మీసేవ సెంటర్ల వద్ద జనం బారులు..రేషన్ కార్డు దరఖాస్తు కోసం గంటల తరబడి క్యూలైన్లు

మీసేవ సెంటర్ల వద్ద జనం బారులు..రేషన్ కార్డు దరఖాస్తు కోసం గంటల తరబడి క్యూలైన్లు
  • ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వాళ్లూ మళ్లీ దరఖాస్తు
  • మొరాయిస్తున్న సర్వర్లు.. ఇతర సేవలపైనా ప్రభావం   
  • కొత్త కార్డులకు ఎప్పుడైనా అప్లయ్ చేసుకోవచ్చు
  • ఎలాంటి లాస్ట్ ​డేట్ ​లేదని అధికారుల వెల్లడి

హైదరాబాద్ సిటీ, వెలుగు: కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసేందుకు జనం మీ–సేవల వద్ద బారులు తీరుతున్నారు. రెండు రోజులుగా ఏ సెంటర్ చూసినా వందలాది మందితో రద్దీ నెలకొంటున్నది. జనం ఎక్కువవడంతో గేట్స్ క్లోజ్ చేసి పది మంది చొప్పున లోపలికి అనుమతించి.. వారి దరఖాస్తులు పూర్తయిన తరువాత మరొకరికి అవకాశం ఇస్తున్నారు. దీంతో అప్లికేషన్ ఫామ్ తీసుకున్న తర్వాత గంటల తరబడి క్యూలైన్లలో వెయిట్ చేయాల్సి వస్తోంది. రేషన్ కార్డు దరఖాస్తు నిరంతర ప్రక్రియ అని అధికారులు చెప్తున్నప్పటికీ జనం ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారు కూడా మళ్లీ దరఖాస్తు చేసేందుకు వస్తున్నారు. అప్పట్లో అప్లయ్ చేసినా.. కార్డు రాకపోవడంతో మీ–సేవలో దరఖాస్తు చేసుకుంటున్నట్టు జనం చెప్తున్నారు. మరో వైపు మీ–సేవలపై లోడ్ ఎక్కువ కావడంతో సర్వర్లు మొరాయిస్తున్నాయి. దీంతో కొన్నిచోట్ల గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. రేషన్ కార్డుల కోసం జనం బారులు తీరడంతో ఇతర సేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బర్త్ సర్టిఫికెట్స్, క్యాస్ట్, ఇన్ కమ్ తదతర వాటి కోసం వచ్చేవారికి ఇబ్బందులు తప్పడంలేదు. 

ఎక్కువ డబ్బులు తీసుకుంటే ఫిర్యాదు చేయండి..

కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్ ఫామ్ తో పాటు ఇంటి సభ్యులందరి ఆధార్ కార్డు జిరాక్సులు, కరెంట్ బిల్, గ్యాస్ బిల్ తో అప్లై చేసుకునే అవకాశముంది. రేషన్ కార్డు అప్లికేషన్ కోసం మీ–సేవ నిర్వాహకులు రూ.50 మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, జనం ఒక్కసారిగా తరలివస్తుండడంతో కొందరు రూ.100 నుంచి రూ.200 అంతకు మించి కూడా వసూలు చేస్తున్నారు. ఇలా వసూళ్లకు పాల్పడితే మీ–సేవ హెల్ప్ లైన్ నంబర్ 1100 కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని మీ–సేవ అధికారులు సూచిస్తున్నారు. రెండు రోజుల్లో  ఐదారు ఫిర్యాదులు వచ్చాయని, వారికి షోకాజ్​నోటీసులు ఇచ్చామని, కొద్దిరోజుల్లో విచారణ జరిపి లైసెన్స్ రద్దు చేస్తామని పేర్కొన్నారు. అలాగే, టెక్నికల్ సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

 కొత్త కార్డులకు ఎప్పుడైనా అప్లై చేసుకొవచ్చు: సివిల్​ సప్లయ్స్

కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు ఎప్పుడైనా ఇవ్వొచ్చని సివిల్​ సప్లయ్స్ శాఖ  స్పష్టత ఇచ్చింది. జనం మీ- సేవ సెంటర్లకు భారీగా వస్తుండడంతో బుధవారం ఆ​ శాఖ స్పందించింది. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు నిరంతర ప్రక్రియని, ఎలాంటి లాస్ట్ ​డేట్ లేదని స్పష్టం చేసింది. దరఖాస్తుల స్వీకరణ నిరంతరం కొనసాగుతుందని.. ఇప్పటి వరకు అప్లై చేయని వారు ఎప్పుడు కావాలన్నా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించింది.