ఈయన పేరు ఎంబడి నాగ్ నాథ్. జుక్కల్ మండలం లాడేగావ్ వాసి. నాగ్ నాథ్ తండ్రి హన్మంతు రెండేళ్ల కింద ఆనారోగ్యంతో చనిపోయారు. తల్లి గంగవ్వ ( 51) వితంతు పింఛన్ కోసం ఏడాదిన్నర కింద ఆప్లయ్ చేశాడు. ఇటీవల ఆమెకు కేఎండీసీడీ 02865 నంబర్ పై పెన్షన్ కార్డు ఇచ్చారు. ఊరిలో పైసలు పంపిణీ చేసేటప్పుడు వెళితే పింఛన్ క్యాన్సల్ అయినట్లు చూపిస్తుందని చెప్పారు. గంగవ్వకు ఒక కాలు సరిగ్గా నడవరాక ఇంట్లోనే ఉంటోంది. దీంతో కొడుకు నాగ్ నాథ్ మండల ఆఫీసర్ల వద్దకు వెళితే మీకు భూమి ఎక్కువగా ఉందని, అందుకే పింఛన్ పోయిందని చెప్పారు. తమ భూమిలో వర్షాధార పంటలు తప్ప వేరేవి వేసే పరిస్థితి లేదని, ప్రస్తుతం తాము కూలీ పని చేసుకుంటూ బతుకుతున్నామని నాగ్ నాథ్ వాపోయాడు.
కామారెడ్డి , వెలుగు: గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 57 ఏండ్ల వయస్సు ఉన్న వారికి కూడా ఆసరా పింఛన్ సాంక్షన్ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇటీవల వయస్సు తగ్గించి 57 ఏండ్ల నుంచి ఉన్న వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు కొత్తగా పింఛన్లు శాంక్షన్ చేశారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లాకు 29,678 పెన్షన్లు వచ్చాయి. దీంతో మండల కేంద్రాలు, పెద్ద గ్రామాలు, మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా మీటింగ్ లు ఏర్పాటు చేసి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఆర్భాటంగా పింఛన్ కార్డులు పంపిణీ చేశారు. లబ్ధిదారుల చేతికి కార్డులు వచ్చే వరకూ ఆఫీసర్లు లిస్టును బయటకు వెల్లడించలేదు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు అడిగినా లిస్టు చూపలేదు. కార్డులు వచ్చిన వారంతా పింఛన్ వచ్చిందని సంబురపడ్డారు. ఇటీవల ఫైసలు రిలీజ్ అయ్యాయి. కొత్త కార్డులు తీసుకున్న వారు పైసల కోసం వెళ్లగా ఇందులో చాలామంది పింఛన్లు క్యాన్సల్ అయినట్లు తెలిపారు.
1,098 మందికి రద్దు..
కొత్తగా శాంక్షన్ అయిన పింఛన్లలో 1,098 రద్దు అయ్యాయి. ఇందులో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు ఉన్నారు. అప్లికేషన్లపై ఎలాంటి పరిశీలన చేయక, గైడ్ లైన్స్ లేకుండా మొదట్లో ఆదరబాదరగా శాంక్షన్ చేసి కార్డులు పంపిణీ చేశారు. నెల రోజుల తర్వాత పైసలు పంపిణీ చేసే పక్రియ షురూ అయ్యేటప్పుడు పరిశీలన చేశారు. ధరణి వెబ్ సైట్, ఐటీ చెల్లింపులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ట్రాన్స్ పోర్ట్ డిఫార్ట్ మెంట్ దగ్గర పోర్ వీలర్ రిజిస్ట్రేషన్ ఉన్న ఫ్యామిలీల వివరాలు, ఆధార్ కార్డు లింక్ ద్వారా కొత్తగా శాంక్షన్ అయిన పింఛన్లలో 1,098 క్యాన్సల్ చేశారు.
పేద, మధ్య తరగతి వాళ్లే ఎక్కువ..
పింఛన్లు క్యాన్సల్ అయిన వారిలో ఎక్కువ మంది పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారే ఉన్నారు. వీరిలో బతుకు దెరువు కోసం ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల్లో లోన్ తీసుకుని ట్రాక్టర్, జీపు, కార్లు కొనుక్కొని బతికే వాళ్లు ఉన్నారు. వీరిలో కొందరు ఆ వెహికల్స్ అమ్మేశారు. కొందరు వ్యక్తులు ఫైనాన్స్ లోన్ పేమెంట్ చేయకపోవడంతో వాటిని లాక్కెళ్లారు. వెహికల్ రిజిస్ట్రేషన్ సంబంధిత వ్యక్తుల పేరిట ఉండడంతో వారి ఫ్యామిలీలోని వారి పింఛన్ రద్దు చేశారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. మరో వైపు 60 ఏండ్లు ఉన్నా కూడా చాలా మందికి వృద్ధాప్య పెన్షన్ రాలేదు.
అర్హులుంటే పరిశీలన చేస్తాం..
కార్డుల పంపిణీ తర్వాత ఆన్ లైన్ లో ధరణి పోర్టర్, ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ రిజిస్ట్రేషన్ల ప్రకారం పరిశీలన చేశాం. ఎక్కువ భూమి ఉన్న వారికి, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఐటీ చెల్లించే ఫ్యామిలీలకు కూడా పింఛన్లు వచ్చాయని గుర్తించి రద్దు చేశాం. ఒక వేళ అందులో అర్హులుండి అప్లికేషన్ పెడితే పరిశీలన చేసి ఉన్నతాధికారులకు నివేదిస్తాం. - సాయన్న, డీఆర్డీవో, కామారెడ్డి జిల్లా