
- త్వరలో కొత్త రేషన్ కార్డులు మంజూరు
- ఆకుపచ్చ రంగులో ఏపీఎల్ కార్డులు
- సన్న బియ్యంతోపాటు త్వరలో సరకులు కూడా పంపిణీ చేస్తాం
మేళ్లచెరువు/కోదాడ/నేరేడుచర్ల/హుజూర్నగగర్, వెలుగు : పేదలకు ఆహార భద్రత కల్పించేందుకు రాష్ట్రంలో మరో కొత్త పథకం రాబోతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో కొత్త తెల్లరేషన్ కార్డులను మంజూరు చేయబోతున్నామని, ఈ కార్డులు తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉంటాయన్నారు. హుజూర్నగర్ లో ఈనెల 30న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సన్నబియ్యం పంపిణీ సందర్భంగా శనివారం మేళ్లచెరువు, కోదాడ, నేరేడుచర్ల మండల కేంద్రాల్లో పార్టీ ముఖ్యకార్యకర్తలతో వేర్వేరుగా సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 84 శాతం ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
రేషన్ షాపుల్లో సన్న బియ్యంతోపాటు నిత్యావసర సరుకులను కూడా పంపిణీ చేస్తామని వెల్లడించారు. చరిత్రలో ఇదో విప్లవాత్మక మార్పు అని, దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంతవరకు పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయలేదన్నారు. రాష్ట్రంలో పేదలకు సన్న బియ్యం పండగ రూపంలో ఉగాదికి వస్తుందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89.73 లక్షల తెల్లరేషన్ కార్డులుండగా 2.8 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు. అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు అదనంగా మరో 30 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల సంఖ్య 3.10 కోట్లకు చేరుకుంటుందన్నారు. ఖరీఫ్ సీజన్ లో 4.41 లక్షల మంది రైతుల నుంచి 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వెల్లడించారు.
సీఎం సభకు భారీగా తరలిరావాలి..
హుజూర్నగర్ లో నేడు జరిగే సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభకు ప్రజలు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి సక్సెస్ చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. గ్రామాల నుంచి పార్టీలకతీతంగా అందరూ వచ్చేలా ఏర్పాట్లు చేయాలని నాయకులకు సూచించారు. ఈ సభకు స్పీకర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు రాష్ట్ర ముఖ్యనాయకులు హాజరుకానున్నట్లు తెలిపారు.