జహీరాబాద్ కు కొత్త రైల్వే లైన్

జహీరాబాద్ కు కొత్త రైల్వే లైన్
  • వికారాబాద్ మీదుగా తాండూరుకు 75 కిలోమీటర్ల రైలు మార్గం
  • రూ.1,350 కోట్లతో నిర్మించనున్న రైల్వే లైన్​
  • పూర్తయిన సర్వే పనులు

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కు కొత్త రైలు మార్గం పడనుంది. జహీరాబాద్ నుంచి వికారాబాద్, వయా తాండూరు మీదుగా 75 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ వేయనున్నారు. ఇందుకు అవసరమైన సర్వే పనులు ఇప్పటికే పూర్తి కాగా మిగతా పనులు పూర్తి చేసేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే రూ.1,350 కోట్లు ఖర్చు చేయనుంది. తాండూరు సిమెంట్ క్లస్టర్ నుంచి జహీరాబాద్ వరకు సరుకు  రవాణాతోపాటు ప్రయాణికుల అవసరాలు తీర్చేందుకు ఈ రైల్వే లైన్ ఉపయోగపడనుంది. 

కొత్తగా వేసే ఈ రైలు మార్గం పూర్తయితే సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలతో పాటు తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర ప్రజల రవాణా సౌకర్యాలు మెరుగుపడుతాయి. పైగా రెండు రాష్ట్రాలకు బార్డర్ గా ఉన్న జహీరాబాద్ ప్రాంతం పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందనుంది. నిజాం కాలంలో ఏర్పాటు చేసిన జహీరాబాద్ రైల్వే లైన్ ను మరింత విస్తరిస్తున్న నేపథ్యంలో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్ కృషిని అందరూ అభినందిస్తున్నారు. 

తగ్గనున్న దూర భారం

ప్రస్తుతం జహీరాబాద్ నుంచి తాండూరుకు వెళ్లాలంటే నేరుగా రైలు మార్గం లేదు. జహీరాబాద్ నుంచి తాండూర్ కు బస్సు ద్వారా వెళ్లాలంటే 54 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలు మధ్యలో కలవడంతో రోడ్డు మార్గం నిత్యం సమస్యగానే ఉంటుంది. గతుకుల రోడ్ల కారణంగా తాండూర్ చేరాలంటే కనీసం మూడు గంటలు పడుతోంది. దీంతో జహీరాబాద్ ప్రాంత ప్రజలు రైలు మార్గం ద్వారా104 కిలోమీటర్లు ప్రయాణం చేసి వికారాబాద్ కు వెళ్లి అక్కడి నుంచి మరో రైలు ఎక్కి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాండూరుకు చేరాల్సి ఉంటుంది. 

తాండూరులో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీల కారణంగా జహీరాబాద్ నుంచి సరుకు రవాణాతోపాటు ప్రయాణికుల రాకపోకలు అధికంగా ఉంటాయి. జహీరాబాద్ నుంచి నేరుగా తాండూరుకు కొత్త రైల్వేలైన్ ఏర్పాటైతే తక్కువ చార్జీలతో  సౌకర్యంగా వెళ్లే అవకాశం లభిస్తుందని ప్రయాణికులు భావిస్తున్నారు. కాగా రైల్వే లైన్​మధ్యలో గేట్ల సాయం లేకుండా కొత్తగా ఆర్ వోబీలు, అండర్ బ్రిడ్జిలు నిర్మించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. 

సరుకు రవాణా

తాండూర్ లో ఉన్న సిమెంట్ క్లస్టర్ల వల్ల తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్రకు ఎక్కువగా సిమెంట్ రవాణా జరుగుతుంది. దీంతో ట్రాన్స్ పోర్టేషన్ కు చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ కొత్త రైల్వే లైన్ ఏర్పాటైతే ఇటు ​ప్రయాణికులకు అటు వ్యాపారులకు చాలా ఉపయోగపడనుంది. పైగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం షేకాపూర్, మల్చేల్మ, కోహిర్ మండలం గోడిగార్ పల్లి, బడంపేట్, వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం పెద్దేముల్, బొప్పనారం మండలం ఇందూరు, తట్టేపల్లి, గుండ్లపల్లి, తాండూర్ మండలం కరణ్ కోర్, మల్కాపూర్, చల్కటూరు గ్రామాల ప్రజలు కొత్తగా రైల్వే సేవలు పొందుతారు. 

ప్రయాణ భారం తగ్గుతుంది

జహీరాబాద్ నుంచి తాండూర్ మీదుగా వికారాబాద్ వెళ్లేందుకు రైలు మార్గం వేయడం సంతోషంగా ఉంది. ఈ రైలు మార్గం వల్ల సమయం కలిసి రావడమే కాకుండా ఆర్థిక భారం తగ్గుతుంది. తాండూరుకు నేరుగా రైలు మార్గం వేయాలని అనేక సందర్భాల్లో ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చాం. ఇక్కడి ప్రజల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వద్ద వినిపించి ఒప్పించిన ఎంపీ సురేశ్ షెట్కార్ కు ధన్యవాదాలు. ఈ కొత్త రైలు మార్గం ద్వారా మూడు రాష్ట్రాల ప్రజలకు మేలు జరుగనుంది.- మంజూర్ అహమ్మద్, వ్యాపారి, జహీరాబాద్

పారిశ్రామికంగా అభివృద్ధి

తాండూర్ కు జహీరాబాద్ నుంచి నేరుగా రైల్వే లైన్ వేయడం వల్ల పారిశ్రామికంగా జహీరాబాద్ మరింత అభివృద్ధి చెందనుంది. ప్రస్తుతం జహీరాబాద్ నుంచి తాండూర్ వెళ్లేందుకు ఉన్న రోడ్డు మార్గం రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండడంతో నిత్యం రవాణా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో రవాణా సౌకర్యాలు సరిగా లేక దాదాపు 60 కిలోమీటర్లు అదనంగా ప్రయాణం చేయాల్సి వస్తోంది. నాలాంటి వ్యాపారస్తులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఈ కొత్త రైలు మార్గం పడితే తక్కువ ఛార్జీతో సౌకర్యంగా వెళ్లి రావడానికి వీలుంటుంది.- నర్సింలు, వ్యాపారి, జహీరాబాద్