
కరీంనగర్/గోదావరిఖని/రాజన్నసిరిసిల్ల: ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, రామగుండం కమిషనరేట్లకు, రాజన్నసిరిసిల్ల జిల్లాకు కొత్త పోలీస్ బాసులు వచ్చారు. కరీంనగర్ సీపీగా గౌస్ ఆలం, రామగుండం సీపీగా అంబర్కిశోర్ ఝా, రాజన్న సిరిసిల్ల ఎస్పీగా గిటే మహేశ్ బాబాసాహేబ్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత కరీంనగర్ సీపీ అభిషేక్‌మహంతి ఏపీకి వెళ్లారు. రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్‌ను హైదరాబాద్ సీఐడీ ఐజీగా బదిలీ చేశారు.
దీంతోపాటు పెద్దపల్లి డీసీపీగా పనిచేసిన డాక్టర్ చేతనను హైదరాబాద్ ఉమెన్ సేప్టీ వింగ్ ఎస్పీగా బదిలీ చేశారు. ఆమె స్థానంలో పోస్టింగ్ కోసం వెయిటింగ్లో ఉన్న నాన్ క్యాడర్ ఆఫీసర్ పి.కరుణాకర్‌ను డీసీపీగా నియమించారు. రాజన్నసిరిసిల్ల ఎస్పీగా గిటే మహేశ్ బాబాసాహేబ్ బదిలీపై వచ్చారు. ఈయన ప్రస్తుతం ములుగు ఓఎస్డీగా విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మూడేండ్లుగా ఎస్పీగా ఉన్న అఖిల్ మహాజన్ ఆదిలాబాద్ జిల్లాకు ట్రాన్స్‌ఫర్ అయ్యారు.
కరీంనగర్ సీపీగా గౌస్ ఆలం
కరీంనగర్ సీపీ గౌస్ ఆలం 2017 బ్యాచ్ కు చెందినవారు. ఆయన ప్రస్తుతం ఆదిలాబాద్ ఎస్పీగా పనిచేస్తున్నారు. గతంలో ఏటూరునాగారం అడిషనల్ ఎస్పీగా, ములుగు ఓఎస్డీ గా, ఎస్పీగా పని చేశారు. బిహార్‌కు చెందిన ఆలం ఐఐటీ- ముంబై నుంచి 2014లో బీటెక్(మెకానికల్) పూర్తి చేశారు. ఓ ఎంఎన్ సీ కంపెనీలో పని చేస్తూ ఫస్ట్ అటెంప్ట్ లోనే ఐపీఎస్ సాధించారు.