపిస్తుంది. ఆ తర్వాత మరో నెల రోజుల పాటు ట్రైనింగ్​తీసుకొని రమ్మంటారు. పూర్తిగా కంప్యూటరీకరణ వల్ల ఇక్కడ అధికారులను, సిబ్బందిని మేనేజ్​చేసేందుకు అవకాశం ఉండదని అధికారులు తెలిపారు. అలాగే, బ్రోకర్లకు కూడా అవకాశం ఉండదని చెప్తున్నారు.