గిగ్ వర్కర్లకు కొత్త పాలసీ.. ఉద్యోగ భద్రత, బీమా, ఇతర హక్కులతో చట్టం!

గిగ్ వర్కర్లకు కొత్త పాలసీ.. ఉద్యోగ భద్రత, బీమా, ఇతర హక్కులతో చట్టం!
  • న్యాయ శాఖ ఆమోదానికి ప్రతిపాదనలు పంపిన కార్మిక శాఖ
  • క్లియరెన్స్ రాగానే నోటిఫికేషన్ 
  • అభ్యంతరాల స్వీకరణకు నెల రోజులు గడవు
  • రాష్ట్రంలో స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్​లో 8 లక్షల మంది వర్కర్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ డెలివరీ, ట్రాన్స్ పోర్ట్, ప్యాకేజ్  డెలివరీల్లో పనిచేసే గిగ్  వర్కర్ల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలసీని రూపొందించింది. గిగ్  వర్కర్ల ఉద్యోగ భద్రత, జీతాలు, యాక్సిడెంటల్  బీమా, గ్రీవెన్స్ సెల్, ఫిర్యాదులు వాటి పరిష్కారం, సామాజిక భద్రత, వర్కర్లపై కంపెనీల వేధింపులు జరిపినపుడు చర్యలు తీసుకోవటం వంటి అంశాలు ఈ పాలసీలో ఉన్నాయి.  అదేవిధంగా కంపెనీల 1 శాతం సెస్​ను వర్కర్ల భద్రతకు ఉపయోగించాలని పాలసీలో స్పష్టం చేశారు. 

ఈ పాలసీపై క్లియరెన్స్  కోసం న్యాయ శాఖకు కార్మిక శాఖ ప్రతిపాదనలు పంపింది. వారంలో క్లియరెన్స్  రానుందని కార్మిక శాఖ అధికారులు చెబుతున్నారు. క్లియరెన్స్  రాగానే నోటిఫికేషన్ ఇచ్చి పబ్లిక్  నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలు స్వీకరించి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. అభ్యంతరాల స్వీకరణకు నెల రోజుల గడువు ఇవ్వనున్నారు. రాష్ర్టంలో స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్​తో పాటు ఇతర రంగాల్లో పనిచేస్తున్న గిగ్  వర్కర్లు మొత్తం సుమారు 7  లక్షల మంది ఉన్నారని కార్మిక శాఖ లెక్కలు చెబుతున్నాయి. 

కార్మికులు రోజూ 8 నుంచి 12 గంటలు పనిచేస్తుండడం, కంపెనీల నుంచి వేధింపులు, శారీరక శ్రమ, అభద్రతాభావం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ పోషణ భారంగా మారుతున్నాయని, టార్గెట్లు, ఇన్ టైమ్ లో డెలీవరీ చేయడం, ట్రాఫిక్  సమస్యలతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు గత కొన్నేళ్లుగా పలు సర్వేల్లో  వెల్లడైంది. వీరి భద్రతకు చట్టం తెస్తామని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో భారత్ జోడో యాత్రకు  వచ్చినప్పుడు గిగ్  వర్కర్లు, ప్లాట్ ఫాం వర్కర్లతో  సమావేశమయినప్పుడు కాంగ్రెస్  అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. 

ఇందులో భాగంగా 2023 డిసెంబర్  30న గిగ్, ప్లాట్ ఫాం వర్కర్లు మరణిస్తే రూ.5 లక్షలు యాక్సిడెంటల్  డెత్  ఇన్సూరెన్స్ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరికి ఆరోగ్య శ్రీ స్కీమ్  వర్తించేలా  వర్కర్ల రిజిసస్ర్టేషన్ల వివరాలను ఆ పోర్టల్ కు కార్మిక శాఖ  అనుసంధానం  చేస్తోంది. 

4 రాష్ట్రాల్లో పాలసీకి కసరత్తు

జార్ఖండ్, కర్నాటక, రాజస్థాన్​లో గిగ్  వర్కర్ల కోసం పాలసీని తీసుకొచ్చేందుకు అక్కడి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లో డ్రాఫ్ట్  రెడీ అయినప్పటికీ ఇంకా చట్టం కార్యరూపం దాల్చలేదని అధికారులు చెబుతున్నారు. ఆ రాష్ట్రాల కన్నా ముందే అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే జరిగితే గిగ్  వర్కర్ల రక్షణకు పాలసీ తీసుకొచ్చిన మొదటి రాష్ర్టంగా తెలంగాణ నిలవనుంది.

స్థితిగతులపై సీజీజీతో స్టడీ

రాష్ట్రంలో ఫుడ్  డెలివరీ యాప్ లు, ఓలా, ఉబర్ లో పనిచేస్తున్న గిగ్  వర్కర్లు సుమారు 3 లక్షల మంది ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ట్రాన్స్​పోర్ట్ ఫీల్డ్​లో ఎక్కువ మంది పార్ట్ టైమ్​గా చేస్తున్న వారని, వారి సంక్షేమం గురించి ఈ పాలసీలో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. వీరి జీవన స్థితిగతులపై సెంటర్  ఫర్  గుడ్  గవర్నెన్స్ (సీజీజీ) తో ప్రభుత్వం అధ్యయనం చేయించింది. ఈ రిపోర్ట్​ను పరిశీలించి కొత్త పాలసీని రెడీ చేస్తున్నారు.

ఏండ్లుగా గిగ్ వర్కర్లుగానే

కరోనా తర్వాత గిగ్  రంగంలోకి వచ్చేవారి సంఖ్య బాగా పెరిగింది. దీంతో వారి సగటు ఆదాయం తగ్గిపోయింది. ఎక్కువ సమయం పనిచేసినా... మెయింటెనెన్స్, ఇతర ఖర్చులు పోను నెలకు రూ.15వేలు –రూ.20 వేలు మాత్రమే మిగులుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. 22 నుంచి 30 ఏండ్ల మధ్య గిగ్  వర్కర్లు ఈ వృత్తిని తాత్కాలిక ఉద్యోగంగా భావిస్తున్నారు. 2020–-21 నాటికి దేశంలో 77 లక్షల మంది గిగ్  వర్కర్లు ఉండగా, 2029–-30 నాటికి వారి సంఖ్య 2.35 కోట్లకు చేరుకుంటుందని నీతి ఆయోగ్  అంచనా వేసింది.

కంపెనీ ప్రతినిధులతో కార్మిక శాఖ మీటింగ్

గిగ్  వర్కర్లకు ప్రభుత్వం తీసుకురానున్న చట్టంపై ఇటీవల స్విగ్గి, జొమాటో, ఓలా, ఉబర్ తో పాటు పలు కంపెనీల ప్రతినిధులు, యూనియన్లు, ఎన్జీవోలు, మేధావులతో  కార్మిక శాఖ మీటింగ్  నిర్వహించింది. చట్టంలో చేర్చే  అంశాలను వారికి వివరించారు. వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకొని కొన్నింటిని పాలసీలో చేర్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పనిచేస్తున్న గిగ్ వర్కర్ల వివరాలను రిజిస్ట్రేషన్  చేసే ప్రాసెస్  కూడా ప్రారంభమైందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 వేల మంది గిగ్  వర్కర్లు యాప్​లో రిజిస్ట్రేషన్  చేసుకున్నట్లు తెలుస్తోంది.